100 Test Matches Players : టెస్టు క్రికెట్ హిస్టరీలో 2024 మార్చి నెల ప్రత్యేకంగా నిలవనుంది. ఎందుకంటే క్రికెట్‌లో ఒక్క రోజు వ్యవధిలో నలుగురు స్టార్ క్రికెటర్లు సెంచరీలు కొట్టబోతున్నారు. అదేనండీ సెంచరీ టెస్ట్ ఆడబోతున్నారు. మార్చి 7, 8 తేదీలలో భారత స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్‌తో పాటు ఇంగ్లాండ్ మిడిలార్డర్ బ్యాటర్ జానీ బెయిర్ స్టో మార్చి 7న ధర్మశాల వేదికగా జరగబోయే ఐదో టెస్టులో వందో టెస్టు ఆడనుండగా - వీరిద్దరితో పాటు న్యూజిలాండ్, ఆస్ట్రేలియా మధ్య మార్చి 8 నుంచి జరగనున్న రెండో టెస్టులో కివీస్ స్టార్ బ్యాటర్ కేన్ విలియమ్సన్ - దిగ్గజ పేసర్ టిమ్ సౌథీలు తమ వందో టెస్టు బరిలో దిగనున్నారు.
అయితే ఈ రికార్డుకు సంబంధించిన సరైన సమాచారం లేదు. ఒక రోజు వ్యవధిలో నలుగురు స్టార్ క్రికెటర్లు వందో టెస్ట్ మ్యాచ్ ఆడటం క్రికెట్ చరిత్రలో బహుశా ఇదే తొలిసారి. ఇలాంటి సందర్భం రావడం అరుదు కాదు అసాధ్యమనే చెప్పాలి. మరో విషయమేమిటంటే కొద్ది రోజుల క్రితమే ఫిబ్రవరి 15న ఇంగ్లాండ్‌కు చెందిన మరో ప్లేయర్ వందో టెస్ట్ మైలురాయిని అందుకున్నాడు. పైగా ఈ మ్యాచ్‌లో సెంచరీ కూడా బాదాడు. ఇంగ్లీష్ కెప్టెన్ బెన్ స్టోక్స్ టీమ్ ఇండియాతో జరిగిన మూడో టెస్ట్‌లో ఈ సూపర్ మార్క్‌ను టచ్ చేశాడు.
Ravichandran Ashwin 100th Test : ఇకపోతే తాజా విషయంలోకి వస్తే అశ్విన్ తన వందో టెస్టు ఆడటం ద్వారా ఈ ఫార్మాట్‌లో ఈ మార్క్‌ను టచ్ చేసిన 14వ భారత ప్లేయర్‌గా నిలవనున్నాడు. ఇప్పటివరకు అతడు కెరీర్‌లో 99 టెస్టులు ఆడి 507 వికెట్లు తీశాడు. 3,309 పరుగులను ఖాతాలో వేసుకున్నాడు. ఐదు సెంచరీలు కూడా చేశాడు. ఇంకా ఐదు వికెట్ల ఘనత 35 సార్లు, 8 సార్లు పది వికెట్ల ప్రదర్శన ఉండటం విశేషం. ఇక బెయిర్ స్టో విషయానికొస్తే 99 టెస్టులలో 5,974 రన్స్ సాధించాజు. ఇందులో 12 సెంచరీలు కూడా ఉన్నాయి.