Wednesday Dos and Donts As Per Astrology : కొంతమంది వారంలో ఈ రోజు.. ఈ పనులు స్టార్ట్ చేస్తే అంతా మంచి జరుగుతుందని భావిస్తుంటారు. అందులో ముఖ్యంగా కొందరు బుధవారంను సెంటిమెంట్‌గా ఫీలవుతుంటారు. అలాంటివారికోసమే ఈ స్టోరీ. ఎందుకంటే.. మిమ్మల్ని అదృష్టం వరించి కెరీర్లో ఉన్నత స్థానానికి ఎదగాలంటే బుధవారం చేయాల్సిన, చేయకూడని పనులు కొన్ని ఉన్నాయంటున్నారు ప్రముఖ జ్యోతిష్య నిపుణులు మాచిరాజు కిరణ్ కుమార్. మరి, అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
- బుధవారానికి అధిపతి బుధుడు. కాబట్టి, ఈ రోజు నవగ్రహాల్లో బుధుడిని పూజించాలి. అలాగే పెద్దవాళ్లతో మాట్లాడడానికి బుధవారాన్ని అనుకూలమైన రోజుగా చెప్పుకోవచ్చు.
- కొత్తగా ఎవరైనా వ్యక్తులను కలవాలనుకున్నప్పుడు ఇదే మంచి రోజట. అదేవిధంగా శిల్పశాస్త్ర అధ్యయనానికి ఇది అనుకూలమైన రోజట. పేయింటింగ్, చిత్రలేఖనం నేర్చుకోవాలనుకునేవారు ఈ రోజు జాయిన్ అయితే మంచి ఫలితాలు పొందవచ్చంటున్నారు జ్యోతిష్యులు మాచిరాజు కిరణ్ కుమార్.
- కొత్తగా ఏదైనా వ్యాపారం స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు అందుకు సంబంధించిన చర్చలు జరపడానికి ఈ రోజు అనుకూలంగా ఉంటుందట. అలాగే ఏదైనా సెటిల్మెంట్ వ్యవహారాలు చేయడానికి ఇది ఉత్తమమైన రోజుగా చెప్పుకోవచ్చంటున్నారు.
- సభా కార్యక్రమాల గురించి అధ్యయనం చేయడానికి బుధవారం మంచి రోజట. అంటే.. ఏదైనా ఒక పెద్ద సభ ఏర్పాటు చేయాలనుకున్నప్పుడు అందుకు సంబంధించిన వ్యవహారాలను ఈ రోజు చూసుకుంటే బెటర్ అంటున్నారు.
- గణితం, కంప్యూటర్, ఇంజినీరింగ్ వంటి విద్యలు నేర్చుకోవడం ప్రారంభించడానికి ఈ రోజు మంచి రోజుగా చెప్పుకోవచ్చంటున్నారు జ్యోతిష్య నిపుణులు మాచిరాజు కిరణ్ కుమార్.
- వ్యవసాయ పరికరాలు కొనడానికి, వాటిని మొదటి సారి ఉపయోగించడానికి ఇది ఉత్తమమట. అలాగే, వ్యవసాయపరంగా కంది, పెసర, శనగ, మినప, ద్రాక్ష, కమల, బత్తాయి, సీతాఫలం, నిమ్మ, దానిమ్మ వంటి పంటల సాగు బుధవారం మొదలెడితే మంచి ఫలితాలు ఉంటాయంటున్నారు.
- తూర్పు వాయువ్యం, పడమర, నైరుతి, దక్షిణ ఆగ్నేయం దిక్కులలో ఈ రోజు ప్రయాణం చేస్తే అనుకూలమైన ఫలితాలు కలుగుతాయట. కానీ.. ఉత్తర, ఈశాన్యం దిక్కులలో జర్నీ చేస్తే మాత్రం అనారోగ్య సమస్యలు, ధన నష్టం కలిగే ఛాన్స్ ఉంటుందట.
- అందులోనూ మృగశిర, పుష్యమి, అనురాధ, హస్త, మూల, ధనిష్ఠ, శ్రవణ వంటి నక్షత్రాలతో కలిసి వచ్చే బుధవారం నాడు చేసే ప్రయాణాలు ఇంకా అద్భుతమైన ఫలితాలు ఇస్తాయంటున్నారు.
- శుక్ల పక్షంలో లేదా బహుళ పక్షంలో తదియ తిథి బుధవారంతో కలిసి వస్తే ఆ రోజు ప్రయాణాలు, ముఖ్యమైన కార్యక్రమాలు చేయకపోవడం మంచిదట.
- ఇక ఈ రోజు ఆడపిల్ల పుష్పవతిఅయితే చాలా మంచిదట. అలాగే, ఈ రోజు పుట్టినవారికి అదృష్ట సంఖ్యలు 5, 8, 9. కాబట్టి, ఈ తేదీల్లో ముఖ్యమైన పనులు చేస్తే బుధవారం పుట్టినవారికి తొందరగా అదృష్టం కలిసివస్తుందంటున్నారు ప్రముఖ జ్యోతిష్య నిపుణులు మాచిరాజు కిరణ్ కుమార్.
Note : పైన తెలిపిన వివరాలు కొందరు జ్యోతిష్య నిపుణులు, శాస్త్రంలో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతేకానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకూ విశ్వసించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.