10 Wickets In An Innings : క్రికెట్ హిస్టరీలో ఒక ఇన్నింగ్స్‌లో బౌలర్ 10 వికెట్లు దక్కించుకున్న సందర్భాలు చాలా అరుదు. గతంలో జిమ్ లేకర్ (ఇంగ్లాండ్), అనిల్ కుంబ్లే (భారత్), అజాజ్ పటేల్ (న్యూజిలాండ్) ఈ ముగ్గురు క్రికెటర్లు టెస్టు మ్యాచ్ ఒకే ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు దక్కించుకున్నారు. తాజాగా ఈ ఫీట్ మరోసారి నమోదైంది. మరి అది ఎక్కడంటే?
ముంబయి డొమెస్టిక్ టోర్నమెంట్ కంగా లీగ్ (Kanga League)లో ఈ ఫీట్ రిపీట్ అయ్యింది. టోర్నీలో గౌడ్ సరస్వత్ సీసీ (Gaud Saraswat CC) జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ షోయబ్ ఖాన్ ఈ అరుదైన ఘనత సాధించాడు. లీగ్‌లో భాగంగా రీసెంట్గా జాలీ క్రికెటర్స్ (Jolly Cricketer's) జట్టుతో జరిగిన మ్యాచ్‌లో షోయబ్ ఒకే ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు దక్కించుకున్నాడు. ఈ మ్యాచ్ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 17.4 ఓవర్లు బౌలింగ్ చేసిన షోయబ్ ప్రత్యర్థి జట్టును 67 పరుగులకు ఆలౌట్ చేశాడు. దీంతో ఈ అరుదైన ఘనత సాధించిన బౌలర్‌గా నిలిచాడు. ఇది చూసిన నెటిజన్లు భారత్‌కు మరో అనిల్ కుంబ్లే దొరికేశాడంటూ కామెంట్లు పెడుతున్నారు.
అసలేంటీ కంగా లీగ్
ఇది ముంబయి డొమెస్టిక్ క్రికెట్ లీగ్‌ల్లో ఒకటి. ముంబయికి చెందిన మాజీ క్రికెటర్ హోర్ముజీ కంగా జ్ఞాపకార్థం ఈ టోర్నీ నిర్వహిస్తున్నారు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో కంగా 1905 పరుగులు, 33 వికెట్లు పడగొట్టాడు. అతడు అప్పట్లో ముంబయిలోని శివాజీ పార్క్, క్రాస్ మైదాన్, అజాద్ మైదాన్ లాంటి ప్రతిష్ఠాత్మక గ్రౌండ్స్‌లో ఆడాడు. కాగా, క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్ సైతం ఈ టోర్నీలో ఆడాడు. సచిన్ 11ఏళ్ల వయసులో 1984లో తొలిసారి కంగా లీగ్ టోర్నీలో పాల్గొన్నాడు. ఇక సచిన్ తనయుడు అర్జున్ తెందూల్కర్ కూడా 2013లో ఈ టోర్నీలో ఆడాడు.