Padmavathi Brahmotsavam Muthyapu Pandiri Vahanam : తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఈ నెల 30వ తేదీ శనివారం ఉదయం జరుగనున్న ముత్యపు పందిరి వాహన విశిష్టతను తెలుసుకుందాం.
ముత్యపుపందిరిపై అలమేలుమంగమ్మ
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా బ్రహ్మోత్సవాలలో మూడో రోజైన శనివారం ఉదయం ముత్యపుపందిరి వాహనంపై బకాసుర వధ అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు. ఈ సందర్భంగా అమ్మవారు ముత్యపు పందిరి వాహనంపై తిరు మాడ వీధులలో ఊరేగుతూ భక్తులను అనుగ్రహిస్తారు.
ముత్యపు పందిరి వాహన విశిష్టత
ముద్దులొలికించే ముత్యాలు అలిమేలుమంగ కు ప్రీతిపాత్రమైనవి. స్వాతి కార్తెలో వాన చినుకులు సాగరంలోని ముత్యపు చిప్పల్లో పడి మేలిమి ముత్యంగా రూపొందుతాయని, ఈ ముత్యాలు ఏనుగుల కుంభ స్థలాల్లో ఉంటాయని అంటారు. పదకవితా పితామహుడు తాళ్ళపాక అన్నమాచార్యులు తన కీర్తనల్లో అమ్మవారి నవ్వులు, చూపులు, మాటలు, సిగ్గులు మేలిమి ముత్యాల వంటివని కొనియాడారు. అటువంటి తెల్లని చల్లని ముత్యపు పందిరిపై ఊరేగుతున్న అలమేలుమంగను సేవించిన భక్తులకు తాపత్రయాలు తొలిగి, కైవల్యం చేకూరుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం.