Vastu Tips For House Construction : ప్రతిఒక్కరికీ వారి అభిరుచికి తగ్గట్లుగా సొంత ఇల్లు కట్టుకోవాలని ఉంటుంది. దాని కోసం ఎంతో కష్టపడి డబ్బులు దాచుకుని లేకుంటే బ్యాంకు లోన్ తీసుకుని సొంతంటి కలను నెరవేర్చుకుంటారు. అయితే వాస్తు శాస్త్రం మీద నమ్మకం ఉన్నవారు దానికి అనుగుణంగా ఇంటి నిర్మాణం చేసినట్లయితే ఆ ఇంట్లో ఎల్లప్పుడూ ఆనందం వెళ్లి విరుస్తోందని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అంతటి విశిష్టత కలిగిన వాస్తును ఇంటి నిర్మాణంలో ఏ విధంగా పాటించాలో తెలుసుకుందాం.
ప్రవేశ ద్వారం, గ్యాస్ స్టవ్ విషయంలో!
వాస్తు శాస్త్రంలో చిన్న చిన్న విషయాలకు సైతం చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఇంటి ప్రవేశ ద్వారం విషయంలో నిక్కచ్చిగా వాస్తు పాటించాల్సిందే. ప్రవేశ ద్వారం మూలల్లో ఉండకూడదు. అలా పెట్టడం ద్వారా వాస్తు దోషం వస్తుంది. ఇంట్లో గ్యాస్ స్టవ్ దక్షిణ, తూర్పు, ఆగ్నేయ దిశల్లో పెట్టుకోవాలి. గ్యాస్ స్టవ్ గోడకు కనీసం మూడు అంగుళాల దూరంలో ఉండాలి. గుమ్మంలో నుంచి బయటకు కనిపిస్తూ అస్సలు ఉండకూడదు. గ్యాస్ స్టవ్‌కు ఎప్పుడూ సింక్ ఆనుకుని ఉండకూడదు. కొద్ది దూరంలో ఉండడమే మంచిది.
దానిమ్మ మొక్క పెంచితే!
ఇంటి కోసం స్థలం కొనుగోలు చేసిన తర్వాత నిర్మాణానికి డబ్బులు సర్దుబాటు అవ్వకపోతే ఆ ప్లేస్‌లో దానిమ్మ మొక్కను పెంచమని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు. ఇలా చేయడం వల్ల మీకు ఇంటి నిర్మాణం పూర్తవడానికి కావాల్సిన డబ్బులు ఏదో ఒక విధంగా సమకూరుతాయని చెబుతున్నారు. దానిమ్మ చెట్టుకు అంతటి గొప్ప విశిష్టత ఉందని, అందుకే ప్రతి ఇంట్లో తప్పనిసరిగా దానిమ్మ చెట్టు పెంచాలని అంటున్నారు.