Saraswati Devi Dasara Navaratri:ఇంద్రకీలాద్రిపై దేవీ నవరాత్రులు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏడో రోజు అమ్మవారు ఏ అలంకారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు? ఏ శ్లోకం చదువుకోవాలి? ఏ రంగు వస్త్రాన్ని, ఏ నైవేద్యాన్ని అమ్మవారికి సమర్పించాలి అనే విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం
శ్రీ సరస్వతీ దేవి అవతారం
శరన్నవరాత్రులలో ఏడో రోజు సప్తమి తిథి, మూల నక్షత్రం రోజు అమ్మవారు చదువుల తల్లి శ్రీ సరస్వతీ దేవిగా దర్శనమిస్తారు. అమ్మవారి జన్మ నక్షత్రం మూల నక్షత్రం రోజు అమ్మ వారిని సరస్వతీ దేవిగా ఆరాధిస్తాం.
సరస్వతీదేవి అలంకార విశిష్టత
త్రిశక్తి స్వరూపిణియైన దుర్గాదేవి తనలోని నిజరూపాన్ని సాక్షాత్కరింప చేయడమే మూల నక్షత్రం నాడు చేసే అలంకార విశిష్టత. చింతామణి, జ్ఞాన, నీల, ఘట, కిణి, అంతరిక్ష, మహా సరస్వతులుగా సప్త నామాలతో పూజింపబడే ఆ చదువుల తల్లి సరస్వతి ప్రాణుల నాలుకపై నర్తించే బుద్ధి ప్రదాయిని.
శ్లోకం
సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి
విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా.
పద్మపత్ర విశాలాక్షీ పద్మ కేసరవర్ణినీ
నిత్యం పద్మాలయా దేవీ సా మాం పాతు సరస్వతీ! అంటూ ఆ చదువుల తల్లిని ప్రార్థిస్తే జ్ఞానానికి లోటుండదు.
బొమ్మల కొలువు
ఈనాటి నుండి తెలుగు రాష్ట్రాలలో ప్రజలు బొమ్మల కొలువులు పెట్టి, పేరంటాలతో సందడి చేస్తారు. చదువుకునే విద్యార్థులు ఈ రోజు పుస్తకాలను అమ్మ చెంత ఉంచి పూజిస్తారు.