Dhanvantari Jayanthi :ఆరోగ్యమే మహాభాగ్యమని పెద్దలు అంటారు. జీవితంలో ఎంత ఐశ్వర్యమున్నా ఆరోగ్యం లేకుంటే ఏదీ అనుభవించలేము. షడ్రసోపేతమైన భోజనం కళ్ళెదురుగా ఉన్నా, ఒంట్లో అనారోగ్యం ఉంటే ఏమి ఫలం చెప్పండి? అందుకే ఐశ్వర్యంతో పాటు ఆరోగ్యాన్ని ప్రసాదించే దైవాలను పూజించడం హిందూ సంప్రదాయంలో ఒక భాగం. ఈ సందర్భంగా ఆరోగ్య ప్రదాత, అపమృత్యుదోషాన్ని నివారించే ధన్వంతరి జయంతి గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.
ధన్వంతరి జయంతి
క్షీరసాగర మథన సమయంలో అమృత భాండ కలశంతో పాలసముద్రం నుంచి ఉద్భవించిన శ్రీ మహావిష్ణువు అవతారమే ధన్వంతరి. ఆశ్వయుజ బహుళ త్రయోదశి నాడు ఆయన క్షీరసాగరం నుంచి ఉద్భవించాడు. కాబట్టి ఆ రోజును మనం ధన్వంతరి జయంతిగా జరుపుకుంటాం. బ్రహ్మవైవర్త పురాణం ప్రకారం, సూర్యభగవానుని వద్ద ఆయుర్వేదం నేర్చుకొన్న ధన్వంతరి, సూర్యుని 16 మంది శిష్యులలో ఒకడని తెలుస్తోంది.
ధన్వంతరి జయంతి ఎప్పుడు?
అక్టోబర్ 30వ తేదీ బుధవారం సూర్యోదయంతో ఆశ్వయుజ బహుళ త్రయోదశి తిథి ఉంది. కాబట్టి ఆ రోజునే ధన్వంతరి జయంతిని జరుపుకోవాలని పంచాంగ కర్తలు సూచిస్తున్నారు. ఈ రోజు ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు పూజకు శుభసమయం.
ధన్వంతరి పూజావిధానం
ఈ రోజు వేకువనే నిద్రలేచి శుచియై పూజామందిరాన్ని శుభ్రం చేసుకొని దీపారాధన చేసి, శ్రీమహావిష్ణువు స్వరూపమైన ధన్వంతరి చిత్రపటాన్ని గంధ పుష్పాక్షతలతో పూజించి యథాశక్తి నైవేద్యాలను సమర్పించాలి. ఇప్పుడు ధన్వంతరి జయంతి వెనుక ఉన్న పురాణ గాథను తెలుసుకుందాం.
ధన్వంతరి జయంతి వెనుక ఉన్న పురాణ గాథ
పోతన మహాకవి రచించిన భాగవతం అష్టమ స్కంధంలో వివరించిన ప్రకారం, క్షీరసాగరమథన సమయంలో అమృతం ఉద్భవించే ముందు హాలాహలం పుట్టింది. దానిని పరమశివుడు సేవించాడు. అలాగే వరుసగా కామధేనువు, ఉచ్ఛైశ్రవం, ఐరావతం, పారిజాతం, అప్సరసలు అవతరించారు. తరువాత రమాదేవి అంటే సాక్షాత్తు లక్ష్మీదేవి అవతరించి విష్ణువు వక్షో భాగాన్ని అలంకరించింది. తరువాత ధన్వంతరి అవతరించాడు.
ధన్వంతరి స్వరూపం
సాగర గర్భం నుంచి ఒక పురుషుడు, పీనాయుత బాహు దండాలను, కంబు కంఠాన్ని, పద్మారుణ లోచనాలను, విశాల వక్షఃప్రదేశాన్ని, సుస్నిగ్ధ కేశజాలాన్ని, నీల గాత్ర తేజాన్ని కలిగి, పీతాంబరం కట్టి, మణి కుండలాలు ధరించి, పుష్పమాలా సమలంకృతుడై, హస్తతలాన అమృత కలశాన్ని ధరించి ఆవిర్భవించాడు. అతను విష్ణు దేవుని అంశ వలన పుట్టిన వాడని, యజ్ఞభాగ భోజనుడు, ఆయుర్వేదజ్ఞుడు, మహనీయుడని బ్రహ్మాదులు గ్రహించి అతనికి "ధన్వంతరి" అని నామకరణం చేశారు.
ధన్వంతరి వంశస్తుడే కాశీరాజు
పురూరవ వంశ క్రమంలోని కాశీరాజు ధన్వంతరి క్షీర సాగరం నుంచి ఉద్భవించిన ధన్వంతరి వంశస్తుడు అని అతనికి ఆయుర్వేద ప్రవర్తకుడని పేరున్నట్లుగా మనకు తెలుస్తోంది. అంతేకాదు ఇతడు శుశ్రుతునికి ఆయుర్వేదం, శస్త్ర చికిత్స నేర్పాడు. ఇతడు పురాణాలలో చెప్పబడిన ధన్వంతరి అవతారమన్న విశ్వాసం కూడా ఉంది.
ఆయుర్వేదం
ధన్వంతరి ఆయుర్వేద శాస్త్రాన్ని ఎనిమిది భాగాలుగా విభజించాడు. అవి:
- కాయ చికిత్స (Internal Medicine)
- కౌమారభృత్య లేదా బాలచికిత్స (Paediatrics)
- భూతవైద్యం లేదా గ్రహచికిత్స (Psychiatry)
- శలాక్యతంత్ర (Otto-Rhino-Laryngology & Opthalmology)
- శల్యతంత్ర (Surgery)
- విషతంత్ర (Toxicology)
- రసాయన తంత్ర (Geriatrics)
- వశీకరణ తంత్ర (The therapy for male sterility, impotency and the promotion of virility)