Magha Puranam 9th Chapter :పరమ పవిత్రమైన మాఘ మాసంలో నిరాటంకంగా కొనసాగుతున్న మాఘ పురాణంలో తొమ్మిదవ అధ్యాయంలో ఇంద్రుడు గాడిద ముఖం నుంచి ఏ విధంగా విముక్తి పొందాడో ఈ కథనంలో శివపార్వతుల సంవాదం ద్వారా తెలుసుకుందాం.
శివపార్వతుల సంవాదం
శివుడు పార్వతితో "పార్వతి! మాఘ మాసం చేసే నది స్నానం మానవులనే కాదు దేవతలను కూడా ఏ విధంగా తరింపజేస్తుందో వివరించే కథను చెబుతాను శ్రద్ధగా ఆలకింపుము" అంటూ ఈ విధంగా చెప్పసాగాడు.
మాఘ పురాణం తొమ్మిదో అధ్యాయం
పూర్వం వేదవేదాంగాలను అవపోసన పట్టిన గృత్స్నమదమహర్షి గంగానదిలో శిష్యులతో కలిసి మాఘ స్నానం చేసి గంగాతీరమున శిష్యులకు మాఘపురాణ శ్రవణం చేయుచున్న సమయంలో జహ్నువు మాఘ స్నానం మహత్యము వివరింపమని గృత్స్నమదమహర్షి ని కోరగా మహర్షి ఈ విధంగా చెప్పసాగెను.
గృత్స్నమదమహర్షి జహ్ను మహర్షుల సంవాదం
"ఓ జహ్నువు! మాఘ మాసమున ప్రాతః కాలంలో సూర్యుడు మకరరాశిలో ఉండగా మాఘస్నానం చేసిన నరుడు ఇంద్రుని వలే సమస్త పాతకములు నుంచి ముక్తిని పొందుతాడు" అనగా అప్పుడు జహ్నువు మహర్షి "ఆర్యా! ఇంద్రుడు ఏమి పాపం చేసాడు? మాఘస్నానంతో ఇంద్రుని పాపాలు ఎట్లు పోయాయి? వివరంగా చెప్పమని కోరగా, గృత్స్నమదమహర్షి జహ్ను మహర్షితో ఈ విధంగా చెప్పసాగెను.
ఇంద్రుని వృత్తాంతం
కృతయుగంలో తుంగభద్రా నదీతీరంలో ఒక పుణ్యాశ్రమంలో సమస్త వేదాలు చదివిన మిత్రవిందుడను మహాముని తన పత్నితో కలిసి నివసిస్తుండేవాడు. ఈ మహర్షి ప్రతినిత్యం శిష్యులకు వేదాలు, ఉపనిషత్తుల సారాన్ని బోధిస్తుండేవాడు. ఒకనాడు ఋషిపత్ని తుంగభద్రా నదిలో స్నానం చేసి నదీ తీరంలో కురులు ఆరబెట్టుకుంటూ కూర్చుని ఉన్నది. ఆ సమయంలో ఇంద్రుడు రాక్షసంహారం కోసం దిక్పాలకులతో, శూరులైన దేవతలతో కలిసి ఆకాశమార్గంలో వెళుతూ అతిలోక సౌందర్యవతియైన ఋషిపత్నిని చూసి మోహించాడు.
ఇంద్రుని కపటబుద్ధి
యుద్ధంలో రాక్షసులను జయించి తిరిగి స్వర్గానికి చేరుకున్న ఇంద్రునికి మనసులో ఋషిపత్ని మీద కోరిక అలాగే ఉండిపోయింది. ఇంద్రుడు తిరిగి మిత్రవిందుని ఆశ్రమానికి వచ్చిముని పర్ణశాల ద్వారం వద్ద నిలిచి ఋషిపత్నిని కామంతో చూడసాగెను. ఇంతలో మిత్రవిందుడు అపరాత్రి సమయంలో శిష్యులకు వేదాలు బోధించాలి కాబట్టి ఆయన శిష్యులను నిద్రలేపి వారికి వేదం బోధించసాగెను. ఇదే అదనుగా తలచి ఇంద్రుడు నిద్రిస్తున్న మిత్రవిందను లేపి తనతో సంగమించమని కోరాడు. అందుకు అంగీకరించని ఋషిపత్నిని బ్రతిమాలుతూ ఆమె అందాన్ని పొగడుతూ బుజ్జగిస్తూ తన కోరిక తీర్చమని ప్రాధేయపడ్డాడు. ఇంద్రుని చేష్టలకు ఋషిపత్ని కూడా కామ వికారానికి లోనై అతడితో సంగమించింది.
ఇంద్రుని శపించిన మిత్రవిందుడు
శిష్యులకు బోధన ముగించుకొని తిరిగి వచ్చిన మిత్రవిందుడు తన కుటీరంలో ఉన్న ఇంద్రుని చూసి వాడు జారుడని తలచి పట్టుకుని శిక్షించబోగా అప్పుడు ఇంద్రుడు తన నిజరూపంలో కనిపించి "నేను దేవేంద్రుడను! నా తప్పుకు సిగ్గుపడుతున్నాను. మన్నించమని కోరగా, జరిగినదంతా దివ్యదృష్టితో తెలుసుకున్న మిత్రవిందుడు తీవ్రమైన ఆగ్రహంతో"ఓరీ! జారకర్మ పరాయణుడా! నీవు క్షమించరాని పాపం చేసావు. నీకిదే నా శాపం! ఈనాటి నుంచి నీవు గాడిద ముఖంతో జారిన పెదవులతో నిటారుగా నిలుచున్న చెవులతో స్వర్గానికి పోయే శక్తిలేక భూలోకంలోనే పడివుండు" అని శపించాడు. అంత ఆ మిత్రవిందుడు తన భార్యను కూడా అరణ్యంలో పాషాణమై పడిఉండమని శపించి తన యోగమాయతో శరీరాన్ని విడిచి బ్రహ్మలోకాన్ని చేరాడు.