తెలంగాణ

telangana

ETV Bharat / spiritual

ఆరోగ్య ప్రదాత సూర్యభగవానుడు - ఆదివారం ఇలా పూజిస్తే ఐశ్వర్యం ప్రాప్తి! - SURYA DEV WORSHIP ON SUNDAY

ఆదివారం సూర్యభగవానుడి ఆరాధన - పూజా విధానం మీకోసం!

Surya Dev Worship On Sunday
Surya Dev Worship On Sunday (Getty Images)

By ETV Bharat Telugu Team

Published : Dec 8, 2024, 5:45 AM IST

Surya Dev Worship On Sunday :హిందూ మత విశ్వాసాల ప్రకారం ఒక్కో రోజుకు ఒక్కో అధిదేవత ఉంటారు. అలాగే ఆదివారానికి అధిపతి సూర్యభగవానుడు. మిగిలిన దేవీదేవతల విగ్రహాలను పూజించే మనం సూర్యుని మాత్రం ప్రత్యక్షంగా పూజించుకోవచ్చు. ముఖ్యంగా ఆదివారం రోజు కొన్ని పరిహారాలు పాటిస్తూ ఆరోగ్య ప్రదాత అయిన సూర్యుని నియమ నిష్టలతో పూజిస్తే ఆరోగ్యంతో పాటు ఐశ్వర్యం కూడా పొందవచ్చునని శాస్త్ర వచనం. ఆ పరిహారాలేమిటో ఈ కథనంలో తెలుసుకుందాం.

"ఆరోగ్యం భాస్కరాధిచ్చేత్"
"ఆరోగ్యం భాస్కరాధిచ్చేత్" అని వేదోక్తి. ఆరోగ్యం ఉంటే అన్ని ఉన్నట్టే. అలాంటి ఆరోగ్యాన్నిచ్చే దేవుడు సూర్యనారాయణుడు. ప్రత్యక్షంగా కనబడే ఏకైక భగవానుడు. అందుకే ఆయన్ని ప్రత్యక్ష నారాయణుడన్నారు.

అల్ప సంతోషి
సూర్యుడు చాలా అల్ప సంతోషి. అదెలాగంటే "ఆదిత్యో నమస్కార ప్రియః". ఆయన ఎదురుగా నిలచి చేతులు రెండు శిరసుపై జోడించి నమస్కరిస్తే చాలు, అడిగినవన్ని ప్రసాదించే దైవం సూర్యుడు.

ఆదివారం సూర్యపూజ ఇలా
ఆదివారం రోజు సూర్యోదయంకు పూర్వమే నిద్రలేచి స్నానాదులు ముగించుకొని మన ఇంట్లో ఎక్కడైతే సూర్యకాంతి ప్రసరిస్తుందో ఆ ప్రాంతమంతా బాగా శుభ్రం చేసుకోవాలి. ఒక రాగి పాత్రలో కానీ వేరే ఏదైనా లోహంతో చేసిన పాత్రలో నిండుగా నీరు తీసుకొని సూర్యుని ద్వాదశ నామాలు జపిస్తూ అర్ఘ్యం ఇవ్వాలి.

సూర్యుని ద్వాదశ నామాలు

  • మిత్ర
  • రవి
  • సూర్య
  • ఖగ
  • అహను
  • పూషణ
  • హిరణ్యగర్భ
  • మరీచి
  • ఆదిత్య
  • సవిత
  • అర్క
  • భాస్కర

పూజా విధానం
అనంతరం భూశుద్ధి చేసిన చోట అష్టదళ పద్మాకారంలో ముగ్గు వేసి, పసుపు కుంకుమలతో అలంకరించాలి. ఎర్రని పుష్పాలను ముగ్గులో ఉంచాలి. ఆ ముగ్గులోకి సూర్యుని ఆవాహన చేసి ధూప దీపాలతో పూజించాలి. సూర్యునికి అభిముఖంగా కూర్చుని ఆదిత్య హృదయం పారాయణ చేయాలి. ఆవు పాలు, బియ్యం, బెల్లముతో తయారుచేసిన మెత్తని పరమాన్నాన్ని సూర్యునికి నివేదించాలి. చివరగా కర్పూర నీరాజనం ఇచ్చి సూర్య నమస్కారాలు చేసుకుంటే ఆరోగ్య కోసం చేసే భాస్కర పూజ సంపూర్ణం అయినట్లే.

