తెలంగాణ

telangana

ETV Bharat / spiritual

కుజ, సర్ప దోషాల నుంచి విముక్తినిచ్చే సుబ్రమణ్యస్వామి! ఈ మహిమాన్విత క్షేత్రం ఎక్కడుందో తెలుసా? - Nadipudi Subramanya Swamy Temple - NADIPUDI SUBRAMANYA SWAMY TEMPLE

Nadipudi Subramanya Swamy Temple : దక్షిణ భారతంలో సుబ్రహ్మణ్య స్వామిని విశేషంగా ఆరాధిస్తారు. సుబ్రహ్మణ్యునికి ఎన్నో క్షేత్రాలు కూడా ఉన్నాయి. కుజ గ్రహానికి అధిపతిగా ఉన్న సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధిస్తే జాతకంలో కుజ దోషం ఉన్నా, నాగ దోషాలు ఉన్నా పోతాయని విశ్వాసం. ప్రత్యేకంగా తెలుగు రాష్ట్రంలోని ఓ క్షేత్రంలో సుబ్రహ్మణ్యుడు ప్రత్యక్షంగా దర్శనమిస్తాడని చెబుతారు. ఆ క్షేత్ర విశేషాలేమిటో చూద్దాం.

Subramanya Swamy
Subramanya Swamy (GettyImages)

By ETV Bharat Telugu Team

Published : May 28, 2024, 5:11 AM IST

Nadipudi Subramanya Swamy Temple : ఆంధ్రప్రదేశ్​లోని తూర్పు గోదావరి జిల్లా రావులపాలెం సమీపంలో ఉన్న నడిపూడి గ్రామంలో సుబ్రహ్మణ్య స్వామి సర్ప రూపంలో దర్శనమివ్వడం విశేషం. అత్యంత మహిమాన్వితమైన ఈ క్షేత్రం విశేషాలు, స్థల పురాణం తెలుసుకుందాం.

స్వయంభువుగా వెలసిన సుబ్రహ్మణ్యుడు
నడిపూడిలో సుబ్రహ్మణ్యుడు స్వయంభువుగా వెలసినట్లుగా ఆలయ స్థల పురాణం ద్వారా తెలుస్తోంది.

నడిపూడి పేరు ఇలా!
ప్రతి సంవత్సరం గోదావరి నదికి వచ్చే వరదల కారణంగా ప్రవాహ వేగానికి నది-పూడిక ద్వారా ఏర్పడిన ఈ గ్రామం 'నదిపుడి' అని కాలక్రమేణా నడిపూడిగా మారింది. 1973 సంవత్సరంలో ఈ ఆలయ జీర్ణోద్ధరణ కార్యక్రమము, శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వార్ల విగ్రహ ప్రతిష్ఠ జరిగింది.

స్థల పురాణం
శతాబ్దాల క్రితం కాటన్ బ్యారేజి కూడా నిర్మించక ముందు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారు సర్ప రూపంలో నాశికా త్రయంబకం నుంచి గోదావరి నదిలో ప్రయాణం చేస్తూ ఋషుల తపస్సులు, పండితుల వేద ఘోషతో నిత్యం విరాజిల్లే వశిష్ట గోదావరి నదీ ఒడ్డుకు చేరుకున్నారు. కొంతకాలం గడిచిన తర్వాత శ్రీ స్వామి వారు ఒక భక్తునికి స్వప్నంలో కనిపించి తనకు గ్రామోత్సవము జరిపించమని, గ్రామోత్సవము జరిపించిన ఆ పల్లకి ఎక్కడ ఆగిపోతుందో ఆ ప్రదేశంలోనే తనని ప్రతిష్టించమని ఆజ్ఞాపించారు. అప్పుడు ఆ భక్తుడు గ్రామస్తుల సహకారంతో స్వామి వారి కోరిక ప్రకారం అరటి దొప్పలతో పల్లకి తయారు చేసి స్వామి వారిని గ్రామంలో ఊరేగించి, పల్లకి ఆగిన చోట ఆలయాన్ని నిర్మించారు. అప్పటి నుండి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు స్వయంభువుగా ఈ ఆలయం నందు కొలువై ఉన్నారు.

అద్భుతం సుబ్రహ్మణ్యుని ప్రత్యక్ష దర్శనం
ఎంతో ప్రసిద్ధమైన ఈ క్షేత్రంలో స్వామి వారికి తూర్పు వైపున ద్వారబంధము లోపల స్వామి పుట్ట ఉన్నది. ఇది ఎవరు నిర్మాణం చేసింది కాదు. స్వామి వారు ఈ పుట్టలో సర్ప రూపంలో కొలువై ఉన్నాడని భక్తుల నమ్మకం. ఈ పుట్టను దర్శనం చేసుకోవడానికి దేవస్థానం వారు ఒక అద్దాన్ని ఏర్పాటు చేసారు. ఈ నాటికీ ఈ పుట్టలో సర్పం ఉంటుంది. ఈ సర్పం రాత్రివేళలో ఆ పుట్టలోకి ప్రవేశించి, ఉదయాన్నే బయటకు వెళ్లిపోతుంది. ఈ దృశ్యాన్ని ప్రత్యక్షంగా చూసిన భక్తులు చాలామంది వున్నారు. సుబ్రహ్మణ్యస్వామి ఇక్కడ ప్రత్యక్షంగా కొలువై వున్నాడని స్థానికులు నమ్ముతుంటారు.

నాగ సర్ప దోషాల నుంచి విముక్తి
కుజ దోషాలు, సర్ప దోషాలతో బాధపడేవారు ఈ క్షేత్ర దర్శనం చేయడం వలన, ఆ దోషాల నుంచి విముక్తి లభిస్తుందని చెబుతారు.

ఆలయంలో జరిగే విశేష పూజలు

  • ఈ ఆలయంలో స్వామివారికి ప్రతిరోజూ అభిషేకం, కళ్యాణము జరుగును.
  • మార్గశిర శుద్ధ పంచమి రోజు రాత్రి స్వామి వారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగుతుంది.
  • మార్గశిర శుద్ధ షష్ఠి, సుబ్రహ్మణ్య షష్ఠి వంటి పర్వదినాల్లో ఈ క్షేత్రాన్ని దర్శించే భక్తుల సంఖ్య అధికంగా ఉంటుంది. ఆ రోజు రథోత్సవం, తిరునాళ్లు వేడుకగా జరుగుతాయి.
  • ఆషాడ శుద్ధ షష్ఠి, కృత్తికా నక్షత్రం రోజు విశేష పూజలు జరుగుతాయి.
  • శ్రావణ శుద్ధ పంచమి రోజు స్వామివారికి విశేష క్షీరాభిషేకాలు జరుగుతాయి.
  • ముక్కోటి ఏకాదశి రోజు స్వామి వారి ఉత్తర ద్వార దర్శనం కన్నుల పండుగలా జరుగుతుంది.
  • నాగుల చవితి, స్కంద షష్ఠి రోజు స్వామి వారికి పాలాభిషేకాలు జరుగుతాయి.

ఆలయానికి ఎలా చేరుకోవచ్చు
రాజమండ్రి నుంచి ఈ ఆలయం చేరుకోవడానికి ఆటో, బస్సు సౌకర్యం కలదు. మహిమాన్వితమైన ఈ సుబ్రహ్మణ్య క్షేత్రాన్ని దర్శిద్దాం, తరిద్దాం. ఓం శ్రీ సుబ్రమణ్య స్వామియే నమః

ముఖ్య గమనిక :పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ABOUT THE AUTHOR

...view details