తెలంగాణ

telangana

ETV Bharat / spiritual

విజయదశమి ఎందుకు జరుపుకుంటాం? దాని వెనుక ఉన్న గాథ ఏమిటి? - VIJAYADASHAMI 2024

విజయాలకు నాంది విజయదశమి- కురుక్షేత్ర యుద్ధంలో పాండవుల విజయం- శమీ చెట్టు పూజ విశిష్టత

Vijayadashami 2024
Vijayadashami 2024 (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Oct 11, 2024, 9:35 PM IST

Vijayadashami Significance :ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు ముగింపు దశకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా చివరి రోజు విజయదశమి రోజు అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరి దేవి అవతారంలో దర్శమివ్వనున్నారు. విజయదశమి తెలుగు రాష్ట్రాలలో అతి పెద్ద పండుగ. ఉత్తర భారతంలో కూడా దుర్గా పూజ పేరుతో నవరాత్రులు ఘనంగా జరుగుతాయి. ఈ సందర్భంగా విజయదశమి ఎందుకు జరుపుకుంటాం? దాని వెనుక ఉన్న గాధ ఏమిటి అనే విషయాలను ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.

విజయదశమి పండుగ వెనుక ఓ గాథ
అపరాజితా దేవి అవతరించిన రోజు విజయదశమి. అపరాజితా దేవి అంటే పరాజయమన్నది ఎరుగని దేవత. త్రిశక్తి స్వరూపమైన ఈ దేవిని పూజిస్తే పరాజయమన్నదే ఉండదు. అమ్మవారు మధు, కైటభులను రాక్షసులను సంహరించి ప్రజలకు సుఖఃశాంతులను అందించినది కూడా ఈ రోజే!

విజయాలకు నాంది విజయదశమి
విజయదశమి సర్వ విజయాలకు నాంది. ఈ రోజు ఏ పనిని ప్రారంభించినా విజయం తధ్యం. విజయదశమి రోజునే శ్రీరాముడు లోకకంటకుడైన రావణ సంహారం చేసాడు. అందుకే ఈ రోజు ప్రజలు శ్రీరాముని విజయానికి సంకేతంగా రావణ దహనం కూడా చేస్తారు.

కురుక్షేత్ర యుద్ధంలో పాండవుల విజయం
ఇక మహాభారతానికి వస్తే ధర్మరాజు శకునితో మాయా జూదంలో పరాజయం పాలైన తర్వాత పాండవులు పన్నెండేళ్లు అరణ్యవాసం, ఒక ఏడాది అజ్ఞాతవాసం చేయాల్సివచ్చింది. అప్పుడు పాండవులు అరణ్యవాసం ముగించుకొని అజ్ఞాతవాసం కోసం విరాటరాజు కొలువులోకి ప్రవేశించేముందు శమీ చెట్టుపై తమ ఆయుధాలను దాచి ఉంచారు. తిరిగి సంవత్సరం తరువాత పాండవులు తమ ఆయుధాలను జమ్మి చెట్టుపై నుండి తిరిగి తీసుకున్నదే ఈ విజయదశమి రోజునే! అందుకే పాండవులు కురుక్షేత్ర యుద్ధంలో విజయాన్ని సాధించారు.

శమీ చెట్టు పూజ
విజయదశమి పండుగ రోజు సాయంత్రం శమీ చెట్టును పూజించి ఆ చెట్టు ఆకులు ఒకరికొకరు ఇచ్చి పుచ్చుకోవాలి. శమీ ఆకులు విజయానికి సంకేతం. అందుకే ఇలా చేయాలి. ఇక బహిరంగంగా జరిగే రావణ దహనాన్ని తిలకిస్తే మంచిది. ఈ రోజు పాలపిట్టను చూడడం కూడా శుభ సంకేతంగా భావిస్తారు.

పండుగలు సంప్రదాయ చిహ్నాలు
పండుగలు మన సంప్రదాయానికి ప్రతీకలు. పండుగ పది గండాలు పోగొడుతుంటారు. అందుకే మనకు ఉన్నంతలో పండుగ చేసుకోవాలి. మన పిల్లలకు మన పండుగల గొప్ప తనాన్ని తెలియజేయాలి. మన సాంప్రదాయ విలువలను మన భావితరాలకు భద్రంగా అందించాలి. మనమందరం కూడా విజయదశమి పండుగను ఆనందంగా జరుపుకుందాం. ఆ విజయదుర్గ అనుగ్రహంతో సకల విజయాలను పొందుదాం. శ్రీమాత్రేనమః

ముఖ్యగమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ABOUT THE AUTHOR

...view details