Which Items Dont Buy Evening as Per Astrology:సాయంత్రం 6 గంటలు దాటిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కొన్ని వస్తువులు కొనకూడదని ప్రముఖ జ్యోతిష్య నిపుణులు మాచిరాజు కిరణ్ కుమార్ వివరించారు. తెలిసి తెలియక ఇలా కొనడం వల్ల దురదృష్టం పట్టుకుని.. లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుందని హెచ్చరించారు. మరి సాయంత్రం 6 గంటలు దాటిన తర్వాత కొనకూడని వస్తువులు ఏంటి అన్న ప్రశ్నలకు ఆయన సమాధానం ఇస్తున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
- ముఖ్యంగా సూర్యాస్తమయం తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ఉప్పు కొనకూడదని హెచ్చరిస్తున్నారు. లక్ష్మీ స్వరూపమైన ఉప్పును సాయంత్రం 6 దాటిన తర్వాత కొనుగోలు చేస్తే లక్ష్మీ దేవి అనుగ్రహం తగ్గిపోతుందని చెబుతున్నారు.
- అలాగే నువ్వులు, నువ్వుల నూనె కూడా సూర్యాస్తమయం తర్వాత కొనకూడదని తెలుపుతున్నారు. ఇలా చేయడం వల్ల శని దోషం చుట్టుకుని.. అనేక రకాలైన సమస్యలు ఎదురవుతాయని వివరిస్తున్నారు. ఆముదం గింజలు, ఆముదనూనె కొంటే శని ద్వారా అనేక ఇబ్బందులు కలుగుతాయని చెబుతున్నారు.
- ఇనుముకు సంబంధించిన ఎలాంటి వస్తువులు సాయంత్రం 6 గంటల తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కొనకూడదని చెబుతున్నారు. గొడ్డలి, కత్తులు, గడ్డ పార, గునపం, పలుగు లాంటి వస్తువులు కొనవద్దని సూచిస్తున్నారు.
- తోలు వస్తువులు కూడా సూర్యాస్తమయం తర్వాత కొనకూడదని చెబుతున్నారు. కొంతమంది సాయంత్రం సమయంలో పర్సులు, బెల్టులు లాంటి తోలు వస్తువులు కొంటుంటారు. కాబట్టి, వీటిని కొనుగోలు చేయకూడదని వివరించారు.
- కొందరు ఆడవారు సాయంత్రం సమయంలో షాపింగ్లకు వెళ్తుంటారు. అప్పుడు పిన్నీసులు, సూదులు కొనకూడదని చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల లక్ష్మీ దేవి అనుగ్రహం తగ్గిపోయి దరిద్ర దేవత చుట్టుకుంటుందని తెలిపారు.
- ఇంకా కొంతమంది తెలియక మంచం కింద కొన్ని వస్తువులు పెడుతుంటారు. అలా ఉంచడం వల్ల లక్ష్మీ దేవత చూపు మీపైన ప్రసరించకుండా ఇంట్లో నుంచి వెళ్లిపోతుందని చెబుతున్నారు. డబ్బులను మంచం, పరుపులు, దిండుల కింద పెడితే లక్ష్మీ దేవి అనుగ్రహం తగ్గిపోతుందంటున్నారు. బంగారు ఆభరణాలను కూడా దిండు, మంచం కింద పెట్టకూడదని తెలుపుతున్నారు.
- మంచం కింది భాగంలో చెప్పులు, షూలు, సాక్సులు లాంటివి ఎట్టి పరిస్థితుల్లో ఉంచకూడదన్నారు. దేవత చిత్రపటాలు, పితృదేవతల ఫొటోలు మంచం కింద పెట్టకూడదని చెబుతున్నారు. ఇలా చేస్తే వారి అనుగ్రహం తగ్గిపోతుందని వివరిస్తున్నారు.
- గాజు సీసాలను మంచం కింద పెట్టడం వల్ల లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుందని చెబుతున్నారు.
- ఇనుప వస్తువులు మంచం కింద పెడితే శని దేవుడు ఆగ్రహించి.. దోషాలు చుట్టుకుంటాయని హెచ్చరిస్తున్నారు.
- నూనె సీసాలు కూడా ఎట్టి పరిస్థితుల్లో మంచం కింద పెట్టకూడదని చెబుతున్నారు. ఇలా పెట్టడం వల్ల జాతక శని, రాశి శని దోషాలు పెరిగి ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయని అంటున్నారు.
Note: పైన తెలిపిన వివరాలు కొందరు జ్యోతిష్య నిపుణులు, శాస్త్రంలో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతేకానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకూ విశ్వసించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.