Konark Sun Temple History : సూర్యుడు ఆరోగ్య ప్రదాతగా భావించి పూజిస్తాం. వేరే ఏ ఇతర దేవి దేవతలను విగ్రహాలు, చిత్ర పటాల రూపంలో పూజిస్తూ ఉంటాం. కానీ ప్రత్యక్ష దైవమైన సూర్యుని మనం ప్రతి రోజు చూస్తూ ఉంటాం. సూర్యకాంతి రూపంలో సూర్యుని అనుగ్రహం మనపై ప్రసరిస్తూనే ఉంటుంది. మన దేశంలో సూర్యునికి అనేక దేవాలయాలు ఉన్నప్పటికినీ ముఖ్యంగా 5 దేవాలయాలు మాత్రం చాలా ప్రసిద్ధి చెందినవి. అవేమిటో ఈ కథనంలో తెలుసుకుందాం.
పంచ సూర్య దేవాలయాలు
భారతదేశంలో ప్రాచీన సూర్య దేవాలయాలు చాలా ఉన్నాయి. ఒడిశాలోని కోణార్క్ సూర్య దేవాలయం నుంచి గుజరాత్ మోధేరాలోని సూర్య దేవాలయం వరకు చాలా గొప్ప ఆలయాలు ఉన్నాయి. ఒక్కొక్క ఆలయానికి ఒక చరిత్ర ఉంది. దేశంలోని ఐదు ప్రధాన సూర్య దేవాలయాల గురించి విపులంగా తెలుసునే క్రమంలో ఈ రోజు కోణార్క్ సూర్య దేవాలయం గురించి వివరంగా తెలుసుకుందాం.
కోణార్క్ సూర్య దేవాలయం
దేశంలోని 10 అతి పెద్ద దేవాలయాలలో ఒకటిగా విరాజిల్లుతున్న ఒడిశాలోని కోణార్క్ సూర్య దేవాలయం పూరీ నగరానికి దాదాపు 23 మైళ్ల దూరంలో చంద్రభాగ నది ఒడ్డున ఉంటుంది. ఒడిశాలోని అత్యంత ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణలలో ఈ ఆలయం కూడా ఒకటి.
శిల్పకళా అద్భుతం
కోణార్క్ సూర్య దేవాలయం శిల్పకళా అద్భుతానికి ప్రతీక. ఈ ఆలయ నిర్మాణం ఏడు గుర్రాలతో ఉండే సూర్య భగవానుడి రథాన్ని పోలి ఉండేలా ఉంటుంది. ఈ రథానికి 24 చక్రాలు ఉన్నాయి. 7 గుర్రాలు లాగుతున్నట్లు కనిపిస్తాయి. ఏడు గుర్రాలు వారంలోని ఏడు రోజులను సూచిస్తాయి. 24 చక్రాలు రోజులోని 24 గంటలను సూచిస్తాయి.
కోణార్క్ అంటే
కోణార్క్ అనే పదం రెండు పదాల నుంచి వచ్చింది. కోన అంటే 'మూల' అని, 'ఆర్క్' అంటే సూర్యుడు అని అర్థం. ఈ రెండు కలిపి కోణార్క్ అనే పేరు వచ్చింది.
ఆలయ చరిత్ర
క్రీస్తుశకం 1250 తూర్పు గంగా వంశానికి చెందిన నరసింహ దేవుడు ఈ ఆలయాన్ని నిర్మించారు. ముస్లిం ఆక్రమణ దారులను ఓడించిన తరువాత, నరసింహదేవుడు కోణార్క్‌లో సూర్య దేవాలయాన్ని నిర్మించాడని చరిత్రకారులు చెబుతున్నారు. 15వ శతాబ్దంలో ఆక్రమణ దారులు ఈ ఆలయాన్ని దోచుకున్నారు. ఈ క్రమంలో పూజారులు సూర్య భగవానుని విగ్రహాన్ని భద్రపరిచారు. ఆ సమయంలో ఆలయం మొత్తం తీవ్రంగా ధ్వంసమైంది. బ్రిటిష్ పాలనలో పునరుద్ధరణ పనులు ప్రారంభమయ్యాక కోణార్క్ కొత్త రూపు సంతరించుకుంది.
పూరిలో భద్రంగా
ఆలయంపై దాడి జరిగిన సమయంలో సూర్యభగవానుడి విగ్రహం పూరీ జగన్నాథ ఆలయంలో భద్రంగా ఉంది. ఫలితంగా ఈ ఆలయంలో దేవత విగ్రహం లేదు. కాలగమనానికి సంకేతంగా ఈ ఆలయం నిలుస్తుంది.
కోణార్క్ డాన్స్ ఫెస్టివల్
ప్రతిరోజు నిత్యపూజలు కైంకర్యాలు యధావిధిగా జరిగే ఈ ఆలయంలో డిసెంబర్ నెలలో కోణార్క్ డాన్స్ ఫెస్టివల్ పేరిట వార్షిక నృత్యోత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. ఈ ఉత్సవాన్ని చూడటానికి దేశవిదేశాల నుంచి పర్యాటకులు తరలి వస్తారు. 1986లో మొదలైన ఈ ఉత్సవం నిరాటంకంగా కొనసాగుతోంది. అరుదైన ఈ నృత్య పండుగలో కళాకారులు వారి ప్రతిభను చాటుకుంటారు. వివిధ రకాల నృత్యాలు చేసి సందర్శకులను ఆకట్టుకుంటారు. అందులో ముఖ్యంగా ఒడిశి నృత్య సంప్రదాయం చూపరులను ఆకట్టుకుంటుంది.
ఆరోగ్యం ఐశ్వర్యం
కోణార్క్ సూర్య దేవాలయాన్ని ఒక్కసారి సందర్శిస్తే అన్ని రకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుందని విశ్వాసం. ఆరోగ్యమే కదా నిజమైన ఐశ్వర్యం. కోణార్క్ డాన్స్ ఫెస్టివల్ సందర్భంగా డిసెంబర్ మాసం ఇక్కడ చాలా సందడిగా ఉంటుంది. ఈ సమయంలో కోణార్క్ సూర్య దేవాలయాన్ని సందర్శించడానికి సరైన సమయం.
ఎలా చేరుకోవాలి
దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి ఒడిశా రాజధాని భువనేశ్వర్‌కు రవాణా సౌకర్యాలున్నాయి. అలాగే కోణార్క్ చేరుకోవడానికి కూడా రైలు, బస్సు సౌకర్యాలున్నాయి. మనం కూడా ఒక్కసారి కోణార్క్ సూర్య దేవాలయాన్ని సందర్శిద్దాం. మధురానుభూతులను సొంతం చేసుకుందాం. ఓం ఆదిత్యాయ నమః
ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.