Vasant Panchami 2025 Date :ప్రతి సంవత్సరమూ మాఘ మాసంలో వచ్చే శుక్ల పంచమిని "వసంత పంచమి"గా వ్యవహరిస్తారు. రుతు సంబంధమైన పండుగ కావడంతో దీనికి ఆ పేరు వచ్చింది. ఈ పర్వదినాన్ని మదన పంచమి, బసంత్ పంచమి, సరస్వతీ పంచమి, శ్రీపంచమి అనే పేర్లతోనూ పిలుస్తారు. ఈరోజే సరస్వతీ జయంతి కావడంతో ఈ పర్వదినం అత్యంత ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. కాబట్టి, ఈ రోజున చదువుల తల్లి సరస్వతీ అమ్మవారిని ప్రత్యేకంగా పూజిస్తారు. మరి, ఈ సంవత్సరం వసంత పంచమి ముహూర్తం ఎప్పుడు? సరస్వతీ దేవిని ఏవిధంగా పూజించాలి? వంటి పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
హిందూ క్యాలెండర్ ప్రకారం అత్యంత పవిత్రమైన పర్వదినంగా భావించే వసంత పంచమి ఈ సంవత్సరం(2025) ఫిబ్రవరి 2 ఆదివారం రోజున వచ్చింది. అయితే, ఈ పవిత్రమైన రోజు సరస్వతి దేవిని ఈవిధంగా పూజిస్తే అమ్మవారి సంపూర్ణ అనుగ్రహం పొందవచ్చంటున్నారు ప్రముఖ జ్యోతిష్య నిపుణులు మాచిరాజు కిరణ్ కుమార్. అలాగే, సంవత్సరం మొత్తం సకల శుభాలు కలుగుతాయంటున్నారు.
వసంత పంచమి పూజా విధానమిలా!
- ముందుగా ఇంట్లోని పూజా మందిరాన్ని శుభ్ర పరచుకోవాలి. ఆ తర్వాత దేవుడి ఫొటోలు ఉండే చోట శుభ్రంగా కడిగిన ఒక పీటను ఏర్పాటు చేసుకోవాలి.
- ఆపై దాని మీద బియ్యప్పిండితో స్వస్తిక్ గుర్తు, అష్టదళ పద్మం ముగ్గు వేయాలి. లేదా స్వస్తిక్ గుర్తు ముగ్గు ఒక్కటీ వేసుకున్నా సరిపోతుందంటున్నారు జ్యోతిష్యులు మాచిరాజు కిరణ్.
- అనంతరం ఆ పీటపై తెల్లని వస్త్రాన్ని పరచి దాని మీద సరస్వతీ దేవి ఫొటోను ఉంచాలి. ఆపై చిత్రపటాన్ని కుంకుమ, గంధం బొట్లతో అలరించుకోవాలి.
- సరస్వతీ దేవికి తొమ్మిది వత్తుల దీపం అంటే చాలా ఇష్టం. కాబట్టి, వసంత పంచమి రోజు అమ్మవారి చిత్రపటం ముందు మట్టి ప్రమిదలో ఆవు నెయ్యి పోసి తొమ్మిది వత్తులను విడివిడిగా వేసుకొని దీపం వెలిగించాలి. అంటే, నార్మల్గా రెండు వత్తులను కలిపి ఒకటిగా చేసి దీపం వెలిగిస్తాం. అలా 9 వత్తులనుచేసి దీపారాధన చేయాలి.