Shaligram Stone Importance :పరమ పవిత్రమైన కార్తీకమాసంలో చేసే స్నానదాన జపాలకు విశేషమైన ఫలం ఉంటుందని పురాణం వచనం. ముఖ్యంగా కార్తీకంలో సద్బ్రాహ్మణులకు సాలగ్రామ దానం చేయడం వల్ల జన్మ జన్మార్జిత పాపాలు పటా పంచలవుతాయని శాస్త్ర వచనం. ఈ కథనంలో సాలగ్రామ దాన విశిష్టతను తెలుసుకునే ముందు అసలు సాలగ్రామం అంటే ఏంటో తెలుసుకుందాం.
సాలగ్రామం అంటే ఏమిటి?
సాలగ్రామము విష్ణుప్రతీకమైన ఒక శిలా విశేషము. సర్వకాల సర్వావస్థలయందు విష్ణువు సాక్షాత్తు నివాసం ఉండేది సాలగ్రామంలో మాత్రమే. అందుచేతే గృహదేవతార్చనలలోగానీ, దేవాలయాలలో గానీ సాలగ్రామము లేకుండా పూజలు కొనసాగవు. ద్వైతులు, విశిష్టాద్వైతులు, అద్వైతులు తమతమ దేవతార్చనలలో సాలగ్రామములను పూజిస్తారు.
ఇవి పూజనీయమైనవి
హిందూ మత విశ్వాసాల ప్రకారం తులసి, శంఖం, సాలగ్రామం పూజనీయమైనవి. భారతదేశంలో సాలగ్రామ పూజ చాలా పురాతనమైనది. సాధారణంగా ప్రతిమలకు నిత్య పూజా సమయంలో ఆవాహనాది షోడశోపచారాలు చేయాలి. సాలగ్రామాలలో దేవత నిత్యం కొలువై ఉండడం వల్ల వాటికి పూజా సమయంలో అవాహనాది ఉపచారాలు అవసరం లేదు.
ఇల్లే దేవాలయం
సాలగ్రామాలు ఉన్న ఇల్లు గొప్ప పుణ్యక్షేత్రంతో సమానం. సాలగ్రామ దర్శనం వల్ల, స్పర్శవల్ల, అర్చనవల్ల అంతులేని పుణ్యం లభిస్తుంది. అసలు ఈ సాలగ్రామాలు ఎలా పుడతాయి? ఎక్కడ దొరుకుతాయి అనే ప్రశ్నలకు సమాధానం చూద్దాం.
సాలగ్రామాల పుట్టు పూర్వోత్తరాలు
సాలగ్రామాలు శిలాజాలు. శాస్త్రజ్ఞులు ఈ శిలలను ఒక విధమైన ప్రాణి నిర్మిస్తుందని అంటారు. 'ఆలి' అనే ఒక విధమైన మత్స్యం శీతాకాలంలో తన శరీరం నుంచి వెలువడే ఒక విధమైన రసాయనిక పదార్ధంతో శిలామయమైన కవచాన్ని నిర్మించుకుని దానిలో నివశిస్తుందని అది మరణించినప్పుడు లేక వదిలి వెళ్ళినప్పుడు అవి సాలగ్రామాలుగా మనకు లభిస్తాయని అంటారు.
సాలగ్రామాలు ఇక్కడ దొరుకుతాయి
నేపాల్ దేశంలో ఖట్మండుకు సుమారు 197 మైళ్ళు దూరంలో ముక్తినాధ్, గండకీ తీరాన్ని ఆనుకుని ఉన్న సాలగ్రామ గిరిపైన, గండకీ నదీ గర్భంలోను లభిస్తాయి.
