Tirumala Sri Vari Brahmotsavam Day 7 :కలియుగ ప్రత్యక్ష దైవం ఏడుకొండల వేంకటేశ్వరుని బ్రహ్మోత్సవాలు తిరుమలలో ఘనంగా అత్యంత వైభవోపేతంగా సాగుతున్నాయి. ఈ క్రమంలో ఉత్సవాల ఏడో రోజు రాత్రి శ్రీనివాసుడు చంద్రప్రభ వాహనంలో తిరుమాడ వీధులలో ఊరేగుతూ భక్తులకు దర్శనమీయనున్నాడు. ఈ సందర్భంగా చంద్రప్రభ వాహన సేవ విశిష్టతను తెలుసుకుందాం.
చంద్రప్రభ వాహనం
సూర్యచంద్రులే నేత్రాలుగా!
బ్రహ్మోత్సవాలలో ఏడోరోజు శ్రీనివాసుడు ఉదయం సూర్యప్రభ వాహనంపై, రాత్రి చంద్రప్రభ వాహనంపై తిరుమాడ వీధులలో ఊరేగడం ద్వారా సూర్యచంద్రులు శ్రీవారికి రెండు నేత్రాల వంటి వారని నిరూపించడమే ఈ అవతారం యొక్క పరమార్ధమని శాస్త్రవచనం.
మనశ్శాంతి రోగ నాశనం
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం చంద్రుడు మనఃకారకుడు. ఔషధాలను తేజోవంతం చేసే శక్తి కలవాడు. అందుకే చంద్రప్రభ వాహనంపై ఊరేగుతున్న స్వామివారిని దర్శించుకుంటే మానసిక ప్రశాంతత కలుగుతుంది. సమస్త ఔషధీ తత్వంతో రోగ నాశనం జరుగుతుంది. అంతేకాదు చంద్రప్రభ వాహనంపై ఊరేగే స్వామి దర్శనంతో సకల పాపాలు తొలగి, సమస్త సంపదలు సమకూరుతాయని భక్తుల విశ్వాసం.
చంద్రప్రభ వాహనంపై ఊరేగే శ్రీనివాసునికి నమస్కరిస్తూ ఓం నమో వేంకటేశాయ!
ముఖ్యగమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.