తెలంగాణ

telangana

ETV Bharat / spiritual

శంఖనాదంతో ఐశ్వర్యం వస్తుందా? ప్రయోజనాలేంటి? - SHANKH NAAD SIGNIFICANCE

శంఖనాదం చేయడం శుభప్రదం- కొన్ని ప్రత్యేక వివరాలు మీకోసం!

Shankh Naad Significance
Shankh Naad Significance (Getty Images)

By ETV Bharat Telugu Team

Published : Jan 16, 2025, 2:08 PM IST

Shankh Naad Significance In Telugu :హైందవ సంప్రదాయం ప్రకారం రోజూ పూజ తర్వాత, సాయంత్రం సంధ్యా సమయంలో శంఖనాదం చేయడం శుభప్రదమని భావిస్తారు. అలా శంఖనాదం చేయడం ఐశ్వర్య కారకమని నమ్మకం ఉంది. ఈ నేపథ్యంలో శంఖం గురించి కొన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

సంపదలకు ప్రతీక శంఖం!
విష్ణు పురాణం ప్రకారం క్షీర సాగర మథనం సమయంలో ఉద్భవించిన అద్భుతమైన వస్తువులలో శంఖం కూడా ఒకటి. ఈ శంఖం పేరే పాంచజన్యం. దీనిని శ్రీమహావిష్ణువు స్వీకరించాడు. శ్రీమహాలక్ష్మి తోబుట్టువుగా కూడా శంఖాన్ని భావిస్తారు. అందుకే పూజా గదిలో శంఖానికి ప్రత్యేక స్థానముంది. దేవుడి గదిలో శంఖం పెట్టి దానిలో నీరు నింపి ఉంచటం వల్ల శుభాలు జరుగుతాయని ఒక నమ్మకం.

శంఖంలో రకాలు
శంఖంలో రెండు రకాలు ఉన్నాయి. ఒకటి దక్షిణావృత శంఖం, రెండవది వామావృత శంఖం.

దక్షిణావృత శంఖం
దక్షిణావృత శంఖాలను ఎక్కువగా పూజలో వాడరు. ఇవి తెల్లటి తెలుపు రంగులో ఉండి దాని మీద కాఫీ రంగు గీత ఉంటుంది. ఈ శంఖం కుడి వైపు తెరుచుకుని ఉంటుంది. ఈ శంఖం లో నీరు నింపి సూర్యుడికి అభిముఖంగా నిల్చొని శంఖం నుంచి నీటిని ధారగా పోస్తూ సూర్యునికి అర్ఘ్యమిస్తే కంటికి సంబంధించిన రోగాలు తగ్గుతాయని విశ్వాసం.

వామా వృత శంఖం
వామా వృత శంఖం ఎడమవైపుకు తెరుచుకుని ఉంటుంది. అన్ని రకాల పూజల్లో తరచుగా వాడేది ఈ శంఖాన్ని! వామావృత శంఖం ఇంట్లో ఉంటే దుష్ట శక్తులు ఆ దరిదాపులకు కూడా రావట.

శంఖనాదంతో ఉద్భవించే సానుకూల శక్తులు
వైదిక శాస్త్రం ప్రకారం శంఖం పూరించగానే వచ్చే శబ్దానికి ఇంట్లో పాజిటివ్ శక్తి ప్రవేశిస్తుంది. అలాగే శంఖనాదం జరిగిన ప్రదేశానికి చుట్టుపక్కల ఉండే క్రిమికీటకాలు నాశనమైపోతాయట. దీనిని ఆధునిక శాస్త్ర విజ్ఞానం కూడా ధ్రువీకరించింది.

శంఖనాదం ఫలితాలు

  • శంఖ ధ్వని విజయానికి, సమృద్ధికి, సుఖానికి, కీర్తి ప్రతిష్ఠకు, లక్ష్మి ఆగమనానికి ప్రతీక.
  • రోజూ ఇంట్లో శంఖనాదం చేయడం వలన ఇంట్లోని వాస్తుదోషాలు తొలగిపోతాయని వాస్తు నిపుణులు చెబుతున్నారు.
  • శంఖనాదం వల్ల ఇంట్లోని ప్రతికూల శక్తులు తొలగిపోతాయి.
  • శంఖనాదం వల్ల ఆయువృద్ధి, లక్ష్మీ ప్రాప్తి, పుత్రప్రాప్తి, మనశ్శాంతి, వివాహప్రాప్తి కలుగుతాయని నమ్మకం.

శంఖనాదంతో ఆరోగ్య ప్రయోజనాలున్నాయని తెలుసా?

  • రోజూ శంఖాన్ని ఊదేవారికి శ్వాస సంబందిత వ్యాధులు దగ్గరకి రావట.
  • ఆస్త్మా కూడా తగ్గుతుందని ఒక అధ్యయనం తెలిపింది.
  • రాత్రి పూట శంఖాన్ని నీళ్లతో నింపి ఆ నీటిని ఉదయాన్నే చర్మంపై రాసుకుంటే చర్మ సంబంధిత వ్యాధులు దూరమవుతాయి.
  • శంఖాన్ని చెవి దగ్గర పెట్టుకుంటే ఆధ్యాత్మిక శబ్ధ తరంగాలు మనసుకు ఆహ్లాదాన్ని ఇస్తాయి.
  • శంఖాన్ని కాల్చగా వచ్చిన భస్మం వల్ల అనేక రోగాలు నయమవుతాయట.
  • శంఖనాదం లేకుండా పూజ ముగించకూడదని ఓ నమ్మకం. అలాగే దేవాలయాల్లో గుడి తలుపు తీసే ముందు, పూజ పూర్తయ్యాక శంఖనాదం చేయడం మన సంప్రదాయం.

అభీష్టసిద్ధి
గోముఖ శంఖాన్ని పూజించిన వారికి మనసులో ఉన్న కోరికలు తీరుతాయి. దీనిని షాపులో ఉంచుకొని పూజించిన వారికి రోజూ వ్యాపార, ధనాభివృద్ధి కలుగుతుంది. శంఖం ఏదైనా దానిని మాత్రం ఎప్పుడూ బోర్లించి ఉంచకూడదు. ఏ ఇంట్లో శంఖాన్ని దేవుడి గదిలో ఉంచి పూజిస్తారో ఆ ఇల్లు ధనధాన్యాలతో తులతూగుతుంది. ఇన్ని ప్రయోజనాలున్న శంఖాన్ని పూజామందిరంలో ఉంచుకొని పూజిస్తూ నిత్య శంఖనాదం తో ఆరోగ్య ఐశ్వర్యాలు పొందుదాం. శుభం భూయాత్!

ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ABOUT THE AUTHOR

...view details