ఐశ్వర్యం కోసం ఆదివారం చేయాల్సిన పరిహారాలు
సూర్య భగవానుని కేవలం ఆరోగ్యం కోసం మాత్రమే కాదు ఐశ్వర్యం కోసం కూడా పూజిస్తారు. ఐశ్వర్యం కోరుకోని వారు ఎవరూ ఉండరు కదా, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి ఐశ్వర్యం సిద్ధించాలంటే ఆదివారం ఈ పరిహారాలు పాటించాలని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అవేమిటో చూద్దాం.

  • ఆదివారం పాలు, బియ్యం , బెల్లం దానం చేయడం ద్వారా సూర్య భగవానుడు అనుగ్రహంతో కోరుకున్న కోరికలన్ని నెరవేరుతాయని విశ్వాసం.
  • ఆర్థిక సంక్షోభంతో బాధపడుతుంటే ఆదివారం రోజున ఇంట్లో సూర్యకాంతి ప్రసరించే ప్రదేశంలో, వీలయితే ప్రధాన ద్వారం దగ్గర ఆవు నెయ్యితో దీపం వెలిగించాలి. ఇలా చేయడం వలన జీవితంలో సుఖశాంతులు కలుగుతాయని, ఆ ఇంట్లో నివసించే వారిపై లక్ష్మీదేవి ఆశీర్వాదంతో వారు ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడి ధనవంతులు అవుతారని విశ్వాసం.
  • ఆదివారం ఇంట్లో నుంచి ముఖ్యమైన పనిమీద బయటకు వెళ్లాల్సి వస్తే నుదుటన ఎర్ర చందనంతో తయారు చేసిన తిలకం ధరించి వెళ్తే నూటికి నూరు శాతం కార్యసిద్ధి, విజయప్రాప్తి ఉంటాయి.
  • జీవితంలో సుఖసంతోషాలు, ఐశ్వర్యం, కీర్తిప్రతిష్ఠలు, ఆనందం,శ్రేయస్సు కలగాలంటే ఆదివారం రోజు సూర్యోదయ సమయంలో రావి చెట్టు కింద వరిపిండితో తయారు చేసిన రెండు ప్రమిదలలో నువ్వుల నూనె పోసి సూర్యునికి ఎదురుగా దీపాలను వెలిగించాలి.
  • ఈ పరిహారాలు పాటించే ఆదివారాల్లో మద్యమాంసాలకు దూరంగా ఉండాలి. బ్రహ్మచర్యం పాటించాలి.

మానవ ప్రయత్నం కూడా ముఖ్యం
అయితే జ్యోతిష్య శాస్త్రం సూచించిన ఈ పరిహారాలను ఒక్క ఆదివారం మొక్కుబడిగా చేసి ఫలితం రాలేదని నిరాశ చెందకూడదు. కనీసం 5 లేదా 11 ఆదివారాలు ఈ పరిహారాలను పాటించాలి. అలాగే జీవితంలో ఎదురయ్యే సమస్యలు ఎదుర్కోవడానికి మానవ ప్రయత్నం తప్పకుండా చేయాలి. మానవ ప్రయత్నం చేస్తూ సానుకూలత కోసం మాత్రమే శాస్త్రంలో చెప్పిన పరిహారాలు పాటించాలి. అలా కాకుండా ఏ ప్రయత్నం చేయకుండా దేవుడి మీద భారం వేసి ఫలితాలు రాలేదని నిరాశ చెందడం అవివేకం. శాస్త్రంలో చెప్పిన విధంగా ఆదివారం ఈ పరిహారాలు పాటిద్దాం ఆరోగ్యంగా ఆనందంగా జీవిద్దాం. ఓం శ్రీ ఆదిత్యాయ నమః

ముఖ్యగమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ABOUT THE AUTHOR

...view details