Saphala Ekadashi Vrat Katha :చేపట్టిన పనులన్నీ విజయవంతం కావాలని కోరుకునే వారు తప్పకుండా సఫల ఏకాదశి వ్రతాన్ని ఆచరించాలని శాస్త్రం చెబుతోంది. ఒకవేళ ఏ కారణం చేతనైన వ్రతం ఆచరించలేని వారు సఫల ఏకాదశి వ్రత కథను భక్తి శ్రద్ధలతో చదివినా విన్నా కూడా వ్రతం ఆచరించిన ఫలితం దక్కుతుందని పురాణం వచనం. అందుకే సఫల ఏకాదశి వ్రత కథను ఇప్పుడు విపులంగా తెలుసుకుందాం.
సఫల ఏకాదశి వ్రత కథ
సఫల ఏకాదశి వ్రత మహత్యాన్ని పరమ శివుడు స్వయంగా పార్వతికి చెప్పినట్లు పద్మ పురాణం ద్వారా తెలుస్తోంది. సఫల ఏకాదశి వ్రతం ఆచరించిన వారు వ్రత కథను కూడా చదువుకొని అక్షింతలు శిరస్సున వేసుకుంటే వ్రతం సంపూర్ణమై వ్రతఫలం పూర్తిగా దక్కుతుంది. అందుకే ఇప్పుడు వ్రత కథను తెలుసుకుందాం.
శ్రీకృష్ణుడు పాండవులకు చెప్పిన కథ
సఫల ఏకాదశి రోజున జాగరణ చేసి ఆలయాల్లో దీపాలను వెలిగిస్తే ఐదు వేల సంవత్సరాలు తపస్సు చేసిన ఫలితం దక్కుతుందని, ఈ వ్రతానికి సమానమైన యజ్ఞం కానీ, తీర్థం కానీ మరోటి లేదని పురాణాల ద్వారా తెలుస్తోంది. సఫల ఏకాదశి విశిష్టతను చాటిచెప్పే కథను కూడా శ్రీకృష్ణుడు పాండవులకు చెప్పినట్లు పురాణాలు చెప్తున్నాయి.
లుంభకుని కథ
పూర్వం చంపావతి రాజ్యమును మహిష్మంతుడు అనే రాజు పాలించేవాడు. అతనికి లుంభకుడు అనే కుమారుడు ఉండేవాడు. లుంభకుడు చెడు సావాసాలతో, దుష్ట బుద్ధితో అధర్మ మార్గంలో జీవిస్తుండటం వల్ల, కుమారుడని కూడా చూడకుండా రాజు అతనికి రాజ్య బహిష్కరణ శిక్ష విధించాడు. లుంభకుడు అడవుల పాలై ఆహారము దొరకక, తన పరిస్థితికి పశ్చాత్తాపపడుతూ మర్రిచెట్టు వద్ద రాత్రంతా గడిపి, ఏమీ తినకుండా చింతిస్తూ స్పృహ తప్పి పడిపోయాడు.