Ugadi Pachadi Importance :తెలుగువారికి కొత్త సంవత్సరం ఉగాది నుంచి ప్రారంభం అవుతుంది. మామూలుగా ఏ పండుగ రోజైన స్పెషల్ అంటే పిండివంటలు, గారెలు, బూరెలు, పాయసం ఉంటాయి. కానీ ఉగాది స్పెషల్ మాత్రం ఉగాది పచ్చడే! తెలుగువారికి మాత్రమే ప్రత్యేకమైన ఈ ఉగాది పచ్చడికి సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం.
షడ్రుచుల సమ్మేళనం
మరే ప్రాంతాల్లో లేని షడ్రుచుల సమ్మేళనంగా తయారయ్యే ఉగాది పచ్చడి తెలుగువారికి మాత్రమే సొంతం. జీవితంలో వచ్చే కష్టసుఖాలను సమానంగా స్వీకరించాలన్న సందేశం అందరికీ అందించడమే ఈ ఉగాది పచ్చడి ప్రత్యేకత. ఈ పచ్చడి తయారీలో వాడే ఒక్కో పదార్థం మనిషి జీవితంలో ఒక్కో అనుభవానికి ప్రతీక అని శాస్త్రం చెబుతోంది.
ఆరు రుచులే కీలకం
ఉగాది పచ్చడి తయారీలో తీపి, పులుపు, కారం, ఉప్పు, చేదు, వగరు అనే ఆరు రకాల రుచులు ఉంటాయి. మరి ఇందులో ఏ రుచి కోసం ఏ పదార్థాన్ని వాడుతారో ఇప్పుడు చూద్దాం.
ఉగాది పచ్చడిలో మొదటి రుచి తీపి
ఉగాది పచ్చడిలో తీపిదనం కోసం కొత్త బెల్లాన్ని వాడుతారు. బెల్లం శరీరానికి శక్తిని అందించి జీర్ణక్రియకు దోహదం చేస్తుంది. దీని మధురమైన రుచి రానున్న కొత్త సంవత్సరం మనకు సుఖసంతోషాలను అందించాలని కోరుకుంటూ బెల్లాన్ని ఉగాది పచ్చడిలో వాడుతాము.
రెండో రుచి పులుపు
Health Benefits Of Ugadi Pachadi :ఉగాది పచ్చడిలో పులుపు కోసం కొత్త చింతపండును వేస్తారు. చింతపండులోని పులుపు కఫవాతాల వల్ల వచ్చే రుగ్మతలను పోగొడుతుందని ఆయుర్వేద శాస్త్రం చెబుతోంది. అలాగే పులుపు రుచి విసుగుకి సంకేతం. నూతన సంవత్సరంలో ఎలాంటి పరిస్థితిలోనూ విసుగు చెందకుండా నేర్పుగా ఉండాలన్న సంకేతం మనకు ఈ పులుపు రుచి నేర్పిస్తుంది.
మూడో రుచి కారం
ఉగాది పచ్చడిలో కారం కోసం పచ్చి మిరపకాయలు లేదా మిరప్పొడిని వాడతారు. కారం మనిషి శరీరంలోని హానికారక క్రిములను నాశనం చేసి పంచేంద్రియాలు చురుగ్గా పనిచేయడానికి దోహదపడుతుందని చెబుతారు. కారం కఠినమైన పరిస్థితులకు సంకేతం. కొత్త సంవత్సరంలో జీవితంలో ఎదురయ్యే కఠినమైన పరిస్థితులను ఎదుర్కోడానికి సిద్ధంగా ఉండాలన్న సంకేతం ఉగాది పచ్చడిలోని ఈ కారం సూచిస్తుంది.
నాలుగో రుచి ఉప్పు
ఉగాది పచ్చడిలోని నాలుగో రుచి ఉప్పు. దీనికోసం సముద్రపు ఉప్పును లేదా సైంధవ లవణాన్ని వాడుతారు. ఉప్పు మనిషికి ఉత్సాహాన్ని, శక్తిని ఇస్తుంది. 'ఉప్పు లేని కూర చప్పనగును' అని కవులు కూడా వర్ణిస్తారు. ఉప్పు లేకపోతే జీవితమే నిస్సారంగా ఉంటుంది. ఉగాది పచ్చడిలో ఉప్పు రుచి కొత్త సంవత్సరంలో ఎన్ని కష్టాలు వచ్చినా సరే నూతన ఉత్సాహంతో, ఉత్తేజంతో ఉండాలన్న స్ఫూర్తిని అందిస్తుంది.
ఐదవ రుచి చేదు
ఉగాది పచ్చడిలో చేదు కోసం లేత వేపపువ్వును వాడుతారు. వేపపువ్వు ఋతువులు మారడం వలన కలిగే అనేక రోగాలను తరిమి కొడుతుంది. చేదు రుచి రానున్న సంవత్సరంలో జీవితంలో కలిగే బాధలకు, దుఃఖానికి సంకేతంగా నిలుస్తుంది. అప్పుడప్పుడు జీవితానికి చేదు అనుభవాలు కూడా అవసరమే కదా! చేదు అనుభవాలను పాఠాలుగా తీసుకొని ముందుకెళ్లాలన్న సంకేతమే ఉగాది పచ్చడిలోని చేదు రుచి తెలియజేస్తుంది.