Karthika Puranam Chapter 17 :పరమ పవిత్రమైనకార్తికమాసంలో నిరాటంకంగా కొనసాగుతున్న కార్తికపురాణంలో భాగంగా వశిష్టుడు జనక మహారాజుతో దీప స్థంభం నుంచి ప్రత్యక్షమైన ధనలోభుని వృత్తాంతం గురించి అంగీరస ధనలోభుల సంవాదం ద్వారా వివరించిన సంగతులను ఈ కథనంలో తెలుసుకుందాం.
అంగీరస ధన లోభుల సంవాదం
వశిష్ఠులవారు జనకునితో పదిహేడవ రోజు కథను చెప్పడం ప్రారంభించారు. "దీపస్తంభం నుంచి బయటకు వచ్చిన పురుషుని సందేహాలకు అంగీరసుడు "ఓ ధనలోభి! నీ సందేహాలకు సమాధానం చెబుతున్నాను. వినుము!" అంటూ చెప్పసాగెను.
కర్మ సిద్ధాంతం
మానవుడు చేయు కర్మ వల్ల ఆత్మకు దేహధారణము కలుగుచున్నది. శరీరం ఏర్పడుటకు కర్మయే కారణమగుచున్నది. శరీరం ధరించడం వల్లనే ఆత్మ కర్మను చేయును. అందుకే కర్మ చేయుటకు శరీరమే కారణ మగుచున్నది. ఈ స్థూల సూక్ష్మ శరీర సంబంధం వల్ల ఆత్మకు కర్మకు సంబంధం కలుగునని పూర్వం పార్వతీదేవికి పరమేశ్వరుడు వివరించాడు. అదే నేను మీకు వివరిస్తున్నాను.'ఆత్మ' అంటే ఈ శరీరం అన్న భ్రమ అహంకారంగా మారిపోతున్నది." అని అంగీరసుడు వివరించగా అప్పుడు ధనలోభుడు "ఓ మునీశ్వరా నేను ఇంతవరకు ఈ శరీరాన్నే ఆత్మగా అనుకుంటున్నాను. నాకు "అహం బ్రహ్మ" అను పదానికి అర్ధం తెలియచేసి జ్ఞానబోధ చేయండి" అని వేడుకున్నాడు.
"అహం బ్రహ్మాస్మి"
అప్పుడు అంగీరసుడు ధనలోభునితో "ఈ దేహమే శాశ్వతమని భ్రమించడమే కాకుండా అన్నింటికీ "నేను, నాది" అని అనడమే 'అహం'. సర్వాంతర్యామి అయిన సచ్చిదానంద స్వరూపమే 'ఆత్మ'. ఆత్మకు మరణం లేదు. ఆకలి దప్పికలు ఉండవు. నీటిలో నాని పోదు. అగ్నికి కాలదు. ఇదే శాశ్వతం. ఆత్మకు దుఃఖం ఉండదు. సుఖాన్ని అనుభవించదు. ఏ విధంగా అయితే గాజు బుడ్డిలో ఉన్న దీపం గాజును ప్రకాశింప చేస్తుందో, అలాగే ఆత్మ కూడా తన దివ్య తేజస్సును శరీర ఇంద్రియాల ద్వారా ప్రసరింపచేసి శరీరంలో ప్రాణమును నిలిపి ఉంచుతుంది. ఇంద్రియాల పనితీరును నియంత్రిచేది ఆత్మ. ఎలాగైతే ఇనుము సూదంటురాయిని అంటిపెట్టుకుని ఉంటుందో అలాగే ఆత్మ శరీరాన్ని అంటిపెట్టుకుని ఉంటుంది.