Bhogi Pallu History:తెలుగు లోగిళ్లు ఎంతో ఇష్టంగా ఎదురు చూసే సంక్రాంతి రానే వచ్చింది. ఇవాళ భోగి పండుగ. భోగి మంటలతో మొదలయ్యే సంక్రాంతి ఉత్సవాల్లో భోగిపళ్లది ప్రత్యేక స్థానం. చిన్నపిల్లలకు భోగి పళ్లు పోయడం ఎంతో ముచ్చటగా ఉంటుంది. అయితే, సరైన పద్ధతిలో భోగి పళ్లు పోస్తే ఏడాది మొత్తం విశేష ఫలితాలు లభిస్తాయని జ్యోతిష్య నిపుణుడు మాచిరాజు కిరణ్ కుమార్ చెబుతున్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.
భోగి పళ్ల కథ ఇదే:భోగి పళ్లు ఎందుకు పోయాలో మహాభారతం ద్రోణ పర్వంలో చెప్పారట. శివుణ్ని ప్రసన్నం చేసుకోవడానికి నరనారాయణులు బదరికావనంలో తపస్సు చేశారు. ఆ సమయంలో శంకరుడు ప్రత్యక్షమై "నీ తపస్సుకు మెచ్చి, నన్ను కూడా జయించే శక్తి నీకు ఇస్తున్నా" అని వరం ఇస్తాడు. అప్పుడు విష్ణుమూర్తి శక్తిని చూసి దేవతలంతా సంతోషంతో నారాయణుడి తల మీద బదరీ ఫలాలని కురిపించారట. ఆ సమయంలో శ్రీమన్నారాయణుడు చిన్నపిల్లాడిలా మారిపోయాడని మాచిరాజు వివరిస్తున్నారు. దానికి ప్రతీకగా పిల్లలను నారాయణుడిగా భావించి భోగిపండ్లను పోసే సంప్రదాయం మొదలైందట.
రేగు పండ్లనే ఈ రోజున భోగి పళ్లుగా పిలుస్తారు. వీటినే అర్కఫలం అని కూడా అంటారు. "అర్కుడు" అంటే సూర్యుడని, సూర్యుడు ఉత్తరాయణం వైపు ప్రయాణించే సమయం కావడం వల్ల, ఆయన కరుణ పిల్లలపై ఉండాలని ఈ పళ్లు పోస్తారు. పిల్లల్లో రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుందిని, సూర్యుడికి ప్రతీకగా, పోషకాల గనిగా పిలిచే ఈ పళ్లను తలపై పోస్తే ఆయురారోగ్యాలతో జీవిస్తారని, వారి మీద ఉన్న దిష్టి మొత్తం పోతుందనీ మాచిరాజు చెబుతున్నారు.