Upanga Lalita Vratham 2024 :దేశవ్యాప్తంగా శరన్నవరాత్రులు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో నవ రాత్రులలో ఐదవ రోజు ముత్తైదువులు దీర్ఘ సుమంగళితనం కోసం విశేషంగా ఆచరించే వ్రత విశేషాలను ఈ కథనంలో తెలుసుకుందాం.
ఉపాంగ లలితా వ్రతం విశిష్టత
ఆశ్వయుజ శుద్ధ పంచమి రోజున 'ఉపాంగ లలితావ్రతం' ఆచరిస్తారు. ఈ రోజు అమ్మవారిని భజన చేస్తూ, జాగరణ చేస్తారు. ఈ వ్రతం ఎక్కువగా మహారాష్ట్ర ప్రాంతంలో ప్రాచుర్యంలో ఉంది. అయితే ఇదే ఈ వ్రతాన్ని తెలుగు రాష్ట్రాలలో సుమంగళి పూజ అని సువాసిని పూజ అని జరుపుకోవడం ఆనవాయితీ. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల అమ్మవారి కటాక్షం లభించి సకల శుభాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం.
లలితా పంచమి
వ్యాస మహర్షి రచించిన దేవీ భాగవతం ప్రకారం 'త్రిపురత్రయం'లో రెండవ శక్తి స్వరూపిణి లలితా పరాభట్టారిక. అందుకే శరన్నవరాత్రులలో వచ్చే పంచమిని 'లలితా పంచమి' అని కూడా అంటారు. చెరకుగడ, విల్లు, పాశము, అంకుశము ధరించి, లక్ష్మీదేవి, సరస్వతీదేవి కుడి ఎడమలు సేవలు అందిస్తుండగా శ్రీ లలితా పరాభట్టారిక భక్తుల కష్టాలు తొలగించి, అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తుంది. కన్యలు మంచి భర్త కొరకు, ముత్తైదువులు దీర్ఘ సుమంగళి గా అఖండ సౌభాగ్యం కొరకు ఈ నవ రాత్రులలో అయిదవ రోజు ‘ఉపాంగ లలితా వ్రతం’ ఆచరిస్తారు.
ఉపాంగ లలితా వ్రతం ఎప్పుడు?
ఈ ఏడాది అక్టోబర్ 7 వ తేదీ సోమవారం రోజు ఉపాంగ లలితా వ్రతాన్ని ఆచరించుకోవాలని పంచాంగ కర్తలు సూచిస్తున్నారు.
పూజకు శుభ సమయం
ఉపాంగ లలితా వ్రతం పూజను ఉదయం 10 నుంచి 12 గంటల లోపు చేసుకోవచ్చు.
ఉపాంగ లలితా వ్రతం పూజా విధానం
ఈ రోజు అమ్మవారిని శ్రీ లలితా దేవి అలంకారంలో సహస్రనామ, అష్టోత్తర నామాలతో కుంకుమ పూజలు చేయాలి. ముత్తైదువలకు యధాశక్తి తాంబూలాలు ఇచ్చుకోవాలి. ఈ రోజు ఇళ్లల్లో, దేవాలయాలలో కూడా ముత్తైదువులచే సువాసినీ పూజలు చేయిస్తారు.
నోముల ఉద్యాపన
ఈ రోజు విశేషమైన రోజు కాబట్టి ఎవరైనా కైలాస గౌరీ నోము కాని గ్రామ కుంకుమ నోము కాని నోచుకున్న వారు ఈ రోజు ఉద్యాపన చేసుకుంటారు. కొంతమంది తమ గృహాల్లోనే సామూహిక లక్ష కుంకుమార్చనలు ఏర్పాటు చేసుకుంటారు. బొమ్మల కొలువులు పెట్టుకున్న వారు పేరంటాలు చేసుకుంటారు.
దారిద్య్ర దుఃఖనాశిని
ఉపాంగ లలితా వ్రతం రోజు శ్రీ లలితా దేవి అపారమైన కరుణతో తనని కొలిచిన భక్తుల దారిద్ర దుఃఖాలు నశింపచేస్తుంది. కుంకుమ పూజలు చేసిన వారికి మాంగళ్య సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది. పంచమి నాడు శ్రీ లలితాదేవి దేదీప్యమైన మూర్తిని మనస్సులో ప్రతిష్టించుకుని, 'ఓం శ్రీ మాత్రేనమః' అని వీలైనన్ని సార్లు జపించుకుంటే ఆ చల్లని తల్లి కరుణాకటాక్షాలు తన భక్తులపై ప్రసరింపజేస్తుంది. మనమందరం కూడా ఉపాంగ లలితా వ్రతం రోజు శ్రీ లలితా దేవిని పూజిద్దాం. సకల శుభాలను పొందుదాం. ఓం శ్రీ మాత్రేనమః
ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.