Nagula Chavithi 2024 :వేదవ్యాసుడు రచించిన స్కంద పురాణం ప్రకారం మనకు వేదాల్లో నాగ పూజ ప్రసక్తి లేనప్పటికీ, సంహితాల్లో, బ్రాహ్మణాల్లో ఆ ప్రసక్తి వస్తుంది. నాగు పామును నాగ రాజుగా, నాగ దేవతగా పూజిస్తారు. ముఖ్యంగా దీపావళి అమావాస్య తర్వాత వచ్చే కార్తీక శుద్ధ చవితి నాడు నాగు పాములను పూజించడం తరతరాలుగా వస్తున్న సంప్రదాయం.
ఎందుకీ సంప్రదాయం?
జంతువులను పూజించడం సంప్రదాయంగా ఎందుకు మారిందంటే- భారత సనాతన సంప్రదాయంగా వస్తున్న విశ్వాసాన్ని అనుసరించి సమస్త జీవకోటిలో ఈశ్వరుడు ఉన్నాడని, ప్రకృతి ఆరాధనలో భాగంగానే సర్పాలను కూడా పూజించడం ఒక సంప్రదాయంగా మారింది. ముఖ్యంగా కార్తీక శుద్ధ చవితి నాడు జరుపుకునే నాగుల చవితి పండుగ తెలుగు రాష్ట్రాలలో చాలా పెద్ద పండుగ.
కుజ దోషాలను పోగొట్టే నాగుల చవితి
కార్తీక శుద్ధ చవితి రోజు చేసుకునే నాగుల చవతి పండుగ నాడు నాగదేవతలను పూజించడం వల్ల కుజదోషాలు తొలగిపోవడం సహా కాలసర్ప దోషం వంటి దోషాలు కూడా తొలగిపోతాయని శాస్త్రవచనం.
నాగుల చవితి ఎప్పుడు
తెలుగు పంచాంగం ప్రకారం కార్తీక శుద్ధ చవితి నవంబర్ 5వ తేదీ మంగళవారం వచ్చింది కాబట్టి ఆ రోజునే నాగుల చవితి పండుగ జరుపుకోవాలని పంచాంగ కర్తలు సూచిస్తున్నారు. మంగళవారం ఉదయం 5 గంటల నుంచి 9 గంటల వరకు పూజకు శుభసమయం. ఈసారి నాగుల చవితి మంగళవారం రావడం మరింత విశేషమైనది పండితులు చెబుతున్నారు. ఏ మాత్రం వీలు ఉన్నా నాగుల చవితి రోజు దేవాలయాలలో వెలసిన సుబ్రహ్మణ్య స్వరూపమైన నాగ ప్రతిష్టకు క్షీరాభిషేకం చేయడం ఉత్తమం.
పుట్టలో పాలు పోసే ఆచారం ఇందుకే వచ్చింది
నాగుల చవితి విశిష్టత అంతా పుట్టలో పాలు పోయడంలోనే ఉంది. ఈ పండుగ రోజున ఊరిలో ఉన్న దేవాలయాల్లో ఉన్న పాము పుట్టలో లేదా ఊరి బయట ఉన్న పుట్టలో పాలు పోస్తారు. పుట్టలో పాలు పోయడమనేది అనాదిగా వస్తున్న ఆచారం. పట్టణ, నగర ప్రాంతాల్లో కంటే గ్రామీణ ప్రాంతాల్లో నాగుల చవితి సందడి ఎక్కువగా ఉంటుంది. చవితి నాడు సర్పాలను పూజిస్తే సర్వరోగాలు, వైవాహిక జీవితంలో దోషాలు, గర్భదోషాలు పోయి ఆరోగ్యవంతులవుతారని భక్తులు విశ్వసిస్తారు.
పురాణాలలో నాగుల చవితి ప్రసక్తి
మన పురాణాల్లో నాగుల చవితి గురించి ఎన్నో గాథలు ఉన్నాయి. దేశమంతట పలు దేవాలయాల్లో నాగేంద్రుని విగ్రహాలు కనిపిస్తూనే ఉంటాయి. ఈ నాగుల చవితి నాడు నాగేంద్రుడు శివుడికి వాసుకిగా, శ్రీ మహావిష్ణువుకు శేషుడిగా తోడు ఉంటాడు కాబట్టి ఈ చవితి ఈ రోజు భక్తులు పూజ చేసి నైవేద్యాలను సమర్పిస్తారు. ఇలా చేయడం ద్వారా సర్వరోగాలు పోయి సౌభాగ్యులవుతారని విశ్వసిస్తారు. కుజ దోషం, కాలసర్ప దోషానికి ఆదిదేవుడు సుబ్రహ్మణ్య స్వామి కాబట్టి నాగుపాము పుట్టకు పూజ చేస్తే కళత్ర దోషాలు తొలుగుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి.
నాగుల చవితి ఉపవాసం ఎలా చేయాలి?
నాగుల చవితి ప్రధానంగా ఉపవాసాల పండుగ. ఈ రోజున భక్తులు ఉపవాసం ఉండి ఉదయాన్నే పుట్టలో పాలు పోసి, చలిమిడి, చిమ్మిరి వంటి పదార్థాలు నాగ దేవతకు నైవేద్యంగా సమర్పించి అనంతరం ఇంటికి తిరిగి వచ్చి ఆ రోజంతా పూర్తి ఉపవాసం ఉంటారు. ముఖ్యంగా ఈ రోజు ఉడికించిన, వేడి చేసిన ఆహార పదార్థాలు తినరాదు. పచ్చి కూరగాయలు, వేడి చేయని పచ్చి పాలు, పళ్లు, పళ్లరసాలు వంటివి మాత్రమే తీసుకోవాలి.