Varalaxmi Vrata Katha Story:సకల పురాణాలలోని కథలు సమగ్రంగా తెలిసిన ఒక మహర్షి "సూతుడు". అతడు నైమిశారణ్యంలో శౌనకాది మహామునుల కోరిక మేరకు అనేక పురాణ కథలను వివరించేవాడని ప్రాచీన గ్రంథాలు చెబుతున్నాయి. అలా చెప్పిన కథలలో అనేక వ్రత కథలు ఉన్నాయి. అందులో ‘వరలక్ష్మీ వ్రతకథ’ కూడా ఒకటి. ఇంతకీ ఆ కథ ఏంటో మనం సవివరంగా తెలుసుకుందాం..
కథేటంటే:పూర్వం శౌనకాది మహర్షులను ఉద్దేశించి సూత మహార్షి ఇలా చెప్పారు. "మునులారా! స్త్రీలకు సౌభాగ్యాన్ని ప్రసాదించే ఒక వ్రతాన్ని పరమ శివుడు పార్వతికి చెప్పారు. లోకోపకారం కోరి ఆ వ్రతం గురించి మీకు తెలియజేస్తాను. శ్రద్ధగా వినండి" అన్నారు. పరమేశ్వరుడు ఒకనాడు తన భస్మసింహాసనంపై కూర్చుని ఉండగా నారదమహర్షి, ఇంద్రాది దిక్పాలకులు స్తుతి స్తోత్రాలతో ఆయను కీర్తిస్తున్నారు. ఆ సమయంలో పార్వతీదేవి.. పరమేశ్వరుడ్ని ఉద్దేశించి "నాథా! స్త్రీలు సర్వసౌఖ్యాలు పొంది, సంతానాన్ని కలిగి ఉండేందుకు తగిన వ్రతం ఒకదానిని చెప్పండి" అని కోరింది". అందుకా త్రినేత్రుడు "దేవీ! నీవు కోరిన విధంగా మహిళలకు సకల శుభాలు కలిగించే వ్రతం ఒకటి ఉంది. అదే వరలక్ష్మీవ్రతం. దానిని శ్రావణమాసం రెండో శుక్రవారం నాడు ఆచరించాలి" అని శివుడు తెలిపాడు.
అప్పుడు పార్వతీదేవి…దేవా! ఈ వరలక్ష్మీ వ్రతాన్ని ఆది దేవతలు ఎవరు చేశారు? ఈ వ్రతాన్ని ఎలా చేయాలో వివరంగా చెప్పండని కోరింది. అప్పుడు శివుడు.. "కాత్యాయనీ.. పూర్వకాలంలో మగధ దేశంలో కుండినం అనే పట్టణం ఒకటి ఉండేది. ఆ పట్టణం బంగారు కుడ్యములతో రమణీయంగా ఉండేది. ఆ పురంలో చారుమతి అనే ఒక స్త్రీ ఉండేది. ఆమె సుగుణవతి. వినయ విధేయతలు, భక్తి గౌరవాలు గలయోగ్యురాలు. ప్రతిరోజూ ప్రాతఃకాలాన నిద్రలేచి భర్త పాదాలకు నమస్కరించి ప్రాతఃకాల గృహకృత్యాలను పూర్తి చేసుకుని అత్తమామల సేవలో తరించేంది.
వరలక్ష్మీ వ్రతం చేసుకోవడానికి అద్వితీయ ముహూర్తం ఇదే - మీకు తెలుసా?
వరలక్ష్మీ సాక్షాత్కారం: వరలక్ష్మీ వ్రతానికి ఆది దేవత అయిన వరలక్ష్మీదేవి ఒకరోజు రాత్రి సమయంలో చారుమతికి కలలో కనిపించింది. ఓ చారుమతీ.. ఈ శ్రావణ పౌర్ణమి నాటికి ముందు వచ్చే శుక్రవారం నాడు నన్ను పూజించు... నీవు కోరిన వరాలు, కానుకలను ఇస్తానని, కోర్కెలు నెరవేర్చుతానని చెప్పి అంతర్థానమైంది. చారుమతి సంతోషించి.." హే జననీ! నీ కృపా కటాక్షాలు కలిగినవారు ధన్యులు. వారు సంపన్నులుగా, విద్వాంసులుగా మన్ననలు పొందుతారు. నా పూర్వజన్మ సుకృతం వల్ల నీ దర్శనం నాకు కలిగింది" అని పరిపరివిధాల వరలక్ష్మీ దేవిని స్తుతించింది.
అంతలోనే మేల్కొన్న చారుమతి అదంతా కలగా గుర్తించి తనకు వచ్చిన కలను భర్తకు, అత్తమామలకు తెలియజేసింది. వారు చాలా సంతోషించి చారుమతిని వరలక్ష్మీ వ్రతాన్ని చేసుకోమని చెప్పారు. చారుమతి కల గురించి విన్న పురంలోని మహిళలు వారు కూడా పౌర్ణమి ముందు రాబోయే శ్రావణ శుక్రవారం కోసం ఎదురుచూడసాగారు.