Good Habits is True Health : ప్రస్తుత తల్లిదండ్రులు వారి పిల్లలకు మంచి విద్యనందిస్తున్నారు. వారి కోసం ఆస్తులు సంపాదించేందుకు శ్రమిస్తున్నారు. ముఖ్యంగా అమ్మానాన్నలు పిల్లల చదువు, ఆస్తులపైనే దృష్టి నిలుపుతున్నారు. నేటి తరం పిల్లలు పెద్దయ్యాక ఆరోగ్యకర వాతావరణంలో నివసించేందుకు దోహదపడే అంశాలను పూర్తిగా విస్మరిస్తున్నారు. మంచి ఆరోగ్యకర అలవాట్లు, ఆహ్లాదకరమైన పరిసరాలు, పర్యావరణం అందించాలనే విషయాన్ని మరిచిపోతున్నారు. ఉరుకుల పరుగుల జీవితంలో ఎంతో ముఖ్యమైన వీటిపై తల్లిదండ్రులు దృష్టి పెడితేనే పిల్లలకు మంచి భవిష్యత్తు అందించిన వారవుతారు. మంచి అలవాట్ల ప్రాముఖ్యాన్ని పిల్లలకు వివరించి వారు నేర్చుకునేలా చేయాలి. ఆరోగ్యకరమైన జీవితాన్ని గడిపేందుకు అవసరమయ్యే అవకాశాలను కల్పించాలి.
పరిశుభ్రత జీవితంలో చాలా ముఖ్యం : అనారోగ్యానికి అపరిశుభ్రత ప్రధాన కారణమని మనందరికి తెలుసు. పరిసరాలు, వ్యక్తిగత పరిశుభ్రతలను జీవిత కాలం ఆచరిస్తేనే గుడ్హెల్త్తో కూడిన జీవితమని చిన్నారులకు అర్థం అయ్యేలా తెలియపరచడం ముఖ్యం. రాష్ట్రంలో తరచూ అపరిశుభ్రమైన పరిసరాలు, ఆహారం, వ్యక్తిగత పరిశుభ్రత లోపించి ఈ మధ్య వ్యాధుల బారిన పడుతున్న సంఘటనలు ఎన్నో చోటు చేసుకుంటున్నాయి. పాఠశాలల్లో వాటిపై విద్యార్థులకు చాలా కాలంగా అవగాహన కల్పిస్తున్నా మార్కులకు పనికిరాని పరీక్షలుగా అవి మారుతున్నాయి. తల్లిదండ్రులు వారి బాధ్యతగా పిల్లలకు వ్యక్తిగత, చుట్టూ ఉన్న పరిసరాల పరిశుభ్రతను నేర్పించాలి. సెలవు దినాల్లో వారు చదువుకునే గదులు, వారు రోజువారీగా ఉపయోగించే వస్తువులను సొంతంగా శుభ్రపరచుకునే దిశగా అలవాటు చేయాలి.
చెడు వ్యసనాలకు దూరంగా : తల్లిదండ్రులు ఆదర్శంగా ఉంటే పిల్లలు కూడా వారిని అనుసరించి చిన్నతనం నుంచే మంచి అలవాట్లను నేర్చుకుంటారు. ముఖ్యంగా కుటుంబ పెద్దల తీరు, వ్యసనాలతో ఆరోగ్యంగా, ఆర్థికంగా నష్టపోయినప్పుడు ఆ కుటుంబ పరిస్థితి చాలా క్లిష్టంగా మారుతుంది. పిల్లలు ఇవన్నీ చూసి పక్కదారి పడతారు. రాష్ట్రంలో మత్తు పదార్థాల బారిన పడి గాడి తప్పుతున్న విద్యార్థుల కేసుల ఘటనలు వెలుగులోకి వచ్చాయి. పిల్లల భవిష్యత్తుపై కలలు కన్న తల్లిదండ్రులు వారికి ఆదర్శంగా నిలిచి పిల్లలు చేసే తప్పులకు జరిగే అనర్థాలను తెలిపి సరిచేయాలి. ఎదిగే వయసులోని విద్యార్థుల అలవాట్లు, ప్రవర్తనలను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి.
పిల్లలే కాదు, మొక్కలు ఎదిగేలా : గత వేసవిలో 47 డిగ్రీల సెల్సియస్ దాటడంతో రాష్ట్రంలోని ప్రజలు అల్లాడిపోయారు. మారుతున్న వాతావరణ పరిస్థితులు చెట్లు నరికేయడం, మొక్కలు పెంపకం తగ్గించడం, నగరాలు, పట్టణాలు, పల్లెలు కాంక్రీటైజేషన్తో ఈ పరిస్థితి నెలకొంది. ఇలా అయితే భవిష్యత్తు తరాల పరిస్థితి ఏంటనే ప్రశ్నను ప్రతి ఒక్కరు వేసుకోవాలి. ప్రభుత్వం ప్రతి ఏటా మొక్కలు నాటే కార్యక్రమం చేపడుతున్నా సంరక్షణ మాత్రం తమది కాదనే భావన ప్రజల్లో నెలకొంది. ప్రజలు వాటిని సంరక్షిస్తే తమ పిల్లలను అవి సంరక్షిస్తాయనే మంచి ఆలోచనను తల్లిదండ్రులు గుర్తుంచుకోవాలి. పిల్లల పుట్టిన రోజున మొక్కలు నాటించి వాటి సంరక్షణ బాధ్యతను వారికే అప్పగించి చూడాలి.
ఆరోగ్యమే మహాభాగ్యం : జీవితాన్ని ఆస్వాదించాలంటే ముందుగా ఆరోగ్యమే ప్రధానం. తల్లిదండ్రులు మంచి అలవాట్లు ఆచరిస్తూ, వ్యాయామాలు చేస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటే ముసలితనం వచ్చాక తమ పిల్లలకు ఇబ్బంది కలిగించకుండా ఉంటారు. పిల్లలకూ అదే అలవాటు చేయాలి. తెల్లవారుజామునే నిద్ర లేపడంతోపాటు సమయానికి చిన్న చిన్న వ్యాయామాలు చేయడం, తినడం, నిద్రపోవడం, ఆటలాడటం, వంటివి ఆచరించేలా ప్రోత్సహించాలి. చదువుతోపాటు ఆరోగ్యకర అలవాట్లతోనే పెద్దయ్యాక జీవితాన్ని ఆనందంగా, సంతోషంగా ఆస్వాదించగలుగుతారనే విషయాన్ని తల్లిదండ్రులు బలంగా గ్రహించాలి.
వ్యాయామం చేయడానికి టైమ్ ఉండట్లేదా? రోజూ ఇలా చేస్తే చాలు ఆరోగ్యం మీ సొంతం! - Body Tapping Benefits
పొద్దున రాగి జావ - సాయంత్రం జొన్న, గోధుమ రొట్టెలు - పట్టణాల్లో ఇప్పుడు ఇదే ట్రెండ్