Lord Ganesh Vastu Tips : విఘ్నేశ్వరుడు అంటే విఘ్నాలను తొలగించేవాడు అని అర్థం. అందుకే.. హిందువులంతా ఏ పని ప్రారంభించినా.. ఎటువంటి ఆటంకాలూ కలగకుండా ఉండాలని గణపతి దేవుడికే తొలి పూజ చేస్తుంటారు. ఏకదంతుడికి నిత్య పూజలు చేసేందుకోసం భక్తులు తమ ఇంట్లో వినాయక ప్రతిమలను ప్రతిష్ఠించుకుంటారు. అయితే.. ఇంట్లో ప్రతిష్ఠించే వినాయకుడి తొండం ఎటువైపు ఉండాలనే విషయం.. చాలా మంది తెలియదు. తొండం ఎడమ వైపున ఉన్నది తీసుకోవాలా? లేదా కుడి వైపున ఉన్నది తీసుకోవాలా? అనే సంగతి తెలియదు. మరి.. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఉంచే ప్రతిమ తొండం ఎటువైపు ఉండాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
తొండం కుడివైపు ఉన్న గణపతి విగ్రహం విశేషాలు..
వినాయక విగ్రహానికి తొండం కుడివైపు ఉంటే ఆ విగ్రహాన్ని 'దక్షిణ మూర్తి' అంటారు. హిందూ ధర్మాల ప్రకారం.. ఈ విగ్రహాలకు చాలా శక్తి ఉంటుందట. ఈ విగ్రహాలు అపారమైన సూర్యశక్తి కలిగి ఉంటాయని పండితులు చెబుతున్నారు. సనాతన ధర్మంలో కుడివైపును యమలోక దిశగా చెబుతారు. ఈ విధంగా తొండం ఉన్న విగ్రహాలను పూజించేట్పపుడు నియమనిష్టలు కచ్చితంగా పాటించాలని వాస్తు నిపుణులు తెలియజేస్తున్నారు. తొండం కుడివైపున ఉన్న విగ్రహాలను పూజించడం వల్ల కష్టాలు అన్నీ తొలగిపోయి జీవితంలో అంతా మంచి జరుగుతుందని చెబుతున్నారు. అలాగే కోరిన కోరికలు వెంటనే నెరవేరుతాయట. అందుకే ఈ గణేశుడిని 'సిద్ధి వినాయకుడు' అని కూడా పిలుస్తారు. అయితే.. ఈ విగ్రహాలు ఆలయాల్లో ఎక్కువగా ఉంటాయని చెబుతున్నారు.
తొండం ఎడమై వైపు ఉన్న గణపతి ప్రాముఖ్యత :
వినాయక విగ్రహానికి తొండం ఎడమ వైపు ఉన్న వాటిని 'వామముఖి మూర్తి' అని పిలుస్తారు. ఈ విగ్రహాలలో అపారమైన చంద్రుడి శక్తి నిండి ఉంటుందని పండితులు చెబుతున్నారు. ఈ విధంగా ఉన్న విగ్రహాలను ఇళ్లలో ప్రతిష్ఠించుకోవాలని సూచిస్తున్నారు. రోజూ ఈగణపతి దేవుడినిఆరాధించడం వల్ల ఇంట్లో ప్రతికూల ప్రభావాలు తొలగిపోయి.. పాజిటివ్ ఎనర్జీ నిండుతుందని తెలియజేస్తున్నారు. ఇళ్లలో గణపతి విగ్రహాన్ని పెట్టుకోవాలని ఆలోచిస్తున్న వారు.. ఎడమవైపు తొండం ఉన్నది తీసుకోవడం మంచిదని సూచిస్తున్నారు.