Shivling AbhishekamBenefits In Telugu :అభిషేక ప్రియుడైన పరమ శివుడికి రకరకాల ద్రవ్యాలతో అభిషేకం చేస్తుంటారు. అలా మనం వినియోగించే ఒక్కో ద్రవ్యానికి ఒక్కో విశిష్టత, ఒక్కో ప్రత్యేకత, ఒక్కో పరమార్థం ఉంది. మరి శివుడికి ఏ విధంగా అభిషేకం చేస్తే ఎలాంటి ఫలితం ఉంటుందో తెలుసా?
జలాభిషేకం-ఐశ్వర్యప్రాప్తి!
శివుడిని భోళాశంకరుడు అని అంటారు. మనం చెంబుడు నీళ్లు పోస్తే చాలు శివానుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందవచ్చు. కాసిన్ని నీళ్లు లింగంపై పోస్తే సంతోషించి సర్వైశ్వర్యాలను ఆ పరమ శివుడు ప్రసాదిస్తాడని భక్తులు నమ్ముతారు. అయితే శివుడికి జలాభిషేకం చేసేటప్పుడు లింగంపై మారేడు దళమును ఉంచి అభిషేకం చేయాలి.
గోక్షీరంతో సర్వ సౌఖ్యాలు!
పరమ శివుడికి గోక్షీరం అంటే ఆవు పాలతో అభిషేకం చేస్తే, ఆయన ప్రీతి చెంది మనకు సకల సౌఖ్యాలను ఇస్తాడట. అయితే శివుడికి ఆవు పాలతో అభిషేకం చేసేటప్పుడు శివలింగంపై ఎర్రని పుష్పాలను ఉంచి అనంతరం ఆవు పాలతో అభిషేకం చేయాలి.
గోదధితో ఆరోగ్యమస్తు!
పరమశివుడికి గోదధి అంటే ఆవు పెరుగుతో అభిషేకం చేస్తే అనారోగ్యాలు పోయి సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతుందని శాస్త్రవచనం. అయితే ఆవు పెరుగుతో అభిషేకం చేసేటప్పుడు శివలింగంపై బిల్వ దళాలను ఉంచి అభిషేకం చేయాలని పెద్దలు చెబుతారు.
ఆవు నెయ్యి-ఐశ్వర్యమస్తు!
ఆవునెయ్యితో పరమశివుడికి అభిషేకం చేస్తే అష్టైశ్వర్యాలు సమకూరుతాయి. ఆవు నేతితో అభిషేకం చేసేటప్పుడు శివలింగంపై మల్లె పూలను ఉంచి అభిషేకం చేయాలి.