Oppiliappan Temple Speciality:తమిళనాడు తంజావూరు సమీపంలో వెలసిన 'ఉప్పిలి అప్పన్' ఆలయంలో స్వామికి ఉప్పు లేని వంటకాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు. ఇలాంటి వింత ఆచారం ఈ ఆలయంలో ఏర్పడడానికి గల కారణాలేమిటి? ఈ ఆలయ విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఆలయ స్థల పురాణం
మహా శివ భక్తుడు మార్కండేయుడు లోక సంచారం చేస్తూ తమిళనాడులోని తంజావూరు సమీపంలోని తిరువ్విన్నగరం అనే ప్రాంతానికి చేరుకున్నాడు. ఆ ప్రాంతంలో ఏదో మహత్యం ఉందని గ్రహించిన మార్కండేయుడు తన తపస్సుకు అదే సరైన ప్రదేశంగా తలచి అక్కడ శ్రీ మహాలక్ష్మి కోసం కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేశాడు.
బాలిక రూపంలో లక్ష్మీదేవి
కొంత కాలం గడిచిన తర్వాత సిరుల తల్లి శ్రీ మహాలక్ష్మి ఒక చిన్న పిల్ల రూపంలో మార్కండేయుని ముందుకు వచ్చింది. మార్కండేయుడు తన తపస్సు సగం ఫలించిందని భావించి ఆ పిల్లను అల్లారుముద్దుగా పెంచి పెద్ద చేశాడు. ఆ బాలిక పున్నమి చంద్రుని వలే ప్రకాశిస్తూ మార్కండేయుని సంరక్షణలో పెరగసాగింది.
మారువేషంలో శ్రీమన్నారాయణుడు
శ్రావణమాసంలో ఒకనాడు శ్రీమహావిష్ణువు ఒక వృద్ధుని రూపంలో మార్కండేయుని ముందు ప్రత్యక్షమై ఆ బాలికను తనకు ఇచ్చి వివాహం చేయమని అడుగుతాడు. అప్పుడు మార్కండేయుడు 'నువ్వు చుస్తే ముసలి వాడివి నా కుమార్తె చిన్నపిల్ల. కనీసం వంటలో ఉప్పు సరిగా వేసిందో లేదో కూడా తెలియని అమాయకురాలు, అలాంటి పిల్లని నీకిచ్చి ఎలా పెళ్లి చేయగలను' అని ప్రశ్నిస్తాడు.
ఉప్పు లేకపోయినా సరే!
మార్కండేయుని మాటలకు విష్ణమూర్తి ఆ బాలిక ఉప్పు లేకుండా వంట చేసినా తాను తింటానని, ఎలాగైనా సరే ఆ బాలికను పెళ్లి చేసుకోకుండా అక్కడ నుంచి కదిలే ప్రసక్తే లేదని తేల్చి చెప్తాడు.
మార్కండేయుని దివ్య దృష్టి
అప్పుడు మార్కండేయుడు కనులు మూసుకుని తన దివ్య దృష్టితో వృద్ధుని రూపంలో వచ్చింది సాక్షాత్తూ ఆ శ్రీమన్నారాయణుడే అని గ్రహిస్తాడు. కనులు తెరిచి చూసేసరికి కళ్ళముందు శంఖ, చక్ర, గధారూరుడైన విష్ణుమూర్తి దర్శనమిస్తాడు. అప్పుడు మార్కండేయుడు తన కూతురిని విష్ణువుకి ఇచ్చి పెళ్లి చేస్తాడు. మార్కండేయుని కోరిక మేరకు ఇక్కడ విష్ణుమూర్తి లక్ష్మీ సమేతంగా 'ఉప్పిలి అప్పన్' గా వెలిశాడు.
ఈ నాటికి స్వామికి ఉప్పు లేని నైవేద్యమే!ఆనాటి ఘటనకు సాక్షిగా ఈనాటికీ ఈ ఆలయంలో స్వామికి ఉప్పులేని నైవేద్యమే సమర్పిస్తారు.
ఉత్సవాలు - వేడుకలు
ఉప్పిలి అప్పన్ ఆలయంలో ప్రతి ఏటా ఫాల్గుణ మాసంలో రథోత్సవం కన్నుల పండువగా జరుగుతుంది. ఈ ఉత్సవంలో శ్రీమహావిష్ణువు భూదేవితో కలిసి ఉప్పిలి అప్పన్గా తిరువీధులలో ఊరేగుతూ భక్తులను అనుగ్రహిస్తాడు. అంతేకాకుండా ఈ ఆలయంలో వసంతోత్సవాలు, కళ్యాణోత్సవాలు ఎంతో ఘనంగా జరుగుతాయి. శ్రీరామనవమి నుంచి పది రోజుల పాటు ఘనంగా ఉత్సవాలు నిర్వహించి ఆఖరి రోజు కనకాభిషేకం, శ్రీరామ పట్టాభిషేకంతో ఉత్సవాలు ముగుస్తాయి. ఈ ఉత్సవాలు చూడడానికి తమిళనాడు నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తారు. లక్ష్మీ సమేతంగా వెలసిన ఉప్పిలి అప్పన్ను దర్శించుకుంటే అవివాహితులకు శీఘ్రంగా వివాహం అయ్యి, లక్ష్మీదేవి అనుగ్రహంతో అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని శాస్త్రవచనం. ఓం నమో నారాయణాయ! శ్రీ మహాలక్ష్మీ దేవ్యై నమః
ముఖ్య గమనిక :పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.
విష్ణుమూర్తి కూర్మావతారం వెనుక కారణమేంటి? కూర్మ జయంతి రోజు ఏం చేయాలి? - Kurma Jayanti 2024
తొలి ఏకాదశి అంటే ఏమిటి? విష్ణుమూర్తి ప్రసన్నం కావాలంటే ఏం చేయాలి?