Pancha Bhoota Linga Temples :హిందూ సంస్కృతిలో పరమేశ్వరుని లింగ రూపంలో పూజిస్తారు. భారతదేశంలో పరమశివుడికి సంబంధించి ఎన్నో మహిమాన్విత క్షేత్రాలు ఉన్నాయి. వాటిలో ప్రముఖంగా చెప్పుకోదగ్గవి పంచభూత శివలింగాలు. వీటిలో నాలుగు దేవాలయాలు తమిళనాడు రాష్ట్రంలో ఉండగా, ఒక దేవాలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. ముఖ్యంగా కార్తీక మాసంలో తీర్థయాత్ర పర్యటనల్లో పంచ భూత లింగాల సందర్శనకు ఎంతో ప్రాధాన్యత ఉంది.
పంచభూతలింగాలంటే!
ప్రకృతిలోని పంచభూతాలకు ప్రతీకలు ఈ పంచభూత లింగాలు. అవి ఆకాశ లింగం, పృథ్వి లింగం, అగ్ని లింగం, జలలింగం, వాయు లింగం. వీటిలో మొదటిది ఆకాశలింగం గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.
ఆకాశలింగం చిదంబరం
ఈ రోజు మనం పంచభూతలింగాలలో మొదటిది ఆకాశలింగం అయిన చిదంబరం క్షేత్ర విశేషాలు తెలుసుకుందాం.
చిదంబరం విశిష్టత
తమిళనాడు రాజధాని చెన్నైకి 240 కిలోమీటర్ల దూరంలో ఉన్న చిదంబరం క్షేత్రంలో ఎన్నో ఆధ్యాత్మిక విశేషాలు వింతలూ ఉన్నాయి. పరమశివుడు నృత్యం చేసినట్లుగా చెప్పబడే ఐదు స్థలాల్లో చిదంబరం కూడా ఒకటి.
నిరాకారం - నిర్గుణత్వం
చిదంబరంలో పరమశివుడు నిరాకారుడై దర్శనమిస్తాడు. ఈ ఆలయంలోని గర్భగుడిలో మనకు శివలింగం కానీ, ఎలాంటి విగ్రహం కానీ కనిపించవు. భక్తులు దర్శనానికి వెళ్ళినప్పుడు అక్కడి పూజారులు ఒక తెర వంటి వస్త్రాన్ని తొలగించి చూపించినప్పుడు అప్పుడు అక్కడ ఒక గోడ మాత్రం కనిపిస్తుంది. భక్తులు దానినే శివ స్వరూపంగా భావించి దర్శించి తరిస్తారు. దీని వెనుక దాగి ఉన్న నిగూఢ అర్ధమేమిటంటే చిదంబరంలో వెలసిన స్వామి ఆకాశ లింగానికి ప్రతీక. ఆకాశమంటే శూన్యం ఏమి లేనిదని అర్థం. అందుకే స్వామి ఇక్కడ నిరాకార స్వరూపం ఏ ఆకారం లేని వానిగా ఉంటాడు. ఈ ఆలయంలో మనం నమ్మలేని వింతలు, విశేషాలు ఎన్నో ఉన్నాయి. అంతేకాదు పరమేశ్వరుడు నటరాజ రూపంలో దర్శనమిచ్చే ఏకైక దేవాలయం ఇదొక్కటే.
ఆకాశ తత్వానికి ప్రతీక
పంచ భూతాలలో ఒకటైన ఆకాశ తత్త్వానికి ప్రతీకగా భావించే ఈ ఆలయంలోని గర్భాలయంలో వెనుకభాగంలో ఓ చక్రం ఉంటుంది. దానికి ముందు భాగంలో బంగారం బిల్వ పత్రాలు వేలాడుతూ కనిపిస్తాయి. అయితే వీటిని భక్తులకు కనబడకుండా ఓ తెరను అడ్డుగా ఉంచుతారు అక్కడి పూజారులు. ప్రత్యేకమైన సందర్భాల్లో మాత్రం భక్తులకు ఆ తెరను తీసేసి భక్తులకు చూపిస్తారు. ఈ ప్రదేశాన్నే 'శివోహంభవ' అంటారు. శివ అంటే దైవం, అహం అంటే మనం. మన మనసు దైవంలో ఐక్యమయ్యే ప్రదేశమని అర్థం. ఏ రూపం లేకుండా అజ్ఞానాన్ని తొలగించుకుంటూ దైవ సన్నిధి అనుభూతి చెందడమే ఈ పుణ్యక్షేత్రం ప్రాశస్త్యం. అదే చిదంబర రహస్యమని పండితులు చెబుతారు. బహుశా అందుకేనేమో అంతు పట్టని విషయాల గురించి 'అది చిదంబర రహస్యమనే' మాట వాడుకలోకి వచ్చింది.
ఒళ్లు జలదరించే దివ్యానుభూతి
చిదంబరం ఆలయానికి వెళ్లి దర్శనం చేసుకున్న ప్రతి ఒక్కరికీ ఒక గొప్ప అనుభూతి ఖచ్చితంగా కలుగుతుంది. అదేమిటంటే ఎవరైతే ఈ గుడిలో నటరాజ స్వామిని దర్శనం చేసుకుని బయటికొచ్చి వెనక్కి తిరిగి చూస్తే ఈ దేవాలయానికి సంబంధించిన గోపురం మన వీపు వెనుకే వస్తున్న అనుభూతి కలుగుతుంది.