Maha Kumbh Mela Shahi Snan:భారతదేశంలో జరిగే అతిపెద్ద ఆధాత్మిక ఉత్సవం మహా కుంభమేళా. మహాకుంభ మేళా జాతర 2025 జనవరి 13 వ తేదీ నుంచి మొదలు కానున్న సందర్భంగా ఈ కుంభ మేళాలో తొలి రాజ స్నానం ఎప్పుడు ఆచరించాలి, రాజ స్నానం సందర్భంగా ఎలాంటి విధి విధానాలు ఆచరించాలి అనే విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
తొలి రాజ స్నానం ఎప్పుడు?
ప్రయాగరాజ్‌లో దాదాపు 45 రోజుల పాటు జరిగే మహా కుంభ మేళాలో మొత్తం ఆరు రాజ స్నానాలు జరగనుండగా, మొదటి రాజ స్నానం అత్యంత పవిత్రమైన పుష్య పౌర్ణమి రోజు అనగా జనవరి 13న జరుగనుంది.
మొదటి రాజ స్నానానికి శుభ సమయం
తెలుగు పంచాంగం ప్రకారం నూతన సంవత్సరంలో పుష్య మాసం పూర్ణిమ తిథి జనవరి 13, 2025 ఉదయం 5.03 గంటలకు ప్రారంభమై జనవరి 14, 2025 తెల్లవారుజామున 3.56 గంటలకు ముగుస్తుంది. సూర్యోదయ తిథిని అనుసరించి పౌర్ణమి తిథి జనవరి 13 సోమవారం రోజు పుష్య పౌర్ణమిగా జరుపుకోవాలని సూచిస్తున్నారు. మహా కుంభ మేళాలో పరమ పవిత్రమైన పుష్య పౌర్ణమి రోజున తొలి రాజ స్నానం ఆచరిస్తారు. ఈ రోజున చేసే రాజ స్నానానికి శుభ ముహూర్తం ఉదయం 5.27 నుంచి 6.21 వరకు ఉంది.
పుష్య పౌర్ణమి విశిష్టత
సనాతన ధర్మం ప్రకారం పుష్య పౌర్ణమి మరుసటి రోజు నుంచి ఉత్తరాయణ పుణ్యకాలం మొదలవుతుంది. దక్షిణాయనంలో చేసే చివరి నదీ స్నానం కావడం వల్ల ఈ రోజున గంగ నదితో సహా పవిత్ర నదులలో స్నానం చేయడం విశేష ఫలితాలను ఇస్తుందని శాస్త్రవచనం.
రాజ స్నానం ఎలా చేయాలి
మహా కుంభ మేళాలో రాజ స్నానం చేసే వారు ముందుగా నదీమతల్లికి నమస్కరించుకుని నది ఒడ్డు నుంచి కొంత మట్టిని సేకరించి నదికి నమస్కరిస్తూ నదిలోకి ప్రవేశించాలి. సేకరించిన మట్టిని నదిలో కలపాలి. భక్తి శ్రద్ధలతో ముక్కు మూసుకొని మూడు సార్లు నదిలో మునగాలి. తరువాత దోసిలితో నీరు తీసుకొని తూర్పు తిరిగి సూర్యునికి అర్ధ్యం ఇవ్వాలి. తరువాత నది బయటకు వచ్చి నదిలోకి పసుపు కుంకుమ, పువ్వులు సమర్పించాలి. అరటి దొన్నె లో ఉంచిన దీపాలు నదిలో వదిలి నమస్కరించుకోవాలి. ఈ విధంగా శాస్త్రోక్తంగా నదీస్నానం పూర్తి చేసిన తరువాత నది తీరంలో పితృదేవతలకు పిండ ప్రదానం చేయడం వలన పితృదేవతలు సంతోషించి వంశాభివృద్ధి కలుగుతుంది.
తొలి రాజస్నాన ఫలం
- మహాకుంభమేళాలో చేసే తొలి రాజస్నానం వల్ల శరీరం, ఆత్మ శుద్ధి అవుతాయి.
- కుంభమేళాలో చేసే రాజస్నానం వల్ల పాపాలు నశించి మోక్షాన్ని పొందుతారని విశ్వాసం.
- కుంభమేళాలో రాజస్నానం చేస్తే శ్రీమహాలక్ష్మీదేవి అనుగ్రహంతో వారి ఇంట సిరి సంపదలు, భోగభాగ్యాలు తాండవం ఆడుతాయి.
- ముఖ్యంగా మహాకుంభమేళాలో తొలి రాజస్నానం చేసిన వారికి సమస్త గ్రహ దోషాలు తొలగిపోతాయి.
- రానున్న మహా కుంభమేళా లో మనం కూడా పాల్గొని రాజ స్నానం చేద్దాం.తరిద్దాం. శుభం భూయాత్!
ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం