Puja Room Objects Not to Place on Ground:హిందువులు పూజగదిని అత్యంత పవిత్రంగా భావిస్తారు. చాలా మంది రోజూ ఉదయాన్నే స్నానం చేసిన తర్వాత పూజ గదిలోకి వెళ్లి దీపారాధన చేస్తుంటారు. అలాగే కాసేపు ధ్యానం చేసి మిగతా పనులు చేస్తుంటారు. అయితే, తెలిసో తెలియకో మనం పూజ గదిలోని కొన్ని వస్తువులను నేలపైన పెడుతుంటాం. కానీ, దేవీ భాగవతం ప్రకారం.. పూజ గదిలోని కొన్ని రకాల వస్తువులను అస్సలు కింద పెట్టకూడదని ప్రముఖ జ్యోతిష్య పండితుడు మాచిరాజు కిరణ్ కుమార్ చెబుతున్నారు. ఇలా చేస్తే ప్రతికూల ప్రభావాలు ఎదురవుతాయని అంటున్నారు. ఇంతకీ ఏ వస్తువులు అస్సలు నేలపైన పెట్టకూడదో ఇప్పుడు చూద్దాం.
శంఖం :చాలా మంది ఇళ్లలో పూజ గదిలో శంఖం ఉంటుంది. విష్ణుమూర్తికి ప్రియమైన శంఖం ఉండడం వల్ల లక్ష్మీకటాక్షం కలుగుతుందని నమ్ముతారు. అయితే, కొంతమంది దేవుడి ఫొటోలు, విగ్రహాలు శుద్ధి చేసే క్రమంలో పొరపాటున శంఖం కింద పెడుతుంటారు. కానీ, ఎట్టిపరిస్థితుల్లో కూడా శంఖం కింద పెట్టకూడదని మాచిరాజు కిరణ్ కుమార్ చెబుతున్నారు. ఇలా చేస్తే లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుందని అంటున్నారు.
గంట :దాదాపు ప్రతి పూజ గదిలో గంట తప్పకుండా ఉంటుంది. దేవుడికి పూజ చేసిన తర్వాత గంట మోగిస్తుంటాం. అయితే, పూజ గదిని శుద్ధి చేసే క్రమంలో చాలా మంది గంటను నేలపైన పెడుతుంటారు. కానీ, ఇలా నేల పైన అస్సలు పెట్టకూడదని మాచిరాజు చెబుతున్నారు.
శివలింగం :కొన్ని ఇళ్లలోని పూజ గదిలో శివలింగం ఉంటుంది. అయితే, ఎట్టి పరిస్థితుల్లో దీనిని కూడా కింద పెట్టకూడదని చెబుతున్నారు.
దీపారాధన కుందులు :చాలా మంది పూజ గదిలో తెలియక చేసే తప్పులలో దీపారాధన కుందులు కింద పెట్టడం ఒకటి. వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ కింద పెట్టవద్దని.. శుభ్రం చేసిన తర్వాత ప్లేట్లలో పెట్టి ఉంచాలంటున్నారు.
తులసి దళాలు :చాలా మంది ఉదయాన్నే స్నానం చేసిన తర్వాత పూజ కోసం తులసి దళాలను కోసుకొస్తుంటారు. అయితే, తర్వాత వీటిని కింద పెడుతుంటారు. కానీ, ఇలా తులసి దళాలను కింద పెట్టడం మంచిది కాదని మాచిరాజు కిరణ్ కుమార్ తెలిపారు.