Pippalada Story :ఉపనిషత్తును రచించిన మహా జ్ఞాని పిప్పలాదుడు. తన తపస్సుతో మానవులకు జన్మించిన 5 సంవత్సరాల వరకు శని దోషాలు లేకుండా చేసిన గొప్ప మహర్షి. పిప్పలాదుని చరిత్ర ఒక్కసారి చదివితే జీవితంలో శని బాధలు, ఏలినాటి శని దోషాలు తొలగిపోతాయని విశ్వాసం. అసలు ఇంతకీ ఎవరీ పిప్పలాదుడు? ఆయన చరిత్ర ఏమిటి? అనే విశేషాలను ఈ కథనంలో తెలుసుకుందాం.
ఎవరీ పిప్పలాదుడు!
జన్మించిన 5 సంవత్సరాల వరకు శని ప్రభావం ఉండకుండా చేసిన మహానుభావుడు పిప్పలాదుని జన్మ వృత్తాంతం తెలుసుకుందాం. మహా దాన కర్ణుడిగా పేరొంది ఇంద్రుని వజ్రాయుధాన్ని తన ఎముకలను ఇచ్చిన గొప్ప మహర్షి దధీచి. ఆయన మరణానంతరం మృతదేహాన్ని శ్మశానవాటికలో దహనం చేస్తున్నప్పుడు, ఆయన భార్య తన భర్త వియోగాన్ని తట్టుకోలేక, సమీపంలో ఉన్న ఒక పెద్ద రావి చెట్టు రంధ్రంలో తన 3 సంవత్సరాల బాలుడిని ఉంచి ఆమె స్వయంగా చితిలో కూర్చుంది. ఈ విధంగా దధీచి మహర్షి, ఆయన భార్య ఒకే చితిపై దహించుకుపోయారు. కానీ రావి చెట్టు యొక్క రంద్రంలో ఉంచిన పిల్లవాడు ఆకలి మరియు దాహంతో ఏడుపు ప్రారంభించాడు. చుట్టూతా అంధకారం, ఏమీ కనిపించకపోవడం, ఎవరూ లేకపోవడం వల్ల ఆ పిల్లవాడు రావి చెట్టు రంధ్రంలో పడిన రావి చెట్టు పండ్లు తిని పెరిగాడు. తరువాత కాలంలో రావి ఆకులు, పండ్లు తింటూ పెరిగి పెద్దయ్యాడు.
పిల్లవాని వివరాలు తెలుసుకున్న నారదుడు
ఒకరోజు దేవర్షి నారదుడు అటుగా వెళ్తూ రావి చెట్టు రంధ్రంలో ఉన్న పిల్లవాడిని చూసి ఆశ్చర్యపోయి "ఎవరు నువ్వు? అని అడిగాడు. అప్పుడు ఆ పిల్లవాడు "అదే నాకు తెలీడం లేదు. నాకు కూడా తెలుసుకోవాలని ఉంది" అని అంటాడు.
దివ్యదృష్టితో బాలుని వృత్తాంతం
ఆ బాలుని మాటలకు నారదుడు తన దివ్యదృష్టితో చూసి ఆశ్చర్యపోయి ఈ బాలుడు సామాన్యుడు కాదని, గొప్ప దాత మహర్షి దధీచి కొడుకు అని గ్రహించి బాలునితో తన తండ్రి వృత్తాంతాన్ని వివరించాడు.
తండ్రి మరణం గురించి తెలుసుకున్న బాలుడు
నారదుని ద్వారా తన తన తండ్రి దధీచి మహర్షి వృత్తాంతాన్ని తెలుసుకున్న ఆ బాలుడు తన తండ్రి 31 ఏళ్లకే ఎందుకు చనిపోయాడని నారదుని ప్రశ్నిస్తాడు. అప్పుడు నారదుడు దధీచి మహర్షికి శనిదేవుని మహాదశ ఉన్నందున అకాల మరణం సంభవించిందని తెలిపాడు. అప్పుడు ఆ బాలుడు ప్రస్తుతం తన దురదృష్టానికి కారణమేమిటని అడుగగా అందుకు కూడా శనిదేవుని మహాదశయే అని నారదుడు చెబుతాడు.
బాలునికి నామకరణం
నారదుడు బాలునికి అన్ని విషయాలు చెప్పి రావి చెట్టు ఆకులు, పండ్లు తిని జీవించాడు కాబట్టి అతనికి పిప్పలాదుడు అని పేరు పెట్టాడు. సంస్కృతంలో రావి చెట్టును పిప్పల వృక్షం అంటారు. నారదుడు పిప్పలాదునికి దీక్ష ఇచ్చి, తపస్సు చేయమని చెప్పి అక్కడ నుంచి వెళ్లిపోతాడు.