Spiritual Significance Of Sunday :మన హైందవ సంప్రదాయం ప్రకారం మనం ఆదివారం రోజు సూర్య భగవానుని ప్రధానంగా ఆరాధిస్తాం. ఆదిత్యుడు అంటే ఆది దేవుడు- తొలి దేవుడు. ఈ ఆది దేవుని ఆరాధనకు ఆదివారం ప్రధానం. ఈ రకంగా సూర్యుని ఆరాధనకు ఆదివారం విశిష్టమైనది. సూర్య భగవానుడు ఆరోగ్య ప్రదాత. ఆరోగ్యం భాస్కరాదిత్యేత్ అని అంటారు కదా! ఆదిత్యుని పూజించుకోడానికి ఆదివారం శ్రేష్ఠమైనదిగా పెద్దలు నిర్ణయించారు.
బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని పరిపాలించేటప్పుడు మన భారతీయులందరు ఒకరోజు సెలవు దినం కావాలని అడిగితే వారు బాగా అలోచించి ఆదివారాన్ని సెలవు దినంగా ప్రకటించారు. మిగిలిన రోజులన్నీ ఎలా ఉన్నా ఆదివారం సెలవు కదా అని బద్దకించకుండా వేకువజామునే నిద్ర లేవాలని శాస్త్రం చెబుతోంది. సూర్యోదయం తర్వాత దంతధావనం చేయరాదు. దానికి ఒక కారణం ఉంది. దక్షయజ్ఞంలో సతీదేవి అవమానింపబడి యాగాగ్నికి ఆహుతి అయిన తర్వాత ఆగ్రహోదగ్రుడైన పరమశివుడు యాగాన్ని ధ్వంసం చేస్తాడు.
అప్పుడు అకారణంగా నవ్విన సూర్యుని పరమశివుడు దండిస్తాడు. ఆ సమయంలో సూర్యుని పళ్లు ఊడిపోతాయి. అందుకే సూర్యునికి పళ్లు ఉండవంట! సూర్యునికి మెత్తని పాయసం నివేదించడం వెనుక ఉన్న రహస్యం ఇదే! అప్పటి నుంచి సూర్యోదయం తర్వాత పళ్లు తోముకుంటే సూర్యుడు తనను గేలి చేసినట్లుగా భావించి ఆగ్రహిస్తాడంట. కాబట్టి సూర్యోదయం ముందే పళ్లు తోముకోవాలని పెద్దలు చెబుతారు. ఇది ప్రధాన ఆరోగ్య రహస్యం. సూర్యుని ఆరాధనలో ముఖ్యమైన విషయం. మరి మంచి ఆరోగ్యం పొందాలంటే మంచి జీవనశైలి ఎంత అవసరమో, ఆరోగ్య ప్రదాత సూర్యుని ఆదివారం పూజించుకోవడం కూడా అంతే అవసరం.