తెలంగాణ

telangana

ETV Bharat / spiritual

ఆ రాశి వారు శత్రువుల పట్ల జాగ్రత్తగా ఉండాలి - దుర్గాదేవిని పూజించడం శ్రేయస్కరం! - Weekly Horoscope - WEEKLY HOROSCOPE

October 6th to October 12th 2024 Weekly Horoscope : 2024 అక్టోబర్‌ 6వ తేదీ నుంచి అక్టోబర్ 12వ తేదీ వరకు మీ రాశి ఫలం ఎలా ఉందంటే ?

Weekly Horoscope
Weekly Horoscope (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Oct 6, 2024, 4:29 AM IST

October 6th to October 12th 2024 Weekly Horoscope : 2024 అక్టోబర్‌ 6వ తేదీ నుంచి అక్టోబర్ 12వ తేదీ వరకు మీ రాశి ఫలం ఎలా ఉందంటే ?

మేషం (Aries) :మేషరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి, వ్యాపార రంగంలో ఎదురయ్యే సవాళ్ళను ఆత్మవిశ్వాసంతో అధిగమిస్తారు. కెరీర్ పరంగా అన్ని రంగాల వారికి శుభ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగులు అంకితభావంతో పనిచేసి అవార్దులు, రివార్డులు అందుకుంటారు. మీ పని తీరుతో అందరినీ మెప్పిస్తారు. ప్రమోషన్ ఛాన్స్ ఉంది. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులు అసామాన్యమైన ప్రతిభతో అత్యుత్తమ ఫలితాలను అందుకుంటారు. నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. కోరుకున్న ఉద్యోగాన్ని పొందుతారు. ఆర్థికంగా ఆశాజనకంగా ఉంటుంది. వ్యాపారులు, స్థిరాస్తి రంగం వారు గణనీయమైన లాభాలు పొందవచ్చు. గత కొంతకాలంగా వేధించిన అనారోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి. కుటుంబంతో కలిసి విహారయాత్రలకు వెళతారు. శ్రీ కనకదుర్గా దేవి ఆలయ సందర్శన మేలు చేస్తుంది.

వృషభం (Taurus) :వృషభరాశి వారికి ఈ వారం సామాన్యంగా ఉంటుంది. గ్రహ సంచారం అనుకూలంగా లేనందున వృత్తి, వ్యాపారాలలో ఎంత కష్టపడినా ఆశించిన ప్రయోజనాలు లేక నిరాశ నిస్పృహలకు లోనవుతారు. అన్ని రంగాల వారికి ఈ వారం ప్రథమార్ధంలో ప్రతికూలతలు ఉండవచ్చు. వ్యాపారంలో హెచ్చు తగ్గులు రావచ్చు. అనుకోని ప్రయాణాలు ఉంటాయి. ఉద్యోగులు కెరీర్‌లో స్థిరత్వం కోసం శ్రమించాలి. ఆశించిన ఆర్థిక ప్రయోజనాలు అందుకోడానికి మరికొంత సమయం పట్టవచ్చు. వారం ద్వితీయార్థంలో ఉద్యోగులు సహోద్యోగులతో, ఉన్నతాధికారులతో కలిసి పనిచేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు కష్టపడి పనిచేస్తేనే విజయం సాధిస్తారు. మీ కోపావేశాల కారణంగా సన్నిహితుల మధ్య అపార్థాలు, అనుమానాలతో మనశ్శాంతి లోపిస్తుంది. కుటుంబంలో ఘర్షణ పూరిత వాతావరణం ఉంటుంది. ఇంటి మరమ్మత్తుల కోసం అధిక ధనవ్యయం ఉండవచ్చు. ఆర్థికంగా గడ్డుకాలం. మెరుగైన ఫలితాల కోసం శ్రీదుర్గామల్లేశ్వర స్వామిని ఆరాధించండి.

మిథునం (Gemini) :మిథున రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగులు గత కొంత కాలంగా పనిచేస్తున్న ప్రాజెక్టు విజయవంతంగా పూర్తవుతుంది. సహోద్యోగుల సహకారంతో ఈ విజయాన్ని సాధించగలుగుతారు. ఉన్నతాధికారుల మద్దతు సంపూర్ణంగా ఉంటుంది. మీ విజయాలకు అసూయపడే వారి పట్ల జాగ్రత్తగా ఉండాలి. భూమి, భవనాలకు సంబంధించిన వివాదాలు పరిష్కారమవుతాయి. వ్యాపారులు, భాగస్వామ్య వ్యాపారాల విషయంలో ముందుచూపుతో వ్యవహరిస్తే మంచిది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు అద్భుతమైన శుభ వార్తలను అందుకుంటారు. షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేటప్పుడు సన్నిహితుల సలహాలు పాటిస్తే మంచిది. ఆర్థికంగా మంచి స్థాయికి చేరుకుంటారు. జీవిత భాగస్వామితో మంచి సమయాన్ని గడుపుతారు. శివారాధన శ్రేయస్కరం.

