Padmavathi Brahmotsavam kalpavriksha seva : తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. డిసెంబర్ 1వ తేదీన అంటే ఆదివారం ఉదయం అమ్మవారు కల్పవృక్ష వాహనంపై ఊరేగనున్నారు. ఈ సందర్భంగా కల్పవృక్ష వాహన సేవ విశిష్టతను ఈ కథనంలో తెలుసుకుందాం.
రాజమన్నార్ అలంకారంలో
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తిక బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. బ్రహ్మోత్సవాలలో భాగంగా నాలుగో రోజు (ఆదివారం) ఉదయం అమ్మవారు శ్రీ రాజమన్నార్ అలంకారంలో చర్నాకోలు, దండం ధరించి కల్పవృక్ష వాహనంపై భక్తులకు దర్శనమివ్వనున్నారు.
కోరిన కోరికలు తీర్చే కల్పవృక్షం
పోతనామాత్యుడు రచించిన శ్రీమద్భాగవతంలో వివరించిన ప్రకారం, దేవదానవులు అమృతం కోసం క్షీరసాగరాన్ని మధించినప్పుడు అందులోనుంచి కొన్ని అద్భుతమైన వస్తువులు ఉద్భవించాయి. వాటిలో కల్పవృక్షం ఒకటి. ఈ చెట్టు నీడన చేరిన వారికి ఆకలి దప్పులు ఉండవు. పూర్వజన్మ స్మరణ కూడా కలుగుతుంది. ఇతర వృక్షాలు తాము కాచిన ఫలాలు మాత్రమే ప్రసాదిస్తాయి. కానీ కల్పవృక్షం అలా కాకుండా మనం కోరుకున్న ఫలాలన్నింటినీ ప్రసాదిస్తుంది. అటువంటి కల్పవృక్ష వాహనాన్ని అధిరోహించి నాలుగో రోజు ఉదయం శ్రీ పద్మావతి అమ్మవారు తిరుమాడ వీధులలో భక్తులకు తనివితీరా దర్శనమిస్తారు. ఈ క్షీరసాగరం నుంచే లక్ష్మీదేవి కూడా ఉద్భవించింది. అందుకే కల్పవృక్షం ఓ రకంగా చూస్తే అమ్మవారికి తోబుట్టువే.