Remedies to Get Rid of Debts in Telugu:డబ్బు అత్యవసరమైనప్పుడు, చేతిలో రూపాయి లేనప్పుడు అందరికీ గుర్చొచ్చేది అప్పు. ఆరోగ్య అవసరాలు, ఇంటి నిర్మాణం, పిల్లల చదువు, ఇలా పలు కారణాల వల్ల చాలా మంది అప్పులు చేస్తుంటారు. చేసిన అప్పులు తీర్చినా మళ్లీ మళ్లీ చేయాల్సిన పరిస్థితులు కూడా తలెత్తుతాయి. అలాంటి సమయంలో చాలా మంది ఆందోళన చెందుతుంటారు. అప్పులు తీర్చే మార్గాల కోసం ఆలోచిస్తుంటారు. అలాంటి వారు ఈ పరిహారాలు పాటిస్తే త్వరగా అప్పులు తీరుతాయని ప్రముఖ జ్యోతిష్య నిపుణులు మాచిరాజు కిరణ్ కుమార్ చెబుతున్నారు. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ఆంజనేయ స్వామికి అభిషేకం:
- ఏ లోహంతో తయారుచేసినా సరే ఆంజనేయ స్వామి చిన్న విగ్రహాన్ని మంగళవారం రోజు ఇంటికి తీసుకురావాలి.
- ఈ విగ్రహాన్ని పూజ గదిలో ఉంచి సింధూర జలాలతో అభిషేకం చేయాలి. సింధూర జలాలు అంటే నీటిలో సింధూరాన్ని కలిపి స్వామి వారికి అభిషేకం నిర్వహించాలి. అభిషేకం చేసే సమయంలో "ఓం పవనసుతాయ నమః" అనే నామాన్ని 21 సార్లు జపించాలి.
- సింధూర జలాలతో అభిషేకం పూర్తైన తర్వాత పంచామృతాలతో కూడా అభిషేకం చేయాలి. అప్పుడూ "ఓం పవనసుతాయ నమః" అనే మంత్రాన్ని 21 సార్లు జపించాలి.
- అభిషేకం చేసిన పంచామృతాలను నైవేద్యంగా స్వీకరించాలని, సింధూర జలాలను నుదుటిన ధరించాలని చెబుతున్నారు.
- ఇలా కనీసం తొమ్మిది మంగళవారాలు చేస్తే ఆంజనేయ స్వామి అనుగ్రహంతో ధనం కలిసి వచ్చి అప్పులు తీరుతాయని అంటున్నారు.
సుబ్రహ్మణ్య స్వామి:అప్పులు పోగొట్టే శక్తి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఉందని మాచిరాజు చెబుతున్నారు. అందుకోసం
- మంగళవారం రోజు ఓ ఎర్రటి వస్త్రంలో 5 గులాబీ పువ్వులు, కొంచెం పటిక బెల్లం, కొన్ని బియ్యం వేసి మూట కట్టాలి.
- సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్లి ఆ మూటను చేతిలో పట్టుకుని అప్పులు పోవాలని ప్రార్థిస్తూ తొమ్మిదిసార్లు ఆలయంలో ప్రదక్షిణలు చేయాలి. వీలైతే అర్చన చేయించుకుని గుడి ప్రాంగణంలో కొద్దిసేపు కూర్చోవాలి.
- ఆ తర్వాత ఆ మూటను ఎక్కడైనా దగ్గర్లో పారే నీటిలో విడిచిపెట్టాలి. అలా వీలు కానప్పుడు ఎవరూ తొక్కని చోట చెట్టు మొదట్లో ఉంచాలి.
- మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో ఈ ప్రత్యేక పరిహారం చేసుకుంటే స్వామి అనుగ్రహంతో క్రమక్రమంగా అప్పుల నుంచి బయటపడవచ్చని చెబుతున్నారు.
ఈ ఉంగరంతో అప్పులు మాయం:అప్పులన్నీ సంపూర్ణంగా తొలగించే శక్తి ఓ ప్రత్యేక ఉంగరానికి ఉంటుందని, దానిని పగడ గణపతి ఉంగరం అంటారని మాచిరాజు చెబుతున్నారు. నవరత్నాల్లో పగడాన్ని తీసుకుని దాని మీద గణపతి రూపాన్ని చెక్కించాలి. ఆ తర్వాత ఆ పగడ గణపతిని రాగి లోహంతో చేయించుకుని కుడి చెయ్యి ఉంగరం వేలుకు ధరిస్తే అప్పుల నుంచి త్వరగా బయటపడవచ్చని చెబుతున్నారు.