సాలగ్రామాలు పుట్టుక వెనుక ఉన్న పౌరాణిక గాథ
పూర్వం విదేహ రాజ్యంలో ప్రియంవద అనే స్త్రీ మూర్తి ఉండేది. అత్యంత రూపవతి, గుణవతి అయిన ఆమె, శ్రీమన్నారాయణుని ప్రసన్నం చేసుకుని, ఆయన తన కుమారునిగా జన్మించాలని కోరుకుంటుంది. ఆమె కోరికను మన్నించిన స్వామి వారు, మరుజన్మలో ఆమె గండకీ నది రూపాన్ని ధరించేటట్లుగా చేసి, తాను సాలగ్రామ రూపంలో ఆ నది నుంచి ఉద్భవిస్తున్నారని కథ.
ఎవరు ఏ సాలగ్రామాలు పూజించాలి?
సాలగ్రామములు మన శాస్త్రం అనుసరించి కొన్ని సౌమ్యమైనవి. కొన్ని ఉగ్రమైనవి. శాస్త్ర సమ్మతంగా చక్రశుద్ధి, వక్త్రశుద్ధి, శిలాఉద్ధి, వర్ణశుద్ధి గల వాటినే పూజించాలి. నారసింహ పాతాళ నారసింహ, గండభేరుండ, మహాజ్వాల మొదలైనవాటిని సన్యాసులు, బ్రహ్మచారులు పూజించాలి. విష్ణు, సీతారామ, గోపాల వంటి శాంతమూర్తులనే గృహస్థులు పూజించాలని అంటారు.
సాలగ్రామాలలోని రకాలు
సాలగ్రామంపై గల చక్రాలను బట్టి వాటికి వివిధములైన పేర్లు ఉన్నాయి.
- 1 చక్రం ఉంటే - సుదర్శనం
- 2 చక్రములు ఉంటే - లక్ష్మీనారాయణ
- 3 చక్రములు ఉంటే - అచ్యుతుడు
- 4 చక్రములు ఉంటే - జనార్ధనడు
- 5 చక్రములు ఉంటే - వాసుదేవుడు
- 6 చక్రములు ఉంటే - ప్రద్యుమ్నుడు
- 7 చక్రములు ఉంటే - సంకర్షణుడు
- 8 చక్రములు ఉంటే - పురుషోత్తముడు
- 9 చక్రములు ఉంటే - నవ వ్యూహము
- 10 చక్రములు ఉంటే - దశావతారము
- 11 చక్రములు ఉంటే - అనిరుద్ధుడు
- 12 చక్రములు ఉంటే - ద్వాదశాత్ముడు
- 12 చక్రములు కన్నా ఎక్కువ ఉంటే - 'అనంతమూర్తి'
సాలగ్రామ దాన మహత్యం
సాలగ్రామాన్ని పూజిస్తే ఎంత పుణ్యం లభిస్తుందో, సాలగ్రామ దానం వలన కూడా అంతటి ఫలం లభిస్తుంది. కార్తీక మాసంలో బ్రాహ్మణుల సమక్షంలో సమస్త విధివిధానాలతో సాలగ్రామాన్ని భక్తిశ్రద్ధలతో, పరిపూర్ణ విశ్వాసంతో, శాస్త్ర ప్రకారం దానం చేస్తే కోటి యజ్ఞాలు చేసినంత పుణ్యఫలం, కోటి గోవులను దానం చేసిన ఫలం, కాశీ క్షేత్రంలో పవిత్ర గంగా నదీ స్నానం కంటే కోటి రెట్ల అధిక ఫలం లభిస్తుందని శాస్త్రవచనం.
సర్వాంతర్యామి యొక్క ప్రతీక అయిన 'సాలగ్రామాన్ని' పూజించడం, దానం చేయడం ఈ కలియుగంలో మానవులమైన మనకు కలగటం, నిజంగా అపూర్వమైన అదృష్టం. అవకాశం దొరికితే, ఆ పుణ్యఫలాన్ని దక్కించుకునేందుకు ప్రయత్నం చేయడం మనందరి కర్తవ్యం. ఓం శ్రీ కార్తీక దామోదరాయ నమః
ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.