Rudraram Ganesh Gadda Temple : వీసాల దేవుడుగా పేరొందిన చిలుకూరు బాలాజీ ఆలయం లాంటిదే ఈ ఆలయం కూడా! మనస్సులోని కోరిక స్వామికి విన్నవించి 11 ప్రదక్షిణలు చేస్తే చాలు. మీ మనస్సులోని కోరిక నెరవేరుతుంది!!. కానీ ఆ కోరిక తీరిన తర్వాత తప్పకుండా 108 ప్రదక్షిణాలు చేసి మొక్కు తీర్చుకోవాలి. మరి ఈ ఆలయం ఎక్కడ ఉంది? ఆలయ విశిష్టత ఏమిటి? తదితర ఆసక్తికర విషయాలను ఈ కథనంలో తెలుసుకుందాం.
రుద్రారం గణేశ్ గడ్డ దేవాలయం
తెలంగాణ రాష్ట్రంలోని పటాన్‌చెరు మండలం రుద్రారం గ్రామంలో వెలసిన ఈ గణేశ్ ఆలయం అత్యంత మహిమాన్వితమైనది. దక్షిణాభిముఖంగా ఉన్న ఈ ఆలయంలో వినాయకుడు స్వయంభువుగా వెలిశాడు. కర్ణాటక సరిహద్దు ప్రాంతంలోని ప్రాచీన పుణ్యక్షేత్రాలలో ఒకటైన ఈ ఆలయంలో గణనాథుడు సంకటహర చతుర్థి రోజున విశేషంగా పూజలు అందుకుంటారు.
ఆలయ స్థల పురాణం
దాదాపు 200 ఏళ్ల క్రితం జరిగిన సంఘటన. కర్ణాటకకు చెందిన శివరామ భట్టు అనే వ్యక్తి గణేశుడికి పరమ భక్తుడు. శివరామ భట్టు ఎక్కడుంటే అక్కడికి గణనాథుడు స్వయంగా వచ్చి పూజలు అందుకుంటాడట. ఒకసారి ఇతను కాలినడకన తిరుమల వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. తిరుమల వెళ్తూ మార్గమధ్యంలో రుద్రారం అడవుల్లో ఆగాడు. ఆ రోజు సంకష్టహర చతుర్థి కావడం వల్ల శివరామ భట్టు అక్కడ సింధూరంతో స్వామి విగ్రహాన్ని తయారుచేసి పూజించాడు. అనంతరం ఆ విగ్రహాన్ని అడవిలోనే వదిలేసి శివరామ భట్టు తిరుమలకు నడుచుకుంటూ వెళ్ళాడు.
కనుమరుగైన గణేశుని విగ్రహం
కొన్నాళ్లకు శివరామ భట్టు పూజించిన సింధూర విగ్రహం కనుమరుగైపోయింది. కాలక్రమంలో ఓసారి మఖందాస్ అనే భక్తుడు అడవిలో గుర్రంపై సంచరిస్తుండగా, శివరామ భట్టు పూజించిన గణనాథుడి విగ్రహం ఉన్న ప్రాంతానికి వచ్చేసరికి ఆ గుర్రం కదల్లేకపోయింది. దాంతో ఆ విగ్రహం పక్కనే మఖందాస్ నిద్రపోయాడు. అప్పుడు అతనికి కలలో వినాయకుడు కనిపించి తనకు అక్కడే చిన్న గుడి కట్టాలని కోరాడు. దాంతో మఖందాస్ వెంటనే గుడి కట్టించే పని మొదలుపెట్టాడు. అలా ఈ ఆలయం ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంది.
ఆలయ విశేషాలు
గర్భాలయంలో స్వామి విగ్రహం సింధూరంతో ఉంటుంది. స్వామివారి విగ్రహం కింద మకర తోరణంతో పాటు సూక్ష్మ గణపతి విగ్రహం కూడా చూడముచ్చటగా ఉంటుంది.