Godaguchi Katha :శివునికి భోళా శంకరుడని, భక్తవశంకరుడని బిరుదులు ఉన్నాయి. కాసిన్ని నీళ్లతో అభిషేకిస్తే చాలు కోరిన కోర్కెలు తీర్చే శంకరుడు నిర్మలమైన భక్తికి, అమాయకత్వానికి ఎలా లొంగిపోయాడో తెలియజేసే గొడగూచీ కథను ఈ కథనంలో తెలుసుకుందాం.
శివదేవుని భక్తి తత్పరత
పూర్వం ఒక ఊళ్ళో శివదేవుడు అనే గృహస్తుడు ఉండేవాడు. అతడు మహా శివ భక్తుడు. ప్రతిరోజూ తమ ఊళ్లో ఉన్న శివాలయానికి వెళ్ళేవాడు. శివదేవుడు శివాలయానికి వెళ్ళేటప్పుడు ఒట్టి చేతులతో వెళ్లకుండా బాగా కాచి చల్లార్చిన కుంచెడు పాలు ఆలయానికి తీసుకెళ్లి శివుడికి వాటిని నైవేద్యంగా అరగింపు చేసేవాడు. అలా భక్తితో స్వామికి నమస్కరించి ఆపై ఆ పాలను ఇంటికి తీసుకెళ్లేవాడు. ఇలా పరమ నిష్ఠతో ప్రతిదినం కుంచెడు పాలను శివుడికి అరగింపు చేసేవాడు.
శివుని ఆరగింపు సేవను కుమార్తెకు అప్పగించిన శివదేవుడు
ఒకరోజు అనుకోకుండా శివదేవునికి భార్యతో కలిసి పొరుగురికి వెళ్లాల్సిన పని పడింది. దాంతో తాను శివుడికి పాలని నివేదించేది ఎలాగా అని ఆలోచించాడు. ఇంట్లో అందరికన్నా చిన్నదైన కూతురిని పిలిచి, " పాపా! మీ అమ్మా నేను పనిమీద ఊరికి వెళ్తున్నాం. మేము ఊరు నుంచి తిరిగి వచ్చేదాకా ఇంటి దగ్గరనే జాగ్రత్తగా ఉండు. ఇంకో ముఖ్యమైన పని కూడా నువ్వు చేయాలి. అదేమిటంటే మనం రోజూ శివాలయంలో శివునికి పాలను అరగింపు చేసేవాళ్ళం. ఆ పనిని మానకుండా నువ్వు నిష్టగా చేయాలి. కాచి చల్లార్చిన మంచి గోవు పాలను కుంచెడు కొలిచి ఒక పాత్రలో పోసుకొని గుడికి వెళ్లాలి. అక్కడ స్వామికి ఆ పాలను ఆరగింపు చేయాలి. వెళ్తావు కదూ! ఇది మన నియమము తల్లీ! వ్యర్థం కానివ్వకు. ఆటలని, పాటలని అటు ఇటు పరిగెత్తకుండా, స్నేహితులతో తిరగకుండా ఇంటి పట్టునే ఉండి చెప్పిన పని చేయమ్మ! మరచిపోవు కదూ! మా బంగారం కదూ!" అని గడ్డం పట్టుకొని బతిమిలాడి మరీ గుడికి వెళ్ళే పని పాపకు అప్పగించాడు శివదేవుడు. పాప సరేనంది.
శివుని ఆరగింపుకు పాలు పట్టుకెళ్లిన పాప
శివదేవుడు భార్యతో కలిసి పొరుగూరు వెళ్ళాడు. మరుసటి రోజు పాప చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా స్నానాదులు ముగించుకొని మంచి గోవు పాలను మరగకాచి, చల్లార్చి సరిగ్గా కుంచెడు పాలు కొలుచుకొని గిన్నెలో పోసుకొని గిన్నె చేతపట్టుకొని తను కట్టుకున్న పలుచని కొంగును పాల మీద కప్పి సరాసరి గుడికి చేరింది. గర్భాలయంలో కొలువై ఉన్న శివ లింగమూర్తి ఎదుట పాల గిన్నెను ఉంచి, రెండు చేతులెత్తి స్వామికి మొక్కింది. పాల వైపు చేతులు చూపిస్తూ “శివయ్యా! ఇవిగో పాలు నీకోసం తెచ్చాను ఆరగించవయ్యా!" అని శివుడికేసి చూసి చెప్పింది.
శివుని పాలు తాగమని బతిమాలాడిన పాప
పాప తాను శివుని ఎదురుగా నిలబడితే ఎలా తాగుతాడు అని కాస్త పక్కకు జరిగి చాటుకు నిలబడింది. కాసేపు అయ్యాక వచ్చి ఆ గిన్నెలో చూసింది. గిన్నెలో పాలు అలానే ఉన్నాయి. అప్పుడు పాప "శివయ్యా! పాలు తాగలేదా! నీకోసమే తెచ్చాను తాగటానికి ఏమిటి ఇబ్బంది? తాగవా! తాగు తాగు" అంటూ శివుడి కేసి చూసి పురామయించింది. ఊహు శివుడు తాగలేదు!
పాపను ఆవరించిన దిగులు, చింత
చిన్నపిల్ల కదా! ఆ పాపకు చింత మొదలైంది. తనలో తానే అమ్మానాన్నలు చెప్పినట్లుగానే చేశాను. ఎక్కడ ఏం లోపం జరిగిందో! శివుడేమో ఈ రోజు పాలు త్రాగడం లేదు? దాంతో పాపకి భయం పట్టుకుంది. శివుడు పాలు త్రాగకపోతే అమ్మానాన్నలతో దెబ్బలు తినాల్సి వస్తుంది కదా! శివుడి వైపు దీనంగా చూస్తూ 'పాలెందుకు తాగలేదు? తాగవయ్యా! లింగమూర్తి!అని ప్రాధేయపడింది. పాలు సరిగ్గా కాచలేదా! రుచిగా లేవా? సద్దిపాలు అనుకున్నవా? నీళ్లు కలిపానని అనుకున్నావా? ఆవుపాలు కాదనుకున్నావా! పోనీ ఆకలిగా లేదా? ఎందుకు తాగవయ్యా? అంటూ నిలదీయటం మొదలెట్టింది.
శివుని బుజ్జగించిన పాప
"పరమశివా! పసిపాపను చేసి ఏమిటి ఈ సతాయింపు. ఒక్క గుటక అన్నా తాగితే నేను తృప్తి చెందుతాను కదా! అంటూ పాప పరమశివుడిని బతిమాలుతోంది. నువ్వు పాలు త్రాగలేదంటే మా అమ్మానాన్నలు నన్ను కొడతారు. అలా కొట్టిస్తావా? నా మీద ప్రేమతోనైన త్రాగవా? మా నాయన కదూ! మా శివయ్య కదూ! తాగవయ్యా!" అంటూ అన్నం తినకుండా మారాం చేసే వాళ్ళ తమ్ముడిని వాళ్ళమ్మ ఎలా బుజ్జగిస్తుందో గుర్తు చేసుకుంటూ బ్రతిమాలుతోంది, ఏడుస్తోంది.