Sankashti Chaturthi April 2024 Date and Muhurtham: సకల విఘ్నాలకు అధిపతి ఆ గణేషుడు. నిత్యం విగ్నేశ్వరుడిని పూజిస్తే అన్ని సంకటాలు, బాధలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు. అందుకే ప్రతి మాసంలో పౌర్ణమి తర్వాత వచ్చే చతుర్థినాడు సంకటహర చతుర్థిని నిర్వహిస్తారు. దీనినే 'సంకష్టహార చతుర్థి' లేదా 'సంకష్టి చతుర్థి' అని కూడా పిలుస్తారు. ఈ రోజున ఆ స్వామి వారిని నిండుమనసుతో ఆరాధిస్తే అన్ని సంకటాలు తొలగిపోతాయని గణపతిపురాణం చెబుతోంది. అయితే, చైత్ర మాసంలో సంకటహర చతుర్థి ఏ రోజున వచ్చింది ? గణపతి దేవుడిని పూజించడానికి సరైన ముహూర్త సమయం ఏది ? అనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
మానవుల కష్టాల నుంచి గట్టెక్కించేది సంకటహర చతుర్థి వ్రతం. గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైన తిథులలో ప్రధానమైనది చవితి తిథి. అయితే ఈ చవితి లేదా చతుర్థి పూజను రెండు రకాలుగా ఆచరిస్తారు. మొదటిది వరదచతుర్థి, రెండవది సంకష్టహర చతుర్థి. అమావాస్య తరువాత వచ్చే చతుర్థి రోజున చేసే వ్రతంను వరద చతుర్థి అని, పౌర్ణమి తరువాత వచ్చే చతుర్థి రోజున చేసే వ్రతంను సంకష్టహర చతుర్థి లేదా సంకటహర చతుర్థి వ్రతం అంటారు. ఇందులో వరదచతుర్థిని వినాయక వ్రతంగా వినాయక చవితి రోజున ఆచరిస్తారు. సంకటములను తొలించే సంకట హర చతుర్థి వ్రతంను మాత్రం ప్రతి మాసంలో పౌర్ణమి తర్వాత వచ్చే చతుర్థినాడు జరుపుకుంటారు. మరి ఈ నెలలో ఎప్పుడు వచ్చిందంటే..
సంకటహర చతుర్థి శుభముహూర్తం:చైత్ర మాసంలోజరుపుకునే సంకటహర చతుర్థిని వికట సంకష్టి చతుర్థి అని పిలుస్తారు. కాగా ఈ పండగ తిథి ఏప్రిల్ 27న ఉదయం 8:17 గంటలకు మొదలై.. ఏప్రిల్ 28 ఉదయం 8 గంటల 21 నిమిషాలకు ముగుస్తుంది. చంద్రుడుని దర్శించుకునేందుకు శుభమూహూర్తం ఏప్రిల్ 27న రాత్రి 9 గంటల 13 నిమిషాలు. ఈ పండగను ఏప్రిల్ 27 శనివారం రోజు జరుపుకోనున్నారు. వికట సంకటహర చతుర్థి పూజా విధానం:
- సంకటహర చతుర్థి నాడు తెల్లవారుజామున నిద్రలేచి ఇళ్లు శుభ్రం చేసుకోవాలి. ఇళ్లు మొత్తం గంగాజలం చల్లుకోవాలి.
- తర్వాత తలస్నానం చేసి పూజ గదిని శుభ్రం చేసుకోవాలి.
- వినాయకుడి విగ్రహాన్ని ఉంచి ఆయనకు ఇష్టమైన పసుపు రంగు పూలను అలకరించాలి. అలాగే దర్భ గడ్డిని సమర్పించాలి.
- నైవేద్యంగా బూందీ లడ్డు, మోదకాలను నివేదించాలి.
- ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించాలి.
- సంకటహర వ్రత కథను చదివి హారతివ్వాలి. పూజలో ఏమైనా పొరపాట్లు జరిగి ఉంటే క్షమించమని కోరుతూ గుంజిళ్లు తీయాలి.
- పూజ అనంతరం ఉపవాసం ఉండాలనుకునేవారు ఉపవాసం నియమాల్ని పాటించాలి.
- సాయంత్రం కూడా గణేశుడికి తప్పనిసరిగా పూజ చేసి.. చంద్రదర్శనం తరువాత ఉపవాసం విరమించాలి.
- ఉపవాసం విరమించిన తర్వాత సాత్విక ఆహారాన్ని మాత్రమే తినాలి.