Kurma Jayanti Significance :ఒకసారి దేవేంద్రుడు గర్వంతో దూర్వాస మహర్షి పట్ల అనుచితంగా ప్రవర్తిస్తాడు. అందుకు కోపించిన దూర్వాసుడు దేవతలంతా శక్తి హీనులవుతారని శపిస్తాడు. ఆనాటి నుంచి దేవతలు శక్తి హీనులై చివరకు దానవుల చేతిలో యుద్ధంలో ఓడిపోతారు. చివరకు దేవతలంతా శ్రీ మహా విష్ణువుకు మొరపెట్టుకోగా విష్ణుమూర్తి ఔషధాలు నిలయమైన క్షీరసాగరాన్ని మధించి అమృతాన్ని సాధించమని ఉపాయం చెబుతాడు.
క్షీరసాగర మధనం
అప్పుడు దేవతలు ఆ సమయంలో తమకన్నా బలవంతులుగా ఉన్న దానవులతో సంధి చేసుకుని వచ్చిన అమృతాన్ని కలిసి పంచుకోవాలని ఒప్పందానికి వచ్చి క్షీరసాగరాన్ని మధించడం మొదలు పెడతారు. మంధర పర్వతాన్ని కవ్వంగా చేసుకొని, వాసుకిని త్రాడుగా చేసుకొని క్షీరసాగరాన్ని చిలకడం మొదలు పెడతారు. కానీ మంధర పర్వతం బరువుకి సముద్రంలో మునిగి పోసాగింది. చివరకు అమృతోత్పాదనం సాధించలేని కార్యంగా మిగిలిపోతుంది.
అవతార స్వీకరణ
దేవ దానవులు అమృతం సాధించడం కష్టంగా మారిన సమయంలో శ్రీ మహావిష్ణువు కూర్మావతారమును అనగా తాబేలు రూపం ధరించి మంధర పర్వతం మునిగిపోకుండా తన వీపుపై మోస్తాడు.
ఉద్భవించిన భయంకర గరళం
శ్రీ మహావిష్ణువు సహకారంతో క్షీరసాగర మధనం నిరాటంకంగా కొనసాగింది. ఈ మధనంలో ముందుగా లోకాలను నాశనం చేసే హాలాహలం పుడుతుంది. సర్వమంగళా దేవి అనుమతితో ఆ పరమ శివుడు హాలాహలాన్ని మ్రింగి లోకాలను రక్షిస్తాడు. ఆ గరళాన్ని తన కంఠంలోనే నిలుపుకొని ఆనాటి నుంచి శివుడు గరళకంఠుడు అయ్యాడు.
శుభాలనిచ్చే అద్భుతాలు
హాలాహలం తర్వాత క్షీర సాగరం నుంచి వరుసగా మధువు, అప్సరసలు, కౌస్తుభము, ఉచ్ఛైశ్రవము, కల్పవృక్షం, కామధేనువు, ఐరావతము, చంద్రుడు మొదలగు శుభాలనిచ్చే అద్భుతాలు పుడతాయి.
శ్రీలక్ష్మీ జననం
క్షీర సాగరం నుంచి గొప్ప శుభ లక్షణాలతో శ్రీ మహాలక్ష్మీదేవి ఉద్భవించింది. ఆ సమయంలో సకల దేవతలు లక్ష్మీదేవిని అర్చించి, కానుకలు సమర్పిస్తారు. దేవేంద్రుడు శ్రీ మహాలక్ష్మిని కీర్తిస్తూ చేసిన మహాలక్ష్మి అష్టకం నేటికీ ఐశ్వర్యం కోరుకునేవారు ప్రతి శుక్రవారం పఠించడం ఆనవాయితీగా మారింది.