కర్కాటకం (Cancer) :కర్కాటక రాశి వారికి ఈ వారం సామాన్యంగా ఉంటుంది. వృత్తి, వ్యాపార రంగాల వారు, ఉద్యోగులు తమ లక్ష్యంపై నుంచి దృష్టి మరలకుండా జాగ్రత్త వహించాలి. అహంకారం, అధికార గర్వం వీడి అందరినీ కలుపుకొని పోవడం మంచిది. సమిష్టి కృషితో సాధించిన విజయాల ప్రయోజనం అందరికీ చెందేలా వ్యవహరిస్తే మేలు. ఉద్యోగంలో మార్పు కోసం ప్రయత్నించేవారికి కోరుకున్న ఉద్యోగం దొరుకుతుంది. వ్యాపారులకు వ్యాపారంలో హెచ్చు తగ్గులు ఉంటాయి. లాభాలు కూడా ఆశించిన మేరకు ఉండకపోవచ్చు. ముఖ్యమైన వ్యవహారాలు, ప్రయాణాలు వాయిదా వేసుకుంటే మంచిది. అమ్మవారి ఆలయ సందర్శన ఆపదలను తొలగిస్తుంది.

సింహం (Leo) :సింహరాశి వారికి ఈ వారం అన్నివిధాలా అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి వృత్తిలో సంతృప్తికరమైన పురోగతి ఉంటుంది. నూతన అవకాశాలను అందుకుంటారు. ఊహించిన దానికన్నా ఎక్కువ ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి. కుటుంబ శ్రేయస్సు కోసం పనిచేస్తారు. స్నేహితుల సాయంతో దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తి చేస్తారు. వ్యాపారులు వ్యూహాత్మకంగా పనిచేసి సంస్థని అభివృద్ధి చేస్తారు. వ్యాపార విస్తరణ కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పొందుతారు. వారం చివరలో విలాసాల కోసం అధికంగా ధనవ్యయం ఉండవచ్చు. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. ఆరోగ్యం సహకరిస్తుంది. జీవితభాగస్వామితో బంధాలు దృఢపడతాయి. విహార యాత్రలు, విందు వినోదాలతో కాలక్షేపం చేస్తారు. ఇష్ట దేవతారాధన శుభకరం.

కన్య (Virgo) : కన్యా రాశి వారికి ఈ వారం సామాన్యంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి వృత్తి, వ్యాపారాలలో పురోగతి అస్థిరంగా ఉంటుంది. ఉద్యోగులకు పనిభారం పెరగడంతో ఒత్తిడికి లోనవుతారు. ఆరోగ్యం దెబ్బ తింటుంది. తగిన విశ్రాంతి అవసరం. సహోద్యోగుల, ఉన్నతాధికారుల సహకారంతో పనులు పూర్తి చేస్తారు. వ్యాపారులు సమయానుకూలంగా నడుచుకుంటే వ్యాపారంలో పురోగతి సాధించవచ్చు. స్థిరాస్తి వ్యవహారాలలో అడ్డంకులు ఎదురవుతాయి. కుటుంబ వ్యవహారాల్లో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేలా చూసుకోండి. వ్యక్తిగత జీవితంలో సమస్యలు తలెత్తవచ్చు. జీవిత భాగస్వామితో మంచి సమయాన్ని గడపండి. శనిస్తోత్ర పారాయణ చేయడం వలన ఆపదలు తొలగిపోతాయి.

తుల (Libra) :తులారాశి వారికి ఈ వారం సామాన్యంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాలలో పనిభారం పెరగడం వల్ల తీవ్రమైన ఒత్తిడికి గురవుతారు. ఉద్యోగంలో ఊహించని సమస్యలు, ఇబ్బందులు ఉండవచ్చు . ఆర్థిక సమస్యలు పెరుగుతాయి. కుటుంబంలో గొడవలు తీవ్రస్థాయికి చేరుకుంటాయి. విద్యార్థులు విజయం కోసం తీవ్రంగా శ్రమించాలి. ఆర్థిక పరిస్థితి నిరాశాజనకంగా ఉంటుంది. ఖర్చులు అదుపు తప్పుతాయి. మీ జీవిత భాగస్వామితో విభేదాల కారణంగా మానసిక అశాంతికి లోనవుతారు. స్థిరాస్తి, షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేముందు కుటుంబ సభ్యుల సలహా తీసుకుంటే మంచిది. శివపార్వతుల ఆలయ సందర్శనతో మెరుగైన ఫలితాలు ఉంటాయి.

