Magha Puranam Chapter 7 :పరమ పవిత్రమైన మాఘ మాసంలో నిరాటంకంగా కొనసాగుతున్న మాఘ పురాణంలో ఏడో అధ్యాయంలో పరమ శివుడు పార్వతికి చెప్పిన సుశీలుడనే బ్రాహ్మణుని వృత్తాంతాన్ని ఈ కథనంలో శివపార్వతుల సంవాదం ద్వారా తెలుసుకుందాం.
శివపార్వతుల సంవాదం
పరమ శివుడు పార్వతితో "ఉమాదేవి! మాఘ మాస స్నాన మహత్యాన్ని వివరించే మరొక కథను చెబుతున్నాను శ్రద్దగా ఆలకింపుము" అని ఈ విధంగా చెప్పసాగాను.
మాఘ పురాణం ఏడో అధ్యాయం - సుశీలుడను బ్రాహ్మణుని వృత్తాంతం
పూర్వం ద్వాపర యుగంలో గోదావరి తీరమందు వేదవేదాంగాలు చదివిన సుశీలుడనే బ్రాహ్మణుడు కలడు. అతను దేశాటన చేయుచూ ఒకసారి దారితప్పి ఒక మహారణ్యంలోకి ప్రవేశించాడు. ఆ అరణ్యం సూర్యకాంతి కూడా ప్రసరించనంత దట్టమైన మామిడి, మద్ది, వెలగ, దేవదారు వంటి పెద్ద పెద్ద వృక్షాలతో, దట్టమైన ముండ్ల పొదలతో నిండి ఉంది. ఆ అరణ్యంలో భయంకరమైన క్రూర మృగాలు, అనేక రకాల విష సర్పాలు, రకరకాల పక్షులతో కూడి ఉండేది.
బ్రహ్మరాక్షసుని వృత్తాంతం
ఆ అరణ్యంలో చండ్రచెట్టు ఆకారంలో ఒక భయంకరమైన రాక్షసుడు ఉండేవాడు. వాడి పాదాలు చండ్రచెట్టులో ఉండేవి. మిగిలిన శరీరమంతా రాక్షసాకారంతో ఉండేది. ఎర్రని కన్నులతో పెద్ద నోరుతో భయానకంగా ఉండే ఆ రాక్షసుడి పాదాలు చండ్రచెట్టులో ఉండడం వలన గాలి వీచినప్పుడల్లా ఆ చెట్టు ముళ్ళు వాడి కాళ్లకు గుచ్చుకొని రక్తమాంసాలు బయటకు వస్తుండేవి. తిండి నీళ్లు లేక వాడు ఆ రక్తమాంసాలనే తింటూ ఆ బాధకు కాసేపు స్పృహ తప్పుతూ కాసేపు కళ్ళు తెరుస్తూ దుర్భరమైన పరిస్థితిలో ఉండేవాడు.
బ్రహ్మరాక్షసుని వివరాలు అడిగిన సుశీలుడు
మహారణ్యంలో దారితప్పి తిరుగుతున్న సుశీలుడు బ్రహ్మ రాక్షసుని చూసి భయపడిపోయాడు. కొంతసేపటికి ధైర్యం తెచ్చుకొని స్మశానమందు కానీ, వనమందు కానీ, నీటియందు కానీ, ఇంటియందు కానీ కలిగిన భయం శ్రీహరిని స్మరిస్తే పోవునని గుర్తొచ్చి మనసారా ఆ శ్రీహరిని ప్రార్థించాడు. అనంతరం ఆ రాక్షసుని వంక చూసి సుశీలుడు దయతో "ఓ రాక్షసాధమా! భయపడకుము. నీకు ఇంత బాధ కలగడానికి కారణమేమి? ఈ రాక్షస రూపం నీకు ఎలా వచ్చింది? పూర్వజన్మలో నీవేమి పాపం చేశావు? ఆ విషయమంతా నాకు వివరంగా చెప్తే నేనేమైనా నీకు సహాయం చేయగలనేమో చూద్దాం" అన్న సుశీలుని మాటలకూ రాక్షసుడు అతని వంక తీక్షణంగా చూశాడు.
సుశీలునికి తన దీనగాథ వివరించిన రాక్షసుడు
బ్రాహ్మణ దర్శనంతో రాక్షసునికి పూర్వజన్మ స్పృహ కలిగింది. అప్పుడు రాక్షసుడు సుశీలునితో "ఓ విప్రోత్తమా! నేడు నాకు మీ దర్శనం వలన పూర్వజన్మ స్మృతి కలిగింది. నేను పూర్వం గోకర్ణమునకు సమీపంలోని మధువ్రతం అనే గ్రామానికి అధికారిగా ఉండేవాడిని. ఆ గ్రామంలో అందరూ బ్రాహ్మణులే! నేను కూడా బ్రాహ్మణుడనే! కానీ నేను ఏ రోజు సంధ్యావందనం చేసి ఎరగను. ఆచారాలు పాటించలేదు. దైవారాధన విడిచి పెట్టి అధర్మ మార్గంలో నడుచుకుంటూ ఉండేవాడిని. ఎప్పుడు అసత్యం పలుకుతూ గ్రామంలోని బ్రాహ్మణుల ధనాన్ని అపహరిస్తూ ఉండేవాడిని. హరికథలు జరిగే చోట ఉండకుండా ఎప్పుడూ దుర్జనులు ఉండే ప్రదేశానికి వెళ్లి వారితో తిరుగుతూ ఉండేవాడిని. సజ్జన సాంగత్యం విడిచి దుర్జన సాంగత్యం చేసేవాడిని. నా జీవితంలో ఎవ్వరికీ ఒక్క ఉపకారం కూడా చేసి ఎరగను.