Surya Tilakam to Ram Lalla in Ayodhya:శ్రీరామనవమి సందర్భంగా అయోధ్యలో అద్భుతం చోటుచేసుకోనుంది. గర్భగుడిలో ఉన్న బాలరాముడి విగ్రహం నుదుటిపై సూర్య కిరాణాలు ప్రసరించనున్నాయి. ఇందు కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దీనిని "సూర్యతిలకం"గా అభివర్ణిస్తున్నారు. అయోధ్యలోని రామాలయంలో సరిగ్గా మధ్యాహ్నం 12 గంటలకు బాలరాముడి విగ్రహం నుదుటిపై ‘సూర్య తిలకం’ కనువిందు చేయనుంది.
సూర్యకిరణాలు గర్భగుడిలోని రాముడి విగ్రహం నుదుటిపై బొట్టులా 58 మిల్లీమీటర్ల పరిమాణంలో, ఐదు నిమిషాలపాటు ప్రసరించనున్నాయి. రామాలయ నిర్మాణ సమయంలో ట్రస్ట్ సభ్యుల కోరిక మేరకు కేంద్ర భవన నిర్మాణ పరిశోధన సంస్థ(సీబీఆర్‌ఐ) శాస్త్రవేత్తలు సూర్యతిలకం ఏర్పడేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారని.. సీబీఆర్‌ఐ ప్రతినిధి, హైదరాబాద్‌కు చెందిన డా.ప్రదీప్‌కుమార్ రామన్ చెర్ల తెలిపారు.
19 ఏళ్లపాటు నవమి రోజునే వచ్చేలా:సూర్యతిలకం 19 సంవత్సరాల పాటు శ్రీరామనవమి రోజు బాలరాముడి విగ్రహంపై ఏర్పడనుంది. ఇందుకోసం బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్(ఐఐఏ) శాస్త్రవేత్తలను, పరిశోధకులను సీబీఆర్‌ఐ సంప్రదించింది. వారు అధ్యయనం చేసి మూడో అంతస్తు నుంచి గర్భగుడిలోని బాలరాముడి విగ్రహం నుదుటిపై సూర్యకిరణాలు ప్రసరించేలా.. పరిమిత సంఖ్యలో పైపులు, కుంభాకార, పుటాకార కటకాలతో ఒక వ్యవస్థను రూపొందించారు. వీటిని బెంగళూరులోని ఆప్టికా సంస్థ సమకూర్చింది.
ఇలా సూర్య కిరణాలు ప్రసరిస్తాయి: ఆలయ శిఖర భాగంలో సూర్యకాంతి గ్రహించేందుకు ఒక పరికరాన్ని ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి పైపు లోపలికి కాంతి ప్రసరిస్తుంది. ఏటా సూర్యకిరణాలు అక్కడే ఎలా పడతాయి? వాతావరణంలో మార్పులు వస్తుంటాయి కదా? గ్రహాల పరిభ్రమణం, సమయం ఒకేలా ఉంటుందా? అన్న ప్రశ్నలు తెరపైకి వచ్చాయి. ఈ సమస్యను అధిగమించేందుకు గడియారంలో ముల్లులు తిరిగేందుకు ఉపయోగించే పరిజ్ఞానం తరహాలో "గేర్ టీత్ మెకానిజం" వినియోగించారు.
శ్రీరామనవమి రోజు ఈ పనులు అస్సలే చేయకండి - కష్టాలను కోరి తెచ్చుకున్నట్టే!