Vishweshvara Vrat 2024 : ఎన్నో పండుగలకు, విశేషమైన పూజలకు నిలయం కార్తిక మాసం. ఈ మాసంలో ప్రతి రోజూ విశేషమైనదే! ప్రతి విశిష్టమైన రోజు వెనుక ఓ పౌరాణిక గాథ కూడా ఉంటుంది. ఈ సందర్భంగా కార్తిక శుద్ధ చతుర్దశి రోజు జరుపుకునే విశ్వేశ్వర వ్రతం గురించిన విశేషాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
విశ్వేశ్వర వ్రతం అంటే?
కార్తిక శుద్ధ చతుర్దశి రోజున శివుడు కుంఠం అనే రాక్షసుడిని సంహరించాడని పురాణ కథనం. ఈ రోజున శివుని ఆరాధన చేస్తే శత్రు బాధలు తొలగిపోతాయని, జీవితంలో సుఖ సంతోషాలు కలుగుతాయని విశ్వాసం.
విశ్వేశ్వర వ్రతం ఎప్పుడు?
నవంబర్ 14వ తేదీ, గురువారం కార్తిక శుద్ధ చతుర్దశి తిథి ఉదయం 7:47 నిమిషాల నుంచి ఉంది. కాబట్టి ఇదే రోజున విశ్వేశ్వర వ్రతం ఆచరించాలని పంచాంగ కర్తలు సూచిస్తున్నారు.
విశ్వేశ్వర వ్రత విధానం
విశ్వేశ్వర వ్రతం ఆచరించే వారు ఈ రోజు సూర్యోదయంతో నిద్ర లేచి తలారా స్నానం చేసి ఇంట్లో యథావిధిగా నిత్య పూజలు చేసుకొని శివాలయానికి వెళ్ళాలి. శివలింగానికి గంగాజలం, ఆవుపాలతో అభిషేకం జరిపించాలి. అనంతరం మారేడు దళాలు, జిల్లేడు పూలు, తుమ్మి పూలతో శివునికి అష్టోత్తర శతనామ పూజలు జరిపించాలి. శివునికి నైవేద్యంగా తేనె, ఖర్జూరం, కొబ్బరికాయ, అరటిపండ్లు నైవేద్యంగా సమర్పించాలి. ఈ రోజు శివాలయంలో ఆవునేతితో దీపారాధన చేస్తే సంవత్సరమంతా దీపారాధన చేసిన ఫలితం లభిస్తుందని శాస్త్ర వచనం.
సాయంకాలం పూజ
సాయంత్రం తిరిగి స్నానం చేసి శివాలయానికి వెళ్లి వెండితో కానీ, ఇత్తడితో కానీ తయారు చేసిన దీపపు కుందులలో నువ్వుల నూనె పోసి రెండు వత్తులు వేసి దీపాలు వెలిగించి, ఈ దీపాలను కుంకుమ, పూలతో అలంకరించి మంత్రపూర్వకంగా ఆలయ పూజారికి దానం ఇవ్వాలి. కార్తిక మాసంలో వచ్చే విశ్వేశ్వర వ్రతం రోజు దీపదానం చేయడం అత్యంత పుణ్యప్రదమని పురాణ వచనం.