Tiruchanur Padmavathi Brahmotsavam Ashwa Vahana Seva: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా బ్రహ్మోత్సవాలలో ఎనిమిదవ రోజు అమ్మవారికి జరుగనున్న ఉత్సవ వాహన విశేషాలను ఈ కథనంలో తెలుసుకుందాం.
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తిక బ్రహ్మోత్సవాలలో ఎనిమిదో రోజు అంటే 5 డిసెంబర్ 2024 గురువారం రాత్రి 7 నుంచి 9 గంటల వరకు శ్రీ పద్మావతీ అమ్మవారి అశ్వ వాహన సేవ జరుగనుంది.
అశ్వ వాహన సేవ విశిష్టత
తిరుచానూరు పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి శ్రీహరి దేవేరి పద్మావతి అశ్వ వాహనంపై తిరు మాడ వీధులలో ఊరేగుతూ భక్తులను అనుగ్రహిస్తారు. అశ్వం వేగంగా పరిగెత్తే అందమైన జంతువు. అందుకే ఉపనిషత్తులు ఇంద్రియాలను గుర్రాలుగా అభివర్ణిస్తున్నాయి. పరమాత్ముడైన హరి పట్టపురాణి అలమేలుమంగ అశ్వవాహన సేవను దర్శించిన భక్తులకు కలి దోషాలను తొలగిపోతాయని విశ్వాసం.
ధర్మసంస్థాపనార్ధాయ సంభవామి యుగే! యుగే!
ఎప్పుడైతే ధర్మం గాడి తప్పి, అధర్మం రాజ్యమేలుతుందో అప్పుడు ధర్మాన్ని తిరిగి స్థాపించడానికి అవతార స్వీకారం చేస్తానని భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినట్లుగా కలియుగాంతంలో దుష్టశిక్షణ, శిష్టరక్షణ చేసేందుకు వైకుంఠనాధుడు కల్కి అవతారాన్ని స్వీకరిస్తాడు. దుష్టశిక్షణ, శిష్టరక్షణ చేసి ధర్మాన్ని పునః ప్రతిష్ట చేసే కల్కి స్వరూపం అనన్యసామాన్యం, అపురూపం. అశ్వవాహనంపై తిరుమాడ వీధుల్లో కల్కి అవతారంలో ఊరేగే అమ్మవారిని దర్శించుకోవడం వల్ల దుర్గుణాలు పోయి సద్గుణాలు ప్రాప్తిస్తాయని ఆగమ పండితులు చెబుతున్నారు.
అశ్వ వాహనంపై ఊరేగే పద్మావతి దేవిని సద్బుద్ధి ప్రసాదించమని వేడుకుంటూ
ఓం శ్రీ పద్మావతి దేవ్యై నమః
ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.