Magha Puranam 12th Chapter In Telugu :పరమ పవిత్రమైన మాఘ మాసంలో నిరాటంకంగా కొనసాగుతున్న మాఘ పురాణంలో పన్నెండవ అధ్యాయంలో మాఘ స్నానంతో తొండ రూపాన్ని విడిచిన సుశీల పుత్రిక వృత్తాంతం, పద్మ పర్వతం మీద ఇంద్రుని కనుగొన్న దేవతలు మాఘ స్నానంతో అతని గాడిద రూపాన్ని ఏవిధంగా పోగొట్టారో ఈ కథనంలో తెలుసుకుందాం.
మాఘ పురాణం పన్నెండో అధ్యాయం
పరమ శివుడు పార్వతికి గృత్స్నమదమహర్షి జహ్ను మహర్షుల సంవాదాన్ని తెలియజేస్తూ పన్నెండవ రోజు కథను చెప్పడం ప్రారంభించాడు.
గృత్స్నమదమహర్షి జహ్ను మహర్షుల సంవాదం
గృత్స్నమదమహర్షి జహ్ను మహర్షితో ఈ విధంగా చెప్పసాగెను. దేవతలు ఈ విధంగా తొండ రూపాన్ని విడిచిన సుందర వనితను ఆమె వృత్తాంతాన్ని వివరించమని కోరగా ఆమె ఈ విధంగా చెప్పడం మొదలు పెట్టింది.
సుశీల పుత్రిక వృత్తాంతం
దేవతలతో సుందరమైన వనిత ఇలా చెప్పడం ప్రారంభించింది. "నేను కశ్మీర దేశంలో సుశీలుడను బ్రాహ్మణును పుత్రికను. నా తండ్రి యుక్తవయసులో నాకు వివాహం చేశాడు. కానీ వివాహం అయిన నాలుగు రోజులకే నా భర్త మరణించాడు. అతిచిన్న వయసులోనే నాకు ఈ గతి పట్టడం చూసి నా తండ్రి విచారంతో జీవితంపై వైరాగ్యంతో నన్ను బంధువుల ఇంట్లో విడిచి పెట్టి నా తల్లితో కలిసి అరణ్యాలకు వెళ్లాడు. కొంతకాలం తర్వాత తన యోగ విద్యతో శరీరం విడిచి పుణ్యలోకాలకు చేరాడు. నా తల్లి కూడా అతనిని అనుసరించింది.
బంధువుల ఇంట దీనావస్థలో సుశీల పుత్రిక
బంధువుల ఇంట్లో ఉన్న నేను కష్టజీవిగా బిక్షాటన చేస్తూ జీవితాన్ని గడపసాగాను. నేను ఈ రోజు శుచియైన అన్నం తిని ఎరగను. ఎప్పుడు చద్ది అన్నం, ఇతరులు తిని వదిలేసిన అన్నాన్ని తింటూ ఉండేదాన్ని. వేళకు స్నానపానాదులు లేక శుచి శుభ్రం లేకుండా ఉండేదాన్ని. ఒక్కనాడు కూడా హరిని పూజించడం, దేవాలయానికి వెళ్లడం లాంటివి చేయలేదు. ఎవరైనా హరికథలు చెబుతున్నా వింటున్నా వారిని హేళన చేస్తుండేదాన్ని. చిల్లరగా కొన్ని వస్తువులు కొని తిరిగి అమ్ముతూ పుష్కలంగా ధనం సంపాదించాను. కానీ ఏనాడూ దైవకార్యం, దానధర్మాలు చేసి ఎరుగను.
ఎన్నో నీచ జన్మలు ఎత్తిన సుశీల పుత్రిక
ఇలా ఉండగా వయసులో ఉన్న నేను ఒక వైశ్య యువకునితో సంబంధం పెట్టుకొని అతని నుంచి ధనం తీసుకునేదాన్ని. ఇదే వృత్తిగా భావించి ఎంతోమందితో జారత్వానికి ఒడిగట్టి విపరీతంగా ధనం సంపాదించాను. కాలక్రమేణా మరణించాక నేను నరకంలో క్రూరమైన బాధలు అనుభవించాను. ఆ తరువాత అనేక జన్మల్లో భర్తలేని ఆడదానిగా, కోతిగా, కుక్కగా, పిశాచంగా, ఎద్దుగా, పశువులుగా, క్రిమికీటకాలుగా అనేక వందల జన్మలు ఎత్తాను. ఇప్పుడు మీరు నాకు మోక్షం ప్రసాదించిన తొండ జన్మను వెయ్యి సార్లు అనుభవించాను. ఒకానొక స్త్రీజన్మలో వైశాఖ మాసంలో నేను ఒక బ్రాహ్మణునికి మధ్యాహ్నం వేళ అన్నం పెట్టిన పుణ్యానికి ఇప్పుడు నా శాపవిమోచనం కలిగి ఇలా మారాను" అంటూ సుశీల పుత్రిక తన వృత్తాంతాన్ని దేవతలకు తెలియజేసింది.