Srivari Pushkarini Open :మన దేశంలోని పవిత్రమైన పుణ్యక్షేత్రాల్లో తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ఒకటి. నిత్యం ప్రపంచ నలుమూలల నుంచి ఎంతో మంది భక్తులు స్వామి వారి దర్శనం కోసం కొండపైకి తరలి వస్తుంటారు. ప్రతిరోజు కొన్నివేల మంది కాలి నడకన కొండపైకి చేరి స్వామి వారికి మొక్కులు చెల్లించుకుంటారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా టీటీడీ ఎప్పటికప్పుడూ ఏర్పాట్లు చేస్తుంటుంది. ఈ క్రమంలోనే ఆలయ పుష్కరిణిలోనూ మరమ్మతులు చేస్తుంటుంది. దీంతో కొన్ని రోజుల పాటు పుష్కరిణిని మూసివేస్తారు అధికారులు. ఇలానే సుమారు గత నెల రోజులుగా మూసివేసిన శ్రీవారి పుష్కరిణి త్వరలోనే భక్తులకు అందుబాటులోకి రానుంది. పాపాలను పొగొట్టే శ్రీవారి పుష్కరిణిని తిరిగి ఏ రోజు ప్రారంభిస్తారో ఇప్పుడు తెలుసుకుందాం.
తిరుమలలో శ్రీవారి ఆలయం వద్ద గల పుష్కరిణిని ఆగస్టు ఒకటిన మూసివేశారు. ఏటా శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ముందు పుష్కరిణి మరమ్మతులు చేసే సమయంలో ఇలానే చేస్తారు. ఎందుకంటే.. పుష్కరిణిలో ఉన్న వాటర్‌ని కంప్లీట్‌గా తొలగించి పైపులైన్ మరమ్మతులు, సివిల్ పనులు చేపడతారు. దీంతో నెల రోజుల పాటు భక్తులకు పుష్కరిణి హారతి ఉండదు. అయితే, మరమ్మతులు పూర్తికావడంతో శ్రీవారి ఆలయం వద్ద ఉన్న పుష్కరిణి సెప్టెంబర్ 1వ తేదీ నుంచి భక్తులకు అందుబాటులోకి వస్తుందని టీటీడీ అధికారులు వెల్లడించారు. వేంకటేశ్వర స్వామి వారి దర్శనార్థం కొండపైకి వచ్చే భక్తులు పుష్కరిణిలో స్నానం చేస్తే సకల పాపాలు తొలగిపోతాయని నమ్ముతారు.
పుష్కరిణి ప్రత్యేకతలు..
సాధారణంగా శ్రీవారి పుష్కరిణిలో నీరు నిల్వ ఉండే ఛాన్స్ ఉండదు. ఎందుకంటే.. పుష్కరిణిలోని వాటర్ శుద్ధి చేసి తిరిగి వినియోగించేందుకు అత్యుత్తమ రీసైక్లింగ్ సిస్టమ్ అందుబాటులో ఉంది. నిరంతరాయంగా కొంత శాతం చొప్పన నీటిని శుద్ధి చేసి తిరిగి యూజ్ చేస్తారు. తిరుమల శ్రీవారి పుష్కరిణి మరమ్మతుల కోసం మొదటి 10 రోజుల పాటు వాటర్‌ను పూర్తిగా తొలగిస్తారు. ఆ తర్వాత 10 రోజులు పైపులైను, ఇంకా ఏవైనా ఇతర మరమ్మతులు ఉంటే పూర్తి చేస్తారు. చివరి పదిరోజులు పుష్కరిణిలో నీటిని నింపి పూర్తిగా సిద్ధం చేస్తారు. ఆ తర్వాత భక్తులకు అందుబాటులోకి తీసుకువస్తారు. అదేవిధంగా స్వామివారి పుష్కరిణిలోని వాటర్ పీహెచ్ విలువ 7 ఉండేలా చూస్తారు. టీటీడీ వాటర్ వర్క్స్ విభాగం ఆధ్వర్యంలో ఈ మరమ్మతు పనులు జరుగుతాయి.