వృశ్చికం (Scorpio) :వృశ్చికరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అన్ని వైపుల నుంచి సవాళ్లు ఎదురవుతాయి. వృత్తి, వ్యాపార రంగాల వారు ఆటంకాలను అవకాశాలుగా మలుచుకుంటూ ముందుకెళ్తే మంచిది. మీ స్వధర్మమే మిమ్మల్ని కాపాడుతుంది. మీ ప్రతిభతో ఎలాంటి అవరోధాలనైనా అవలీలగా ఎదురుకొంటారు. దైవబలం అండగా ఉంది. విద్యార్థులు తీవ్రమైన కృషి పట్టుదల ఉంటే విజయాలను పొందగలరు. శత్రువులు పొంచి ఉన్నారు. అప్రమత్తంగా ఉండాల్సిన సమయం. వ్యాపారులు వ్యాపార నిమిత్తం ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ప్రయాణంలో అదనపు జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండండి. సంతోషకరమైన వైవాహిక జీవితం కొనసాగుతుంది. దుర్గాస్తుతి చేయడం శ్రేయస్కరం.

ధనుస్సు (Sagittarius) :ధనుస్సు రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. బంధు మిత్రులతో విహార యాత్రలకు వెళతారు. కొత్తగా వ్యాపారం ప్రారంభించాలనుకునే వారికి, వ్యాపార విస్తరణ చేయాలనుకునేవారికి శుభ సమయం నడుస్తోంది. ఉద్యోగులు కోరుకున్న ప్రమోషన్ పొందుతారు. ఉద్యోగంలో మార్పు కోరుకునే వారు, నిరుద్యోగులు కోరుకున్న ఉద్యోగాన్ని పొందుతారు. సంపద వృద్ధి చెందుతుంది. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మీ సంతానానికి సంబంధించిన శుభవార్తలు వింటారు. కుటుంబ సభ్యులతో ఉన్న అపార్థాలు తొలగిపోతాయి. ఖర్చులు అదుపులో ఉంచుకుంటే మంచిది. ఆరోగ్యం సహకరిస్తుంది. ఓ శుభవార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. శ్రీ లలితా సహస్రనామ పారాయణ శుభకరం.

మకరం (Capricorn) :మకరరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అన్ని రంగాల వారు లక్ష్య సాధన నుంచి దృష్టి మరలకుండా జాగ్రత్త పడండి. వృత్తి పరంగా ఎదురయ్యే సవాళ్ళను అధిగమించే ప్రయత్నం చేయండి. నిరుద్యోగులు కోరుకున్న ఉద్యోగాన్ని పొందుతారు. అవివాహితులకు వివాహం నిశ్చయమవుతుంది. భూవివాదాలలో కోర్టు తీర్పు మీకు అనుకూలంగా రావచ్చు. మిమ్మల్ని తప్పుదారి పట్టించేవారు మీ పక్కనే ఉంటారు. వారితో జాగ్రత్తగా వ్యవరించాలి. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉంటాయి. ఏదైనా పెట్టుబడులు పెట్టేముందు విశ్వసనీయతను పరీక్షించండి. వైవాహిక జీవితం ఆనందదాయకంగా ఉంటుంది. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. ఇష్ట దేవతారాధన శుభప్రదం.

కుంభం (Aquarius) :కుంభ రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. కుటుంబంలో సంతోషం నెలకొల్పడానికి మీరు చేసే ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఉద్యోగులకు అదనపు ఆదాయ వనరులు సమకూరుతాయి. బంధువుల ఇంట్లో జరిగే శుభకార్యాల్లో పాల్గొంటారు. వ్యాపారులు వ్యాపారంలో పురోగతి చూస్తారు. వ్యాపార విస్తరణ కోసం చేసే ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తాయి. మంచి లాభాలను కూడా అందుకుంటారు. జీవిత భాగస్వాముల మధ్య పరస్పర అవగాహన, విశ్వాసం పెరుగుతాయి. సన్నిహితుల నుంచి ఆశ్చర్యకరమైన బహుమతులను అందుకుంటారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఆరోగ్యం బాగుంటుంది. దుర్గాదేవి ధ్యానం శుభకరం.

మీనం (Pisces) :మీన రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. కెరీర్‌లో ముందుకెళ్లడానికి అవసరమైన వృత్తి నైపుణ్యాలను పెంచుకుంటారు. మీ అభివృద్ధికి ఇది ఎంతో అవసరం. కొత్త అవకాశాలను అందిపుచ్చుకుంటారు. ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ కీలకమైన సమాచారం అందుకుంటారు. షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టినవారు ఊహించని లాభాలు అందుకుంటారు. మీ ప్రియమైన వారితో మంచి సమయాన్ని గడుపుతారు. అవివాహితులకు వివాహం నిశ్చయమవుతుంది. దూరప్రాంతాల నుంచి శుభవార్తలు అందుకుంటారు. కుటుంబ ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. ఆర్థికంగా బలోపేతం అవుతారు. ఆరోగ్యం సహకరిస్తుంది. ప్రయాణాలలో ఖర్చులు అధికంగా ఉంటాయి. జీవిత భాగస్వామితో అనుబంధం దృఢ పడుతుంది. ఇష్ట దేవతారాధన శుభప్రదం.

ABOUT THE AUTHOR

...view details