Vimal Aditya Temple Kashi : కాశీ క్షేత్రానికి వెళ్లాలని అనుకున్నంత మాత్రానే సమస్త పాపాలు నశిస్తాయని పురాణాలు చెబుతున్నాయి. జీవితమంతా ఎలా గడిచినా చివరి రోజులు కాశీలో గడపాలని ఎంతో మంది ఆరాటపడుతుంటారు. కాశీలోని మట్టి, గంగా తీర్థం, విశ్వేశ్వర స్వామి లింగం, అన్నపూర్ణాదేవి ఆలయం, డుంఠి గణపతి, చింతామణి గణపతి, కాలభైరవుని ఆలయం ఇలా ఒకటేమిటి ఎన్నో విశేషాలకు నిలయం కాశీ పట్టణం.
12 సూర్య ఆలయాలు
కాశీ పట్టణంలో 12 సూర్యుని ఆలయాలు ఉంటాయి. ఒక్కో ఆలయంలో సూర్యభగవానుడిని ఒక్కో పేరుతో పిలుస్తూ పూజాదికాలు అందుకుంటున్నాడు. అలాంటి వాటిలో ఒకటే 'విమలాదిత్యుడు' కొలువైన ఆలయం.
ఆలయ స్థల పురాణం
పూర్వకాలంలో 'విమలుడు' అనే రాజు కుష్ఠు వ్యాధితో బాధపడుతూ ఉండేవాడు. ఎన్ని మందులు వాడినా, పూజలు వ్రతాలు చేసినా ఆయన కుష్ఠువ్యాధి తగ్గలేదు. వ్యాధితో తీవ్ర మనోవేదన చెందిన విమలుడు విరక్తితో భార్యా బిడ్డలను విడిచి కాశీ క్షేత్రానికి చేరుకుంటాడు. కాశీ పట్టణంలో ఆదిత్యుని రూపాన్ని ప్రతిష్ఠించి ఎంతో భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తాడు. ప్రతిరోజూ గంగా స్నానం చేస్తూ శివుని అభిషేకిస్తూ, ఆదిత్యుని గురించి తపస్సు చేస్తూ కాలం గడపసాగాడు.
ప్రత్యక్ష భగవానుని సాక్షాత్కారం
విమలుని తపస్సుకి మెచ్చిన సూర్యభగవానుడు ప్రత్యక్షమై, అతనిని కుష్ఠు వ్యాధి నుంచి విముక్తుడిని చేస్తాడు. విమలుడు ప్రతిష్ఠించి పూజించిన మూర్తి కాబట్టి అక్కడి సూర్యుడు విమలాదిత్యుడు పేరుతో ప్రసిద్ధికెక్కాడు.