What To Do On Karthika Amavasya : పరమ పవిత్రమైన కార్తిక మాసం చివరి ఘట్టానికి చేరుకున్నాం. ఈ మాసమంతా నదీస్నానాలు, పూజలు, వ్రతాలతో ఆధ్యాత్మికత వెల్లి విరిసింది. కార్తిక వ్రతానికి పూర్ణ ఫలం దక్కాలంటే కార్తిక మాసంలో చివరి రోజైన అమావాస్య రోజు చేయాల్సిన విధి విధానాల గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.
పితృదేవతల ప్రీత్యర్ధం
సాధారణంగా అమావాస్య రోజు చేసే కర్మలన్నీ పితృ దేవతల ప్రీతి కోసమే ఉంటాయి. పవిత్రమైన కార్తిక మాసంలో చేసిన స్నాన దాన జపాలకు సంపూర్ణ ఫలం దక్కాలంటే కార్తిక అమావాస్య రోజు పితృ దేవతలను ఆరాధించాలని శాస్త్రం చెబుతోంది. ఈ సందర్భంగా కార్తిక అమావాస్య ఎప్పుడు? ఆ రోజు ఎలాంటి విధి విధానాలు పాటించాలి?
కార్తిక అమావాస్య ఎప్పుడు?
నవంబర్ 30వ తేదీ శనివారం ఉదయం 10:30 నిమిషాల నుంచి అమావాస్య మొదలై డిసెంబర్ 1 వ తేదీ మధ్యాహ్నం 11:51 నిమిషాల వరకు ఉంది. సాధారణంగా అమావాస్య తిథి రాత్రి సమయంలోనే ఉన్న రోజునే జరుపుకుంటారు. అంతేకాకుండా పితృ దేవతలకు తర్పణాలు ఇవ్వాలంటే అమావాస్య మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఖచ్చితంగా ఉండాలి. ఈ లెక్కన చూస్తే నవంబర్ 30 వ తేదీనే అమావాస్యగా జరుపుకోవాలని పంచాంగకర్తలు సూచిస్తున్నారు.
కార్తిక అమావాస్య రోజు పాటించాల్సిన విధి విధానాలు
వ్యాస మహర్షి రచించిన స్కాంద పురాణం ప్రకారం కార్తిక అమావాస్య రోజు ప్రవహించే నదిలో స్నానమాచరించాలి. సరిగ్గా మధ్యాహ్నం 12 గంటల సమయంలో పితృదేవతలకు జల, తిల తర్పణాలు ఇవ్వాలి. సద్బ్రాహ్మణునికి భోజనం పెట్టి, నూతన వస్త్రాలు, దక్షిణ తాంబూలాలు సమర్పించి నమస్కరించుకోవాలి.