Vastu Rules for Buying Home :ప్రస్తుత రోజుల్లో చాలా మంది ఏ చిన్న నిర్మాణం చేపట్టాలన్నా వాస్తుశాస్త్రాన్ని ఫాలో అవుతున్నారు. ఇక అదే నివాసం ఉండే ఇల్లు విషయానికొస్తారా.. దాని నిర్మాణం మొదలు వస్తువుల అమరిక వరకు వాస్తును పాటిస్తుంటారు మెజార్టీ పీపుల్. ఇదిలా ఉంటే.. మీరు ఏదైనా కొత్తగా ఇల్లు కొనాలనే ఆలోచనలో ఉన్నా వాస్తు ప్రకారం.. కొన్ని నియమాలు పాటించడం మంచిది అంటున్నారు వాస్తుశాస్త్ర నిపుణులు. లేదంటే.. మీరు కొనే ఇల్లు ఎంత పెద్దదైనా ఆ ఇంట్లో ఏదైనా వాస్తు దోషాలు ఉంటే సంతోషం, ప్రశాంతత ఉండదని, జీవితంలో నిత్యం ఏదో ఒక సమస్య ఇబ్బంది పెట్టవచ్చంటున్నారు వాస్తు పండితులు. ఇంతకీ, ఇల్లు(House) కొనే ముందు చూడాల్సిన ఆ వాస్తు నియమాలేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ఈశాన్య దిశ :మీరు ఏదైనా ఇల్లు కొనుగోలు చేసే ముందు మొదట పరిశీలించాల్సిన వాస్తు నియమం.. ఆ ఇంటి ఈశాన్య దిశ. ఇది ఇంటికి సంబంధించిన అత్యంత ముఖ్యమైన, సున్నితమైన దిశలలో ఒకటి. ప్రార్థన గది, దేవాలయం లేదా ధ్యాన స్థలం కలిగి ఉండటానికి ఇది అత్యంత అనువైన దిశ అని చెబుతున్నారు వాస్తు పండితులు. ముఖ్యంగా వాస్తుప్రకారం.. టాయిలెట్, కిచెన్, స్టోర్ రూమ్, సెప్టిక్ ట్యాంక్ వంటివి ఈశాన్య దిశలో లేకుండా చూసుకోవడం మంచిది అంటున్నారు వాస్తుశాస్త్ర నిపుణులు.
ఇంటి ప్రవేశ ద్వారం : వాస్తుశాస్త్రం ప్రకారం.. మీరు ఇల్లు కొనే ముందు చూడాల్సిన మరో ముఖ్యమైన అంశం ఇంటి ప్రవేశ ద్వారం(మెయిన్ డోర్/గేట్). ఎందుకంటే ఇది కేవలం అందరూ వచ్చి పోయే మార్గం మాత్రమే కాదు.. సానుకూల శక్తిని లేదా ప్రకంపనలను మోసుకొచ్చే మార్గం కూడా అని మీరు గుర్తుంచుకోవాలి. కాబట్టి వాస్తుప్రకారం ఇంటి ప్రవేశం ద్వారం ఉందో లేదో చూసుకోవాలి. ముఖ్యంగా వాస్తు ప్రకారం మీరు కొనే ఇంటి ప్రవేశ ద్వారం.. ఉత్తరం, తూర్పు లేదా ఈశాన్య దిశలో ఉండేలా చూసుకోవడం మంచిది అంటున్నారు వాస్తుశాస్త్ర నిపుణులు. అలాగే ప్రవేశద్వారం తలుపులు నలుపు రంగులో ఉండకుండా చూసుకోవాలంటున్నారు.
కిచెన్ ప్లేస్మెంట్ : వాస్తుప్రకారం ఇల్లు కొనుగోలు చేసే ముందు చూడాల్సిన మరో అంశం ఏమిటంటే.. వంటగది ప్లేస్మెంట్. అయితే వాస్తుప్రకారం.. మీరు కొనే ఇంట్లో ఆగ్నేయం నుంచి దక్షిణం దిశలో వంటగది ఉన్న దానిని కొనుగోలు చేయడం మంచిది అంటున్నారు వాస్తు పండితులు. అలాకాకుండా కిచెన్.. ఇంటికి ఉత్తరం, ఈశాన్యం లేదా నైరుతి దిశలో ఉంటే సమస్యలు తప్పవంటున్నారు వాస్తుశాస్త్ర నిపుణులు. అలాగే వంటగదిలోని మంట పుట్టించే ఉపకరణాలు ఆగ్నేయ దిశలో ఉండడం శుభప్రదమని సూచిస్తున్నారు వాస్తు పండితులు. వీటితో పాటు వంటగది కలర్స్ కూడా వాస్తుప్రకారం ఉండేలా చూసుకోవాలంటున్నారు. ముఖ్యంగా నలుపు, నీలం లేదా బూడిద రంగులు ఉండకుండా చూసుకోవాలని చెబుతున్నారు.