Shani Trayodashi 2024 Puja :తెలుగు పంచాంగం ప్రకారం శనివారం త్రయోదశి తిథితో కలిసివస్తే ఆ రోజును శని త్రయోదశి అంటారు. ఆగస్టు 17వ తేదీ శనివారం త్రయోదశి తిథి ఉంది కాబట్టి ఆ రోజు శని త్రయోదశి పూజ చేసుకోవాలని పంచాంగ కర్తలు నిర్ణయించారు.
శని త్రయోదశి పూజకు శుభసమయం
ఆగస్టు 17వ తేదీ శనివారం ఉదయం 8 గంటల నుంచి 12 గంటలలోపు శని త్రయోదశి పూజ చేసుకోవాలి.
త్రయోదశి తిథి విశిష్టత
దేవదానవులు చేసిన క్షీరసాగర మథనంలో ఉద్భవించిన హాలాహలాన్ని తన కంఠంలో దాచుకుని లోకాలను కాపాడిన నీల కంఠుడైన ఆ శివుడికి కృతజ్ఞతలు చెప్పడానికి దేవతలందరూ ఆయన వద్దకు వెళ్లింది ఈ త్రయోదశి తిథి నాడే అని శివ పురాణం ద్వారా తెలుస్తుంది.
శని త్రయోదశి ప్రాముఖ్యత
శని త్రయోదశి రోజున శని దేవుడికి భక్తిశ్రద్ధలతో పూజా కార్యక్రమాలు చేసి శనిత్రయోదశి వ్రతాన్ని ఆచరించడం వల్ల ఆర్థిక, ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.
శని దేవుడు కష్టాలు ఇస్తాడా!
జ్యోతిష్య శాస్త్ర రీత్యా శనివారానికి అధిపతి శని భగవానుడు. ఏ వ్యక్తికైనా పూర్వజన్మ కర్మ ఫలితాలను అందించే అధికారం శనిది. అందుకే మానవులకు మంచి ఫలితాలు అయినా చెడు ఫలితాలు అయినా కలిగేది శని భగవానుని అనుగ్రహం వల్లనే! నిజానికి శని పాప గ్రహం అంటారు కానీ ఒక వ్యక్తిని అగ్నిపరీక్షలకు గురి చేసి దుర్మార్గం వైపు నుంచి సన్మార్గం వైపు నడిపించేది శని భగవానుడే! అందుకే శని దేవుని ఆరాధనకు అంతటి విశిష్టత.
శని త్రయోదశి పూజలు ఎవరు చేయాలి?
జాతకం ప్రకారం ఏలినాటి శని, అష్టమ శని అర్ధాష్టమ శని నడుస్తున్న వారు తప్పకుండా శని త్రయోదశి పూజలు చేసుకోవడం వల్ల శని దేవుని అనుగ్రహాన్ని పొందవచ్చు. అంతేకాకుండా మకరరాశి, కుంభ రాశికి అధిపతి శని భగవానుడు. ఈ రెండు రాశుల వారు కూడా జాతక ప్రకారం శని దోషాలు ఉన్నా, లేకున్నా తప్పనిసరిగా శని త్రయోదశి పూజ చేయించుకుంటే మేలు కలుగుతుంది. అలాగే వృశ్చిక రాశికి అర్ధాష్టమ శని ఉన్నందున ఈ రాశి వారు కూడా శని త్రయోదశి పూజలు జరిపించుకుంటే మేలు.
శని త్రయోదశి పూజ ఇలా చేయాలి
శని త్రయోదశి నాడు సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి. అభ్యంగన స్నానం చేయాలి. దగ్గరలో ఉన్న ఆలయానికి వెళ్లాలి. అక్కడ నవగ్రహాలకు ప్రత్యేక పూజలను నిర్వహించాలి. ఈ రోజు ప్రధానంగా శనీశ్వరుడిని ఆరాధించడం, తైలాభిషేకం చేయాలి. ఒక తమలపాకులో బెల్లం ఉంచి శనికి నైవేద్యంగా సమర్పించాలి. ఇలా చేయడం వల్ల జాతకంలో ఉన్న సర్వ దోషాలు తొలగిపోతాయని విశ్వాసం. అంతే కాకుండా ఈ రోజు నల్ల నువ్వులు, నల్లని వస్త్రంలో ఉంచి తాంబూలం, దక్షిణతో బ్రాహ్మణులకు దానం చేస్తే జాతకంలో అరిష్టాలు ఉంటే తొలగిపోయి సర్వశుభాలు చేకూరుతాయని పండితులు చెబుతారు.
సింపుల్గా ఇలా కూడా చేయవచ్చు!
శని త్రయోదశి నాడు సమయాభావం వల్ల ఇవేం చేయలేని వారు కనీసం నవగ్రహాల వద్ద మట్టి ప్రమిదలో నువ్వుల నూనెతో దీపారాధన చేసి, శనిదేవుని తమలపాకులో బెల్లం నైవేద్యంగా సమర్పించి, 9 ప్రదక్షిణలు చేస్తే శని దేవుని ప్రీతిని పొందవచ్చు. అలాగే శివునికి కానీ, ఆంజనేయస్వామికి కానీ భక్తితో 11 ప్రదక్షిణలు చేస్తే శనిదేవుని అనుగ్రహాన్ని పొందినట్లే అని శాస్త్ర వచనం. ఏ పూజకైనా భక్తి ప్రధానం. భక్తితో చేసే చిన్నపాటి పూజకైనా అపారమైన ఫలితం ఉంటుందని పెద్దలు చెబుతారు. మనమందరం కూడా రానున్న శని త్రయోదశిని భక్తిశ్రద్ధలతో జరుపుకుందాం. సకల దోషాలను తొలగించుకొని సర్వ శుభాలను పొందుదాం. ఓం శ్రీ శనైశ్చరాయ నమః
ముఖ్య గమనిక :పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.